Share News

మీరే ముఖ్యం

ABN , Publish Date - May 09 , 2024 | 12:18 AM

నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే పతివాడ నారాయణ స్వామినాయుడు 2009లో తప్ప ఓటమే ఎరుగని నేత. అప్పుడు కూడా కేవలం 597 ఓట్ల తేడాతోనే ఓటమి చెందారు.

మీరే ముఖ్యం

- ద్వితీయ శ్రేణి నాయకత్వంపై కన్ను

- వారిని ప్రసన్నం చేసుకోనే పనిలో అభ్యర్థులు

- ఓటర్లను ప్రభావితం చేయగలిగే వారికి పెద్దపీట

(శృంగవరపుకోట)

- నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే పతివాడ నారాయణ స్వామినాయుడు 2009లో తప్ప ఓటమే ఎరుగని నేత. అప్పుడు కూడా కేవలం 597 ఓట్ల తేడాతోనే ఓటమి చెందారు. రద్దయిన భోగాపురం నియోజకవర్గం నుంచి ఆయన వరుసగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

- శృంగవరపుకోట శాసన సభకు ప్రాతినిధ్యం వహించిచన ఎల్‌బీ దుక్కును మైదాన ప్రాంతాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు 1999లో వ్యతిరేకించారు. దీంతో అతని స్థానంలో శోభా హైమావతికి టీడీపీ టికెట్‌ ఇచ్చింది. ఆమె కేవలం 678 ఓట్ల మెజార్టీతో గట్టెక్కారు.

... ఇలా ఎన్నికల్లో అతితక్కువ ఓట్లతో జయాపజయాలు పొందిన వారెందరో ఉన్నారు. గతంలో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో అనకాపల్లి ఎంిపీ కేవలం తొమ్మిది ఓట్లు తేడాతో గెలిపొందిన చరిత్ర ఉంది. దీనిని బట్టి ఓటు విలువను తెలుసుకోవచ్చు. ఇది సామాన్య జనాలకు పెద్దగా అర్థం కాకపోవచ్చు. బరిలో నిలిచే నేతలకిది బాగా తెలుసు. ఇలా చేయడంలో కీలక పాత్ర పోషించింది ద్వితీయ శ్రేణి నాయకత్వం. అందుకే ఇప్పుడు వీరి కన్ను ద్వితీయ శ్రేణి నాయకులపై పడింది. వారిని ప్రసన్నం చేసుకోనే పనిలో పడ్డారు.

తాయిలాలు ఇచ్చేందుకు...

మరో ఐదు రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో మండుటెండలో కూడా అభ్యర్థులు ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రచారంలో ఉంటున్నారు. ఓవైపు ఇలా ప్రచారం చేస్తూనే.. మరో వైపు ద్వితీయ శ్రేణి నాయకులతో సమావేశమవుతున్నారు. గ్రామ, మండల స్థాయి నేతలతో భేటీ అవుతున్నారు. తమ వైపు పనిచేసేలా ఒప్పించుకొనేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు వారేమడిగినా ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారు. ప్రత్యర్థిఽ పార్టీలకు చెందిన వ్యక్తులను తమ వైపు తిప్పుకొనేందుకు చూస్తున్నారు. తమ పార్టీకి చెందిన నేతలతో తరచూ సమావేశమవుతున్నారు. సామాజిక వర్గాలవారీగా పది, ఇరవై ఓట్లు తేగలిగిన నేతలతోనూ ప్రత్యేకంగా కూర్చొంటున్నారు. ఉదాహరణకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీలక్ష్మి విశాఖ పార్లమెంట్‌ నుంచి వైసీపీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. శృంగవరపుకోట శాసనసభ ఈ నియోజకవర్గం పరిధిలో ఉంది. దీంతో గతంలో ద్వితీయ శ్రేణి నాయకులకు ముఖం కూడా చూపించని ఆయన ఇప్పుడు పది ఓట్లు కూడా లేని వార్డు సభ్యులకు ఫోన్‌ చేసి మాట్లాడుతున్నారు. స్వయంగా ఇంటికి రప్పించుకుంటున్నారు. ద్వితీయ శ్రేణి నాయకులకున్న బలమిదేమరి. వైసీపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పూర్తిస్థాయిలో కనిపిస్తోంది. టీడీపీ వైపు ఓటు తరలితుందన్న నిర్ణయానికి వచ్చిన అధికార పార్టీ అభ్యర్థులకు ఓటు బ్యాంకును నిలబెట్టుకొనేందుకు ఇప్పుడు ద్వితీయ శ్రేణి నేతలు దిక్కయ్యారు. వారిని తమవైపు తిప్పుకునేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు.

అన్నిచోట్లా అలాగే...

ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుకు.. ఎస్‌.కోట ఎమ్మెల్యే కె.శ్రీనివాసరావుకు మధ్య విభేదాలు ఉన్నాయి. మళ్లీ ఆయనకే టికెట్‌ ఇస్తే పనిచేయనని ఎమ్మెల్సీ బహిరంగంగానే చెప్పేవారు. అయినా వైసీపీ అధిష్ఠానం పట్టించుకోలేదు. దీంతో అతని వెనకున్న ద్వితీయ శ్రేణి నేతలంతా టీడీపీలోకి వెళ్లిపోయారు. ఇదే నియోజకవర్గంలో ఎన్‌ఆర్‌ఐ గొంప కృష్ణ టీడీపీ నుంచి టికెట్‌ ఆశించారు. పార్టీ నిరాకరించడంతో ఇండిపెండింట్‌గా పోటీ చేసేందుకు సిద్ధపడ్డారు. గెలుపుపై ప్రభావం పడే అవకాశం ఉండడంతో పార్టీ అధినాయకత్వం నచ్చజెప్పి పోటీ చేయకుండా నివారించింది. అతనితో పాటు మరికొంతమంది ద్వితీయ శ్రేణి నేతలను ఒప్పించి పార్టీ గెలుపునకు సహకరించేలా ఒప్పించింది. గజపతినగరం నియోజకవర్గంలోనూ మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడుకు టీడీపీ అధిష్ఠానం టికెట్‌ ఇవ్వలేదు. దీంతో అతను పార్టీ మారే ఆలోచన చేశారు. ప్రజాగళం యాత్రకు వచ్చిన అధినేత చంద్రబాబు బుజ్జగించడంతో పార్టీని గెలిపించేందుకు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. చీపురుపల్లి నియోజకవర్గంలో కిమిడి నాగార్జునకు టికెట్‌ ఇవ్వకుండా అతని పెదనాన్న, సీనియర్‌ నేత కిమిడి కళా వెంకటరావుకు పార్టీ టికెట్‌ కేటాయించింది. దీంతో నాగార్జున అలిగారు. అతడిని చంద్రబాబు పిలిపించుకొని మాట్లాడారు. నెల్లిమర్ల నియోజకవర్గం పొత్తులో భాగంగా జనసేనకు వెళ్లింది. దీంతో అక్కడ టీడీపీ నుంచి టికెట్‌ ఆశించిన కర్రోతు బంగార్రాజు కినుక వహించారు. పొత్తు ధర్మాన్ని పాటించాలని అధినేత చంద్రబాబు నచ్చజెప్పడంతో దారికి వచ్చారు. వీరంతా వేలకు వేలు ఓట్లు కలిగి ఉన్న నాయకులు, అటు నుంచి ఇటు తిప్పేయగల సమర్థత ఉన్నవారు. వీరి వెనకున్న ద్వితీయ శ్రేణి నేతల ఆలోచన మారితే.. అభ్యర్థుల తలరాతలు మారిపోవడం ఖాయం. అందుకే వారెవ్వరూ బయటకు పోకుండా పార్టీ కాపాడి అభ్యర్థులకు అప్పగించింది. ఇప్పుడు అభ్యర్థులు వీరిని, వీరి అనుచర గణాన్ని ఓ కంట కనిపెట్టుకుంటూ, ప్రత్యర్థి పార్టీలో ఉన్న ద్వితీయ శ్రేణి నేతలను రాబట్టుకొనే పనిలో పడ్డారు. సొంత పార్టీలో ఉన్నా ఇంతవరకు సఖ్యత లేకపోయినా.. ఇప్పుడు వారి వద్దకు వెళ్లి దగ్గర చేసుకునే ప్రయత్నంలో పడ్డారు.

Updated Date - May 09 , 2024 | 12:18 AM