Share News

కొల్లేరును తవ్వేస్తున్నారు..

ABN , Publish Date - May 08 , 2024 | 01:00 AM

వైసీపీ నేతల ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. ఓ పక్క అధికారులందరూ ఎన్నికల హడావిడిలో ఉండగా గుట్టుచప్పుడు కాకుండా తమ పని కానిచ్చేసుకోవచ్చని భావించి కాంటూరు వ్యవసాయ భూమి తవ్వకానికి రంగం సిద్ధం చేశారు.

కొల్లేరును తవ్వేస్తున్నారు..
దేవర గోపవరలో నిషేధిత కొల్లేరు భూముల్లో వేసిన గట్టు

దేవర గోపవరంలో వైసీపీ యువనేత ఆధ్వర్యంలో బరి తెగింపు

కాంటూరు వ్యవసాయ భూమి ఐదెకరాల్లో తవ్వకం

చుట్టుపక్కల రైతుల ఫిర్యాదుతో అటవీ శాఖ కేసు నమోదు

రెండు ఎక్స్‌కవేటర్లు, రెండు ట్రాలీలు సీజ్‌ .. 8 మందిపై కేసు

ఏలూరు, మే 7 : వైసీపీ నేతల ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. ఓ పక్క అధికారులందరూ ఎన్నికల హడావిడిలో ఉండగా గుట్టుచప్పుడు కాకుండా తమ పని కానిచ్చేసుకోవచ్చని భావించి కాంటూరు వ్యవసాయ భూమి తవ్వకానికి రంగం సిద్ధం చేశారు. వ్యవసాయ పొలం సరిహద్దు రైతులు రాత్రి పూట మిషన్లు వెళ్లడం చూసి ఆరా తీయగా కాంటూరులో చెరువులు తవ్వుతున్నారని తెలిసి అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. నిడమర్రు అటవీశాఖ సెక్షన్‌ ఆఫీసర్‌ పి.గంగారత్నం తెలిపిన వివరాలివి.. నిడమర్రు మండలం దేవర గోపవరానికికి చెందిన కందుపాటి వీరవెంకట మహేష్‌కు చెందిన కొల్లేరు 5వ కాంటూరు పరిధిలోని ఆర్‌.ఎస్‌.నెం. 311 , 31 /2లలో గల ఎ.5.54 సెంట్లు భూమిలో సోమవారం రాత్రి రెండు ఎక్స్‌కవే టర్లతో వ్యవసాయ పొలంను చేపల చెరువుగా మార్చేం దుకు గట్లు వేస్తుండగా సమాచారం అందిన అటవీ సిబ్బంది దాడి చేసి కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో అటవీ చట్టం 1952 ఉల్లంఘనగా నిషేధిత కొల్లేరు భూము లలో చేపల చెరువులు తవ్వుతున్నందుకు కేసు నమోదు చేశామన్నారు. రెండు ఎక్స్‌కేటర్లు, రెండు ట్రాక్టర్లు సీజ్‌ చేశామని, ఎ–1గా కాకరాల పల్లయ్య, ఎ–2 గా కందులపాటి వీరవెంకట మహేష్‌లతో పాటు మరో ఆరుగురిపై కేసు నమోదు చేశామని ఆమె తెలిపారు.

Updated Date - May 08 , 2024 | 01:00 AM