Share News

లెక్కలు తేలుస్తున్నారు

ABN , Publish Date - Jul 26 , 2024 | 12:40 AM

ఇసుక అక్రమ రవాణాపై విచారణ లోతుగా జరుగుతోంది. వింజరం, ఇబ్రహీంపేట, ఇసుక స్టాక్‌ పాయింట్ల వద్ద గురువారం మైనింగ్‌, ల్యాండ్‌సర్వే ఏడీ, నీటి పారుదల, పంచాయతీరాజ్‌, ట్రాన్స్‌ పోర్టు అధికారులు విచా రణ జరిపారు.

లెక్కలు తేలుస్తున్నారు
ఇబ్రహీంపేట స్టాక్‌ పాయింట్‌లో ఇసుక కొలతలు

పదిమంది సిబ్బందికి షోకాజ్‌ నోటీసులు జారీ

స్టాక్‌ పాయింట్ల వద్ద మైనింగ్‌, ల్యాండ్‌ సర్వే బృందం తనిఖీలు

అక్రమాలకు పాల్పడిన వారిపై వీఆర్వో, పంచాయతీ కార్యదర్శులు ఫిర్యాదు

స్టాక్‌ పాయింట్లను పరిశీలించిన జేసీ ధాత్రిరెడ్డి

కుక్కునూరు, జూలై 25 : ఇసుక అక్రమ రవాణాపై విచారణ లోతుగా జరుగుతోంది. వింజరం, ఇబ్రహీంపేట, ఇసుక స్టాక్‌ పాయింట్ల వద్ద గురువారం మైనింగ్‌, ల్యాండ్‌సర్వే ఏడీ, నీటి పారుదల, పంచాయతీరాజ్‌, ట్రాన్స్‌ పోర్టు అధికారులు విచా రణ జరిపారు. ఇసుక స్టాక్‌ నిల్వలను పరిశీలించారు. ఇసుక పాలసీ అమలులోకి వచ్చిన తర్వాత మైనింగ్‌ శాఖ కుక్కునూరు మండలం వింజరంలో నాలుగు వేల మెట్రిక్‌ టన్నులు, ఇబ్రహీంపేటలో 95 వేల మెట్రిక్‌ టన్నులు ఉన్న ట్టు నివేదికలో పేర్కొంది. అయితే క్షేత్రస్థాయిలో ఇసుక లేకపోవడంతో మళ్లీ రెవెన్యూ శాఖ ఇసుక కొలతలు తీసుకుని అమ్మకాలు ప్రారంభించారు. ఈ క్రమంలో ఇబ్రహీంపేట ఇసుక స్టాక్‌ పాయింట్‌ వద్ద నుంచి సాయంత్రం 6గంటల తర్వాత 20 టన్నుల పరిమితికి మించి అధికంగా ఇసుక లోడు చేసుకుని తరలిస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. గత మంగళవారం లంకాలపల్లి వద్ద టాస్క్‌ఫోర్సు దాడులు చేసి మూడు లారీలను పట్టుకున్నారు. ఆ లారీల్లో దాదాపు 72 మెట్రిక్‌ టన్నుల ఇసుక అదనంగా వచ్చినట్టు గుర్తించి కేసు నమోదు చేసి లారీలు సీజ్‌ కుక్కునూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో ఎంత ఇసుక అక్రమంగా రవాణా జరి గిందో గుర్తించేందుకు జిల్లా బృందాలు గురు వారం క్షేత్రస్థాయిలో పరిశీలించాయి. గతంలో ఉన్న నిల్వలు అమ్మిన ఇసుక, ప్రస్తుతం ఎంత ఇసుక ఉందో గుర్తించడానికి కొలతలు వేశారు.

మాపై దౌర్జన్యం చేసి ఇసుక తీసుకెళ్లారు..

తొండిపాక పంచాయతీ కార్యదర్శి గౌరీప్రియ గురువారం ముగ్గురు టిప్పర్‌ డ్రైవర్లపై, ఒక జేసీబీ ఆపరేటర్‌పై కుక్కునూరు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తాము విధులు నిర్వహిస్తుండగా దౌర్జన్యంగా అధిక మొత్తంలో ఇసుక లోడు చేసుకుని వెళ్లారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దొండిపాక గ్రామ రెవెన్యూ అధికారి గోపాలరావు కూడా కుక్కునూరు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన జేసీబీ స్థానంలో మరో భారీ యంత్రాన్ని తీసుకొచ్చి దౌర్జన్యంగా ఇసుకను అధికంగా లోడు చేసుకుని తరలించుకుపోయారని నలుగురిపై ఫిర్యాదు చేశారు. కాగా టిప్పర్‌ డ్రైవర్లు ముగ్గురు, ఆపరేటర్‌ తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు కావడం విశేషం.

జేసీ పరిశీలన

జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ధాత్రి రెడ్డి గురువారం రాత్రి వింజరం, ఇబ్రహీంపేట ఇసుక స్టాక్‌ పాయింట్ల వద్దకు వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అప్పటికే విచారణ జరిపిన అధి కారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇసుక అక్రమ రవాణా ఎలా జరిగిందనే దానిపై ఆరా తీశారు.

అప్రమత్తంగా ఉండండి...

వేలేరుపాడు :

‘గోదావరి వరద మళ్లీ పెరుగుతుండడంతో అధికారులు, ముంపు గ్రామాల ప్రజలు అప్రమతంగా ఉండాలి.. లోతట్టు గ్రామాల్లో ప్రజలు తక్షణమే ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ధాత్రిరెడ్డి అధికారులను ఆదేశించారు. వేలేరుపాడు మండలంలో వరద పరిస్థితిని గురువారం పరిశీలిం చారు. తహసీల్దార్‌ కార్యాలయంలో అధికారులతో సమావేశమై అధికారులకు సూచ నలు చేశారు. ఆమె మాట్లాడుతూ.. ‘అధికారులు అప్రమత్తంగా ఉండి పునరావాస కేంద్రాల్లో ప్రజలకవసరమైన తాగు నీరు, నిత్యవసర వస్తువులు అందించాలి. బయట ప్రాంతాల నుంచి పశుగ్రాసం కొనుగోలు చేసి రైతులకు అందించాలి. పునరావాస కేంద్రాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలి’ అని ఆదేశించారు. కటుకూరుకు బోటుపై వెళ్లి గ్రామస్థులను పరామర్శించారు. జేసీ వెంట ఆర్డీవో అద్దయ్య, జడ్పీ సీఈవో సుబ్బారావు, సివిల్‌ సప్లయీస్‌ జిల్లా మేనేజర్‌ మంజుభార్గవి, జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి ఆర్‌ఎస్‌ఎస్‌. రాజు, తహసీల్దార్‌ చిన్నారావు, ఎంపీడీవో శ్రీహరి, తదితరులు పాల్గొన్నారు.

–––––––––––––––––––––––––––––––––––––––––

కన్నీటి వేదన..

పెద్దవాగు వరదతో ఊళ్లు విధ్వంసం

ఇళ్లు కొట్టుకుపోయి నిలువ నీడ కరువు

గుడారాల్లో తలదాచుకుంటున్న వైనం

అధికారులు పట్టించుకోవడం లేదని బాధితుల ఆవేదన

వేలేరుపాడు, జూలై 25 : గత గురువారం పెద్దవాగు ప్రాజెక్టుకు గండి పడడంతో వరద వెల్లువలా ఊళ్లపై పడి విధ్వంసాన్ని సృష్టించింది. ఒక్కసారిగా వరద మృత్యువులా తరుముకుని రావడంతో అయా గ్రామస్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులూ తీస్తూ ఎత్తైన ప్రదేశాలకు చేరుకున్నారు. తమ కళ్ళ ముందే ఎంతో కాలంగా కష్టపడి నిర్మించుకున్న ఇళ్లు, సామాన్లు, వరదలో కొట్టుకుపోతుంటే చేసేదేమీలేక అసహాయకులుగా చూస్తూ ఉండిపోయారు. నిలువ నీడ లేక కట్టుబట్టలతో మిగిలారు. మండలంలోని కమ్మరగూడెం, మేడేపల్లి, అల్లూరి నగర్‌, ఒంటిబండ, కోయమాదారం, ఊటగుంపు, రామవరం, రాళ్లపూడి, సొందే గొల్లగూడెం, వసంతవాడ, పాత పుచ్చిరాళ్ల గ్రామాలు పెద్దవాగు బారిన పడ్డాయి. అయా గ్రామస్థులు వరద తగ్గిన తర్వాత గ్రామాల్లోకి వచ్చి చూసుకుంటే తమ ఇళ్లు అనవాళ్లు కూడా లేకుండా వరదల్లో కొట్టుకుపోవడంతో గుండెలు బాదుకున్నారు. జిల్లా అధికారులు వరద తగ్గిన అనంతరం గ్రామాల్లో సహాయక చర్యలు ప్రారం భించిన అవిఅరకొరగానే ఉన్నాయన్నది బాధితుల ఆరోపణ. వండుకునేందుకు గిన్నెలు కూడా లేకపోవడంతో అధికారులే భోజన సదుపాయం కల్పించారు. వరద ప్రభావిత గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, మంత్రి పరామర్శలకు వచ్చిన సమయంలో అన్ని విధాలా ఆదుకుంటామని హామీలిచ్చారు. వారం గడుస్తున్నా ఇప్పటి వరకు తమకు భోజనం, తాగునీరు తప్ప మరే సహాయం అందలేదని బాధితులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పెద్దవాగు వరదల కారనంగా పూర్తిగా నష్టపోయిన తమకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని కూలిన ఇళ్ల స్థానంలో పక్కాఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పినప్పటికి ఇప్పటి వరకు అధికారులు ఏ మాత్రం స్పందించడం లేదని అల్లూరి నగర్‌ గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. వరదల్లో ఇళ్లు కూలిపోవడంతో తాత్కాలికంగా గుడారాలు వేసుకుని వాటిలోనే నివాసం ఉంటున్నామని బాధితులు తెలిపారు. వరదల కారణంగా నష్ట పోయిన తమకు న్యాయం చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

సర్వస్వం కోల్పోయాం

వరదకు ఇంట్లోని సామాన్లు మొత్తం తడిచి పోయాయి. గతేడాదే అప్పుచేసి చిన్నపాటి పక్కాఇల్లు నిర్మించుకున్నాం. వరద ధాటికి సగం ఇల్లు కూలి పోయింది. పొలంలో ఇసుక మేటలు వేయడంతో వ్యవ సాయం చేసే వీలు లేకుండా పోయింది. నేటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదు. ప్రభుత్వం ఆదుకోవాలి.

– పూసం సీతమ్మ, అల్లూరి నగర్‌.

ఇల్లు కొట్టుకుపోయింది.

వరదకు మా పూరిల్లు కొట్టుకు పోయింది. కట్టుకున్న బట్టలు తప్ప మరేమీ మిగలలేదు. ఉండటానికి ఇల్లు లేకపోవడంతో తాత్కాలికంగా ప్రభుత్వం ఇచ్చిన టార్ఫాలిన్‌తో చిన్న గుడారం వేసుకుని ఉంటున్నాం. అధికారులు బుధవారం వరకు భోజన సదుపాయం కల్పించారు. ప్రస్తుతం అది కూడా నిలిపివేశారు. నష్టపోయిన మాకు ప్రభుత్వమే న్యాయం చేయాలి.

– పూసం నాగేశ్వరరావు, అల్లూరినగర్‌

Updated Date - Jul 26 , 2024 | 12:40 AM