Share News

ఆత్మహత్యకు కారకులను అరెస్ట్‌ చేయాలి

ABN , Publish Date - Jul 27 , 2024 | 12:40 AM

వ్యక్తి ఆత్మహత్యకు వేధింపులే కారణమని పలువురిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ తక్షణమే వారిపై కేసులు నమోదు చేయాలని మృతుడి బంధువులు, గ్రామస్థులు ఆందోళన చేశారు.

ఆత్మహత్యకు కారకులను అరెస్ట్‌ చేయాలి
ధర్నా చేస్తున్న గ్రామస్థులు, మృతుడి బంధువులు

కైకలూరులో మృతుడి బంధువులు, గ్రామస్థుల ఆందోళన

ఎమ్మెల్యే కామినేని చొరవతో సమసిన వివాదం

కైకలూరు/కలిదిండి, జూలై 26 : వ్యక్తి ఆత్మహత్యకు వేధింపులే కారణమని పలువురిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ తక్షణమే వారిపై కేసులు నమోదు చేయాలని మృతుడి బంధువులు, గ్రామస్థులు ఆందోళన చేశారు. శుక్రవారం కైకలూరు ప్రభుత్వాసుపత్రి వద్ద జాతీయ రహదారిపై కొద్దిసేపు ఈ ఆందోళన జరిగింది. కలిదిండి మండలం సానారుద్రవరం గ్రామానికి చెందిన విన్నకోట రామకృష్ణ(40) గురువారం అర్ధరాత్రి గ్రామంలో వేపచెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. ఇతను గ్రామంలో మట్టి వ్యాపారం, కూలి పనులు చేసుకుంటూ ఉంటాడు. కొద్ది రోజుల క్రితం సానారుద్రవరంలో బుసక తవ్వుతున్న ఎక్స్‌కవేటర్‌ను, బుసక లోడు లారీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొంతమంది రాజకీయ నాయకులు, తోటి వ్యాపారులు కక్షతో ఎక్స్‌కవేటర్‌ను, బుసక లోడు లారీని సీజ్‌ చేయించి వేధించటంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్టు మృతుడి భార్య ఆరోపించింది. పోస్టుమార్టం నిమిత్తం రామకృష్ణ మృతదేహాన్ని శుక్రవారం ఉదయం కైకలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించడంతో గ్రామం నుంచి పెద్దఎత్తున బంధువులు, గ్రామస్థులు ప్రభుత్వాసుపత్రికి చేరుకొని వేధింపుల వల్లే అతను మృతి చెందాడని నిందితులపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. గ్రామస్థులు పెద్దఎత్తున చేరుకోవడంతో పోలీసులు కూడా భారీగా చేరుకున్నారు. కేసు నమోదు చేసి ఆత్మహత్యకు కారకులైన వారిని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ జాతీయ రహదారిపై ఆందోళన చేశారు. ఈ దశలో పోలీసులు, గ్రామస్థులకు మధ్య వాగ్వాదం జరిగింది. విషయం కైకలూరు ఎమ్మెల్యే డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌ దృష్టికి తీసుకువెళ్లడంతో ఫోన్‌లో ఆయన మాట్లాడుతూ మృతుడి కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తానని ఎవరూ ఆందోళన చేయవద్దని హామీ ఇవ్వడంతో వివాదం సద్దు మణిగింది. ఏలూరు డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ మృతుడి భార్య సుధారాణి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

Updated Date - Jul 27 , 2024 | 12:41 AM