Share News

మాయ లేడీ

ABN , Publish Date - Jul 27 , 2024 | 12:16 AM

దాదాపు కేజీపైనే నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి రూ.67 లక్షలపైనే కాజేశారు. మోసగాళ్లను పట్టుకుని నిలదీస్తే ఆడ్డం తిరిగి నానా రాద్దాంతం చేసి పరారయ్యారు. నరసాపురంలో వెలుగుచూసిన ఈ మోసం బులియన్‌ వ్యాపారుల్ని ఒక్కసారిగా ఉలికిపాటుకు గురి చేసింది.

మాయ లేడీ
నరసాపురం పట్టణంలోని పార్శ్వనాధ్‌ బ్యాంకర్స్‌

నరసాపురంలో తాకట్టు మోసం

కేజీ పైనే నకిలీ బంగారం

రూ.67 లక్షలకు పైగా టోకరా

ఉల్కికిపడ్డ బులియన్‌ వర్తకులు

ఎస్పీని ఆశ్రయించిన వ్యాపారులు

నరసాపురం, జూలై 26: వ్యాపారానికి, అప్పుకు నమ్మకమే మూలం. ఇవే మన సిబిల్‌ స్కోర్‌ను పెంచుతాయి. ఈ నమ్మకాన్నే కొందరు కేటుగాళ్లు క్యాష్‌ చేసుకుని పట్టణానికి చెందిన ఓ తాకట్టు వ్యాపారిని బురిడి కొట్టించి లక్షలు కాజేశారు. దాదాపు ఏడాదిగా సాగుతున్న ఈ మోసాన్ని చివరికి వ్యాపారి సమీప బంధువు గుర్తించడంతో అసలు బండారం బయట పడింది. అప్పటికే జరగాల్సిన నష్టం భారీగా జరిగింది. దాదాపు కేజీపైనే నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి రూ.67 లక్షలపైనే కాజేశారు. మోసగాళ్లను పట్టుకుని నిలదీస్తే ఆడ్డం తిరిగి నానా రాద్దాంతం చేసి పరారయ్యారు. నరసాపురంలో వెలుగుచూసిన ఈ మోసం బులియన్‌ వ్యాపారుల్ని ఒక్కసారిగా ఉలికిపాటుకు గురి చేసింది. మరోవైపు పోలీసులు ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకున్నారు. ఈ మోసగాళ్లు జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లో ఇంకెంత మంది వ్యాపారుల్ని దగా చేసారన్న దానిపై దృష్టి సారించారు. దీనికి సంబంధించి నరసాపురం బులియన్‌ సంఘం అధ్యక్షుడు వినోద్‌ కుమార్‌ జైన్‌ తెలిపిన వివరాలు ఇవీ..

20 సార్లు పైనే తాకట్టు

నరసాపురం మెయిన్‌రోడ్‌లో సుమేరామాల్‌ జైన్‌ పార్శ్వనాథ్‌ బ్యాంకర్స్‌ పేరుతో తాకట్టు వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఈయన దగ్గర నరసాపురం పట్టణానికి చెందిన శిరిగినీడి ఉషారాణి కుటుంబం చాలా ఏళ్ల నుంచి బంగారం తాకట్టు పెట్టి అప్పు తీసుకుంటూ వస్తున్నది. ఇలా వ్యాపారికి ఆ కుటుంబంపై నమ్మకం పెరిగింది. దీన్నే ఉషారాణి మోసానికి ఎంచుకుంది. తాకట్టు పెడుతున్న బంగారాన్ని వ్యాపారి గీటు వేయ కుండానే అప్పు ఇస్తుండటం గమనించి ప్లాన్‌ రెఢీ చేసింది. ముందుగా కొన్ని నకిలీ బంగారంతో తయారైన వస్తువుల్ని తీసుకుచ్చి తాకట్టు పెట్టింది. వ్యాపారి గీటు వేయకుండా అడిగినంత డబ్బు ఇచ్చాడు. తరువాత మరికొన్ని నెలలకు ఇంకొన్ని వస్తువులు తీసుకుచ్చి మళ్లీ అప్పు తీసుకుంది. అప్పుడు కూడా వ్యాపారి గీటు వేయలేదు. ఇలా దాదాపు 20 సార్లుపైనే పలు వస్తువుల్ని తాకట్టు పెట్టింది. ఒక్కసారి కూడా వ్యాపారి గీటు వేయకపోవడంతో నకిలీ బంగారం పెట్టి లక్షలు దోచేసింది. అయితే ప్రతిసారి అప్పు తీసుకు న్నప్పుడల్లా తాకట్టులో ఉన్న వస్తువులకు వడ్డీ కట్టేస్తూ నమ్మకాన్ని మరింత పెంచుకుంది.

బయటపడిందిలా..

అయితే మోసం ఎంతోకాలం నిలవదంటారు. ఈ మాయలాడి విషయంలో అది రుజువైంది. వారం రోజుల క్రితం కొన్ని వస్తువుల్ని తాకట్టు పెట్టి అప్పు తీసుకుంది. ఆ సమయంలో వ్యాపారి జైన్‌ గీటు పెట్టకుండా అప్పు ఇవ్వడాన్ని ఆ సమయంలో ఆక్కడ ఉన్న ఆయన సోదరుడు గుర్తించాడు. వెంటనే మాయలేడి ఉషారాణి బయటకు వెళ్లగానే ఆ వస్తువుల్ని గీటు పెట్టమని సోదరుడిని కోరారు. చాలా నమ్మకస్థురాలని, చాలాకాలం నుంచి అప్పు తీసుకుంటున్నదని వ్యాపారి చెప్పినప్పటికీ ఆయన సోదరుడు వినలేదు. గీటు గీయడంతో అసలు బండారం బయటపడింది. అక్కడితో విడిచి పెట్టలేదు. మరోషాపుకి పంపి గీటు తీయించాడు.. అక్కడ కూడా నకిలీ అని తేలింది.

అల్లరి చేయకండి..కట్టేస్తా..

అయితే భాగోతం బయటపడటంతో మాయలాడి కాళ్ల బేరానికి వచ్చింది. నెల్లూరుకు చెందిన వ్యాపారి దగ్గర ఈ బంగారాన్ని కొని మోసపోయానని నమ్మబలికింది. తనకు సమయం ఇస్తే విడిపించుకుని వెళ్లిపోతానని భరోసా ఇచ్చింది. అయితే మూడు రోజులైనా తిరిగి రాకపోవడంతో వ్యాపారి ఫోన్‌ చేశాడు. ఆసమయంలో తనతో నెల్లూరు నుంచి ముగ్గురిని తీసుకు వచ్చింది. అందులో ఒకరు నానా రాద్దాంతం చేసి వ్యాపారుల్ని బెదిరించాడు. మోసపోయిన తాకట్టు వ్యాపారి జైన్‌ సంఘంలో పెట్టాడు. వెంటనే జోక్యం చేసుకున్న సంఘం పెద్దలు శుక్రవారం జిల్లా ఎస్పీని కలిశారు. కేసు నమోదు చేయాలని జిల్లా ఎస్పీ నయీం నరసాపురం సీఐ స్వామిని ఆదేశించారు. మరోవైపు ఈ తరహా మోసం ఒక్క నరసాపురంలోనే జరిగిందా ? లేక ఇతర ప్రాంతాల్లో కూడా జరిగిందన్న దానిపై కూడా పోలీసులు ఆరా తీసే పనిలో పడ్డారు. విచారణలో మోసానికి పాల్పడిన ఉషారాణి కొంత కాలం నుంచి నెల్లూరులో ఉంటున్నట్లు తెలిసింది. ఆమెకు మద్దతుగా వచ్చిన యువకులు నెల్లూరుకు చెందినవారుగా అనుమానిస్తున్నారు.ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు.

Updated Date - Jul 27 , 2024 | 12:16 AM