Share News

భీమవరం.. జనసైన్యం

ABN , Publish Date - May 09 , 2024 | 12:09 AM

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో రాష్ట్ర రాజకీయాలు, ప్రభుత్వ పాలనపై బల్లగుద్ది చెప్పే నాయకులు భీమవరం సొంతం.

భీమవరం.. జనసైన్యం

హామీలు నెరవేర్చలేక చతికలపడ్డ వైసీపీ

టీడీపీ, బీజేపీ ఐక్యంగా కదలడంతో జనసేన దూకుడు

భీమవరం జిల్లా కేంద్రమే కాదు ఆర్థిక రాజధానిగా గుర్తింపు తెచ్చుకుంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో రాష్ట్ర రాజకీయాలు, ప్రభుత్వ పాలనపై బల్లగుద్ది చెప్పే నాయకులు భీమవరం సొంతం. ఇక్కడ ఏ పార్టీ విజయం సాధిస్తే రాష్ట్రంలో ఆ పార్టీదే అధికారమనే సెంటిమెంట్‌ ఉంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి తరపున జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు), వైసీపీ నుంచి గ్రంధి శ్రీనివాస్‌ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. వ్యూహ, ప్రతివ్యూహాలతో కూటమి, వైసీపీ నియోజకవర్గంలో కాకపుట్టిస్తున్నాయి. కొదమ సింహాల్లా ఇద్దరు అభ్యర్థులు కాలు దువ్వుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత గ్రంధి శ్రీనివాస్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అనూహ్యంగా చివరి దశలో టిక్కెట్‌ దక్కించుకున్న అంజిబాబు అనతి కాలంలోనే జనంలోకి చొచ్చుకుపోయారు. అంజిబాబు మంచితనం, గ్రంధి శ్రీనివాస్‌ దురుసుతనం జనంలో చర్చనీయాంశమైంది. మంచితనమే భీమవరంలో అంజిబాబు వైపు గాలివీచేలా చేసింది. మరోవైపు ప్రభుత్వంపై వ్యతిరేకత, కూటమిపై సానుకూలత అంజిబాబుకు కలసి వస్తున్నాయి.

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

గడచిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన నుంచి పవన్‌ కల్యాణ్‌, తెలుగుదేశం పార్టీ తరపున అంజిబాబు, వైసీపీ నుంచి గ్రంధి శ్రీనివాస్‌ పోటీ చేశారు. త్రిముఖ పోరులో గ్రంధి విజయం సాధించారు. అప్పటి ఎన్నికల్లో భీమవరం నియోజకవర్గానికి ఆయన పలు హామీలు ఇచ్చారు. వాటిని నెరవేర్చలేకపోయారు. పట్టణంలో ప్రధాన సమస్య అయిన డంపింగ్‌ యార్డు నిర్మించలేదు. యనమదుర్రు డ్రెయిన్‌పై వంతెనలకు అప్రోచ్‌లు ఏర్పాటు చేయలేకపోయారు. యనమదుర్రు కాలుష్య నివారణకు తెలుగుదేశం హయాంలో రూ. 100 కోట్లు మంజూరు చేస్తే వైసీపీ ప్రభుత్వం దాని ఊసెత్తలేదు. టిడ్కో ఇళ్లు అందరికీ ఉచితంగా ఇస్తామన్నారు. తుంగలో తొక్కారు. మంచినీటి వసతిని పూర్తి స్థాయిలో అందించలేకపోతున్నారు. ప్రభుత్వ పరంగా భీమవరం నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు పైసా మంజూరు కాలేదు. ప్రజలు కట్టే ఆస్తిపన్ను తోనే పట్టణంలో కాస్త రహదారులు వేశారు. జిల్లా కేంద్రమైనప్పటికీ భీమవరం పట్టణానికి పెద్ద ఒరిగేదేమీ లేకుండా పోయింది. ఇవన్నీ ఇప్పుడు వైసీపీకి వ్యతిరేక ప్రభావం చూపుతున్నాయి.

కక్ష పూరిత రాజకీయాలు

గడచిన ఐదేళ్లలో భీమవరంలో కక్ష పూరిత రాజకీయాలు సాగాయి. తెలుగుదేశం నాయకులపై కేసులు నమోదు చేశారు. దాడులకు ఉసిగొల్పారు. పోలీసుల అండతోనే పాలన సాగింది. తెలుగుదేశంలో ఉన్న బిసి నాయకులపై ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసులు కూడా నమోదు చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రతిపక్ష నాయకులను కట్టడి చేసే ప్రయత్నాలే ఎక్కువగా సాగాయి. అధికార పార్టీని గానీ, నేతలను గాని విమర్శలు చేయాలన్నా... అభివృద్ధిపై ప్రశ్నించాలన్నా ధైర్యం చేసే పరిస్థితి లేకుండా పోయింది. తెలుగుదేశం, జనసేన నాయకుల అపార్ట్‌మెంట్‌లలో అతిక్రమణలు ఉన్నాయంటూ ధ్వంసం చేసేలా చర్యలు తీసుకున్నారు. కూరగాయల వ్యాపారిని విడచిపెట్టలేదు. ఇలా ఐదేళ్లు తెలుగుదేశం, జనసేన శ్రేణులపై కక్ష తీర్చుకునే రాజకీయాలే సాగాయి. ఈ సారి అంజిబాబును నెగ్గించుకోవాలన్న కసిని కూటమిలో ఏర్పడడడానికి గ్రంధి అనుసరించిన రాజకీయ వైఖరే దోహదపడింది.

వైసీపీ నుంచి వలసలు

వైసీపీ నుంచి వైదొలుగుతున్న నేతల సంఖ్య పెరుగు తోంది. సర్పంచ్‌లు, మాజీ కౌన్సిలర్లు, వార్డు ఇన్‌చార్జిలు అనేక మంది నాయకులు తెలుగుదేశం, జనసేన పార్టీలో చేరారు. ఇంకా చేరుతూనే ఉన్నారు. వైసీపీలో క్రియాశీల నాయకులు కూడా అంటీముట్టనట్టు ఉంటున్నారు. గృహ సారథులు, వాలంటీర్లే ఇంటింటికి తిరిగి వైసీపీ తరపున ప్రచారం చేస్తున్నారు. ర్యాలీలు, రోడ్‌ షోలు, ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నా స్పందన అంతంత మాత్రం. కూటమి అభ్యర్థి అంజిబాబుకు విశేష ఆదరణ లభిస్తోంది. దీనితో వైసీపీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

అందరివాడు అంజిబాబు

తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిలో అంజిబాబు అందరివాడుగా పేరొందారు. తెలుగుదేశం ఎమ్మెల్యేగా అందరితో సఖ్యత పాటించారు. పార్టీలకు అతీతంగా ఎవరు వెళ్లినా పనిచేసి పెట్టారు. రాజకీయాల కంటే అభివృద్ధికే ప్రాధాన్యం ఇచ్చారు. అదే ఇప్పుడు అంజిబాబుకు నియోజకవర్గంలో సానుకూలంగా మారింది. కూటమి నాయకులు అండదండలు సంపూర్ణంగా ఉన్నాయి. వ్యక్తిగతంగా మంచివాడన్న అభిప్రాయం జనంలో ఉంది. నెల రోజుల క్రితమే అంజిబాబు జనసేనలో చేరి టిక్కెట్‌ దక్కించుకున్నారు. అయినా జనంలోకి శరవేగంగా చొచ్చుకుపోయారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ శ్రేణులు తమ సొంత ఎన్నికల్లా పనిచేస్తున్నాయి. ప్రజల్లోనూ ఆదరణ లభిస్తోంది. రోడ్‌ షోలు, ర్యాలీలు ఊహించిన దానికంటే విజయవంతమవుతున్నాయి. చదువుకున్న యువత స్వచ్ఛందంగా జనసేన జెండాలు పట్టుకుని పట్టణం, గ్రామాల్లో తిరిగి ప్రచారం చేస్తున్నారు. అన్ని వర్గాల్లోనూ అంజిబాబుకు మద్దతు ఉంటోంది. వైసీపీ ప్రభుత్వంపైనా, స్థానికంగా గ్రంధి శ్రీనివాస్‌పైనా ఉన్న వ్యతిరేకత ఇప్పుడు కూటమికి కలసి వ స్తోంది.

Updated Date - May 09 , 2024 | 12:09 AM