Share News

సైబర్‌ క్రైం పోలీసుల పేరుతో మోసం

ABN , Publish Date - May 09 , 2024 | 12:00 AM

సైబర్‌ క్రైం పోలీసులమని మిమ్ముల్ని అరెస్ట్‌ చేసేందుకు వస్తున్నామని స్టాఫ్‌నర్స్‌ను ఫోన్‌లో బెదిరించి ఆగంతకులు ఆమె వద్ద నుంచి రూ.53 వేలు నగదు కాజేశారు.

సైబర్‌ క్రైం పోలీసుల పేరుతో మోసం

ఓ స్టాఫ్‌నర్స్‌ నుంచి రూ.53 వేలు ఖాతాకు ట్రాన్స్‌ఫర్‌

ఏలూరు క్రైం, మే 8:సైబర్‌ క్రైం పోలీసులమని మిమ్ముల్ని అరెస్ట్‌ చేసేందుకు వస్తున్నామని స్టాఫ్‌నర్స్‌ను ఫోన్‌లో బెదిరించి ఆగంతకులు ఆమె వద్ద నుంచి రూ.53 వేలు నగదు కాజేశారు. పోలీసులు, బాధితురాలు తెలిపిన వివరాలివి.. సత్రంపాడులో నివాసముం టున్న వన్నెకూటి పావని పెదపాడు మండలం వట్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్టాఫ్‌నర్స్‌గా పనిచేస్తున్నారు. బుధవారం ఆమెకు ఓ అపరిచిత వ్యక్తి ముంబై నుంచి ఫోన్‌ చేస్తున్నామని, సైబర్‌ క్రైం పోలీసులమని మీపై 24 కేసులు ఉన్నాయని అరెస్టు చేసేందుకు వస్తున్నామని బెదిరించారు. అరెస్ట్‌ చేయకుండా ఉండాలంటే డబ్బు ఇవ్వాలని లేదంటే ఏడేళ్ల శిక్ష పడుతుందని బెదిరించారు. ఓ బ్యాంక్‌ ఖాతా నంబరు మెస్సేజ్‌ చేశారు. బెదిరిపోయిన ఆమె వారు పంపించిన ఖాతాకు రూ.53వేలు ట్రాన్స్‌ఫర్‌ చేశారు. ఆ తరువాత ఈ విషయాన్ని తన సహచరులకు చెప్పగా నకిలీ పోలీసులు అని, మోసపోయామని నిర్ధారించడంతో బాధితురాలు ఏలూరు వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌ వద్ద ఉన్న సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా స్పందించిన పోలీసులు ఆమె డబ్బు పంపించిన ఖాతాను హోల్డ్‌ చేయించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - May 09 , 2024 | 12:00 AM