Share News

మహిళా సాధికారతే లక్ష్యంగా..

ABN , Publish Date - Jul 26 , 2024 | 11:38 PM

స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు టీడీపీ కూటమి సర్కారు తీపి కబురు అందించింది. వారి ఉపాధి అవకాశాలను మరింత మెరుగుపరచాలనే ఉద్దేశంతో గతంలో కంటే మరింతగా రుణ సాయాన్ని పెంచింది.

మహిళా సాధికారతే లక్ష్యంగా..
సమావేశమైన మహిళా సంఘాల సభ్యులు

ఉపాధి అవకాశాల మెరుగుకు దోహదం

హర్షం వ్యక్తం చేస్తున్న జిల్లావాసులు

కొమరాడ, జూలై 26: స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు టీడీపీ కూటమి సర్కారు తీపి కబురు అందించింది. వారి ఉపాధి అవకాశాలను మరింత మెరుగుపరచాలనే ఉద్దేశంతో గతంలో కంటే మరింతగా రుణ సాయాన్ని పెంచింది. స్త్రీనిధి రుణ పరిమితిని సంఘానికి రూ. 3.50 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచింది. దీంతో జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు లీంకేజీతో సంబంధం లేకుండా ఉపాధి మార్గాలను ఇంకా మెరుగుపరుచుకోవడానికి స్త్రీనిధి రుణాలు ఉపకరిస్తాయని వారు భావిస్తున్నారు. వ్యాపా రాలను అభివృద్ధి చేసుకోవడానికి బయట అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సిన అవసరం ఉండ దని మహిళా సంఘాల సభ్యులు చెబుతున్నారు.

సంఘాలకు గ్రేడ్లు

జిల్లాలో గ్రామ సమైక్య సంఘాలు 565, స్వయం సహాయక సంఘాలు 19,770 ఉండగా.. 2,29,847 మంది వరకు సభ్యులు ఉన్నారు. కాగా గ్రామ సమైక్యకు గ్రేడింగ్‌ ఆధారంగా రుణ ప్రక్రియ ఉంటుంది. గ్రేడ్‌-ఏ అయితే రూ. 75 లక్షలు, గ్రేడ్‌-బీ అయితే రూ. 65 లక్షలు, గ్రేడ్‌-సీ అయితే 55 లక్షలు, గ్రేడ్‌-డీ అయితే రూ. 45 లక్షలు వరకు రుణం అందిస్తారు. దీంతో పాటు ప్రతి వెయ్యి రూపాయలకు రూ. 4 చొప్పున బీమా ఉంటుంది. ఒకవేళ సభ్యురాలు మరణిస్తే తీసుకున్న రుణాన్ని పూర్తిగా మాఫీ చేస్తారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 52 కోట్లు లక్ష్యంగా నిర్ణయించినట్లు అధికారులు చెబుతున్నారు.

నేరుగా ఖాతాల్లో జమ

గత వైసీపీ సర్కారు పాలనలో పొదుపు సొమ్ము జమ చేయడంలో అనేక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ ప్రభుత్వం నగదు రహిత లావా దేవీలు ప్రోత్సహించేలా మార్పులు చేసింది. ఈ మేరకు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్ము జమయ్యేలా చర్యలు తీసుకుంది. దీనిలో భాగంగా కొందరు వీవోఏలకు పేటీఎం పరికరాలు అందజేయనున్నట్లు సమాచారం. వీటి ద్వారా సభ్యులకు నేరుగా రుణం చెల్లించనున్నారు. ఏదేమైనా స్త్రీనిధి రుణాలను రూ. 5లక్షల వరకు పెంచడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

ఉపాధిని మెరుగుపర్చుకోవాలి

రాష్ట్ర ప్రభుత్వం స్త్రీనిధి రుణ సహాయాన్ని రూ. 5 లక్షలకు పెంచింది. సంఘాల సభ్యులు పెంచిన రుణాన్ని పొంది.. వారి ఉపాధిని మెరుగుపర్చుకోవాలి. జిల్లాలో ఇప్పటివరకు రూ. 11 కోట్ల మేర రుణాలు మంజూరు చేశాం. లక్ష్య సాధనపై దృష్టి సారించాం. నిబంధనలను అనుసరించి రుణాలు మంజూరు చేస్తాం.

- హేమలత, స్త్రీనిధి ఏజీఎం, పార్వతీపురం మన్యం జిల్లా

Updated Date - Jul 26 , 2024 | 11:39 PM