జిల్లాలో ఆయుధ డిపో!
ABN , Publish Date - Nov 20 , 2024 | 11:42 PM
జిల్లాకు కీలకమైన కేంద్ర ప్రాజెక్టు వచ్చే అవకాశం ఉంది. భారత నావికాదళం (నేవీ) జిల్లాలో ఆయుధ డిపో ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. జిల్లాకు కీలకమైన కేంద్ర ప్రాజెక్టు వచ్చే అవకాశం ఉంది. భారత నావికాదళం (నేవీ) జిల్లాలో ఆయుధ డిపో ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం.
జిల్లాలో ఆయుధ డిపో!
ఏర్పాటుకు ఆసక్తిచూపుతున్న నేవీ
బాడంగి ఎయిర్ బేస్ స్థలంలో పరిశీలన
అదనంగా 1700 ఎకరాలు అవసరం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతిపాదన
జిల్లాకు కీలకమైన కేంద్ర ప్రాజెక్టు వచ్చే అవకాశం ఉంది. భారత నావికాదళం (నేవీ) జిల్లాలో ఆయుధ డిపో ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. భోగాపురం ఎయిర్‌పోర్టుతో పాటు జాతీయ రహదారి, రైల్వే మార్గం ఉండడంతో జిల్లాలోనే ఏర్పాటుకు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా బాడంగిలో ఇదివరకే ఉన్న ఎయిర్‌బేస్‌ను డిపోగా మార్చాలని నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం.
విజయనగరం, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి):
బ్రిటీష్ కాలంలో రక్షణ అవసరాలకు బాడంగి ఎయిర్‌స్ర్టిప్‌ను వినియోగించేవారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఎయిర్ బేస్‌గా దీనిని పరిగణిస్తున్నారు. ఇప్పుడు పునర్నిర్మిం చాలనుకోవడం జిల్లాకు శుభ పరిణామమే. అదే జరిగితే జిల్లాలో కీలకమైన జాతీయ ప్రాజెక్టు కొలువుదీరనుంది. ఇప్పటికే విభజన హామీల్లో భాగంగా జిల్లాలో గిరిజన యునివర్సిటీ ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సన్నాహాలు ప్రారంభించాయి. మరోవైపు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఇదే సమయంలో భారత నావికాదళం ఏకంగా ఆయుధ డిపోను ఏర్పాటుచేయడానికి ముందుకు రావడం కీలక పరిణామంగా భావించవచ్చు.
సుదీర్ఘ చరిత్ర..
బాడంగి ఎయిర్‌స్ర్టిప్‌నకు సుదీర్ఘ చరిత్ర ఉంది. అప్పుడెప్పుడో బ్రిటీష్ కాలంలో దీనిని ఏర్పాటుచేశారు. యుద్ధ అవసరాలు, సరుకుల రవాణాకుగాను 227 ఎకరాల్లో రన్‌వే, ఏటీసీ, బంకర్లను సైతం నిర్మించారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఈ ఎయిర్ స్ర్టిప్ కీలక భూమిక వహించినట్టు తెలుస్తోంది. ఆ సమయంలో సూపర్ మెరైన్ స్పిట్, ఫైర్ పైటర్స్, హాకర్ హరికేన్, ఫైటర్స్, బాంబర్లు, బీ-57 కాన్‌బెర్రా వంటి యుద్ధ విమానాలు ఇక్కడ ఉండేవి. 1946 తర్వాత ఎయిర్ స్ర్టిప్‌ను మూసివేశారు. అటు తరువాత ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ భూమిని స్వాధీనం చేసుకుంది. కొంతకాలం పాటు వరి, గోధుమ నిల్వలను ఇక్కడ స్టాక్ చేసేవారు. తరువాత ఈ భూమి రైతుల ఆధీనంలోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ భూముల్లో పంటలు పండిస్తున్నారు. అయితే ఎయిర్‌బేస్ స్థలం అంటూ వాడుకలో ఉండిపోయింది.
ఇక్కడే అనుకూలం..
భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మితమవుతున్న నేపథ్యంలో జిల్లాపై నేవీ ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. అదే సమయంలో చెంతనే జాతీయ రహదారి ఉండడం, రైల్వేలైన్ దగ్గరగానే ఉండడంతో బాడంగిలో ఆయుధ డిపో ఏర్పాటుచేస్తే బాగుంటుందని నేవీ ఉన్నతాధికారులు ఒక నిర్ణయానికి వచ్చారు. కొద్దిరోజుల కిందట ఎన్డీఏ, నేవీ అధికారులు ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. జిల్లా అధికారులతో పాటు రెవెన్యూ శాఖ అధికారులతో క్షుణ్ణంగా చర్చించారు. నేవీ ఆయుధ డిపో ఏర్పాటుచేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు. భూములపై ఆరాతీశారు. ఎయిర్ స్ర్టిప్‌నకు చెందిన స్థలంతో పాటు అదనంగా 1700 ఎకరాల భూమి అవసరమని గుర్తించారు. ఆ మేరకు ఏపీ ఉన్నతాధికారులకు ఒక నివేదిక ఇచ్చినట్టు తెలుస్తోంది.
కలిసొచ్చే అంశాలివే..
ఎయిర్ స్ర్టిప్‌నకు సంబంధించి భూములను టీ ఆకారంలో సేకరించడానికి అధికారులు సిద్ధపడుతున్నట్టు సమాచారం. ప్రధానంగా బాడంగి మండలం ముగడ, మల్లంపేట, పూడివలస, రామచంద్రపురం, కోడూరు పరిధిలో భూముల సేకరణకు రంగం సిద్ధమైనట్టు సమాచారం. తీర ప్రాంత రక్షణ నావికాదళం ప్రధాన బాధ్యత. అయితే విశాఖ కేంద్రంగా నేవీకి సంబంధించి చాలా కార్యాలయాలు ఉన్నాయి. అక్కడున్న ఆయుధాల్లో కొన్నింటిని ఇక్కడ భద్రపర్చాలనేది నేవీ ఆలోచనగా ఉంది. నౌకలకు అవసరమైన సరుకులు సకాలంలో అందించడానికి ఎయిర్ వే(ఎయిర్‌పోర్టు), డిఫెన్స్ ఇండస్ర్టీయల్ కారిడర్లకు సామగ్రి తరలించేందుకు సమీపంలో రైల్వేస్టేషన్ ఉండడం కలిసొచ్చే అంశం. అందుకే నేవీ అధికారులు ఇక్కడ ఆయుధ డిపో ఏర్పాటుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
ప్రతిపాదనలు నిజమే
జేవీఎస్‌ఎస్ రామ్మోహన్‌రావు, ఆర్డీవో, బొబ్బిలి
బాడంగిలో ఎయిర్ స్ర్టిప్‌నకు సంబంధించి నేవీ అధికారులు పరిశీలించడం నిజమే. సుమారు 200 ఎకరాలు నేవీకి సంబంధించిన భూమి ఈ ప్రాంతంలో ఉంది. అది కాకుండా మరో 1500 ఎకరాలు అవసరం. ఓక వేళ ఇక్కడ ఆయుధ డిపో ఏర్పాటుచేస్తామంటే మొత్తంగా 1700 ఎకరాలు అవసరమని నేవీ ప్రతిపాదించింది. దీనిపై కేంద్ర, రాష్ట్రస్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రభుత్వాలు గ్రీన్‌సిగ్నల్ ఇస్తే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు భూసేకరణకు సిద్ధంగా ఉన్నాం.