Share News

నూజివీడు ట్రిఫుల్‌ ఐటీలో.. ఏం జరుగుతోంది?

ABN , Publish Date - Jul 27 , 2024 | 12:32 AM

గ్రామీణ స్థాయి విద్యార్థుల కు ప్రపంచస్థాయి సాంకేతిక విద్యను అందించాలనే సదాశ యంతో రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ నాలెడ్జ్‌ అండ్‌ టెక్నాలజీ పరిధిలోని ట్రిపుల్‌ ఐటీలు 2008లో ప్రారంభించారు.

 నూజివీడు ట్రిఫుల్‌ ఐటీలో.. ఏం జరుగుతోంది?

ఉన్నతాధికారుల రాజీనామాలతో కరువైన పర్యవేక్షణ

దారి తప్పుతున్న విద్యార్థులు..

దాడులు, మందు పార్టీలతో హల్‌చల్‌

సిబ్బంది నియామకంలోనూ పెరిగిన రాజకీయ జోక్యం

విద్యా సంస్థలోకి రాజకీయాల చొరబాటు

నూజివీడు టౌన్‌, జూలై 26 : గ్రామీణ స్థాయి విద్యార్థుల కు ప్రపంచస్థాయి సాంకేతిక విద్యను అందించాలనే సదాశ యంతో రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ నాలెడ్జ్‌ అండ్‌ టెక్నాలజీ పరిధిలోని ట్రిపుల్‌ ఐటీలు 2008లో ప్రారంభించారు. అందులో ఒకటి నూజివీడు ట్రిఫుల్‌ ఐటీ. ఉన్నతాధికారుల నిర్లక్ష్యం పుణ్యమా అని ఈ సంస్థ ప్రతిష్ఠ మసకబారుతోంది. నిరంతరం పర్యవేక్షిం చాల్సిన ఉన్నతాధికారులు తమ విధు లకు రాజీనామా చేశామంటూ తమపై వున్న బాధ్యతను పట్టించుకోవడం లేదు. తమకు సంబంధం లేదనేలా వ్యవ హరించడంతో ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలకు వేదికగా మారింది. ప్రధానంగా సెక్యూరిటీ లోపాలతో విద్యార్థులకు మద్యం సరఫరా అవడంతో మత్తులో విద్యార్థులు పరస్పరం దాడులకు దిగి, గాయపరచుకున్న సంఘటనలు ఇటీవల తరచూ చోటు చేసుకుంటున్నాయి. టెక్‌ జెట్‌ సాక్షిగా విద్యా ర్థులు మద్యం సేవించి దాడులకు దిగిన ఘటనలు మరువక ముందే పది రోజుల క్రితం పుట్టిన రోజుల వేడుకల ముసుగు లో ఇంజనీరింగ్‌ ఆఖరి సంవత్సరం చదువుతున్న కొందరు క్యాంపస్‌లో వారు వసతి పొందుతున్న ఈలోగా మద్యం సేవించడం మత్తులో ఫుడ్‌ కోర్టు సమీపంలో ఒక విద్యార్థినితో అసభ్య ప్రవర్తన తృతీయ ఏడాది విద్యార్థులతో ఘర్షణ పడిన ఘటనలు ఆలస్యంగా వెలుగుచూశాయి. దీంతో ప్రత్యేక కమి టీ వేసిన అధికారులు సంబంధిత విద్యార్థుల తల్లిదండ్రులను పిలిచి వారిని మూడు నెలలపాటు సస్పెండ్‌ చేశారు.

బాధ్యులు మీరే

పదో తరగతి పూర్తవగానే విద్యార్థులను ఇంటిగ్రేటెడ్‌ ఇంజనీరింగ్‌ విద్య కోసం ట్రిపుల్‌ ఐటీలో చేర్పించి మీకు అప్ప గించాం. రెసిడెన్షియల్‌ విధానంలో సాగుతున్న సంస్థలోకి మద్యం ఎలా వచ్చిందంటూ ఘర్షణకు దిగిన విద్యార్థుల తల్లిదండ్రులు ట్రిపుల్‌ ఐటీ అధికారులను ప్రశ్నిస్తూ ఆగ్రహం వ్యక్తం చేయడంతో ప్రత్యేక కమిటీలోని అఽధికారులు కంగు తిన్నారు. దాడుల విషయం పోలీసుల వరకు వెళితే పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని క్రమశిక్షణా చర్యలతోనే సరి పెడుతున్నామంటూ అధికారులు విద్యార్థుల తల్లిదండ్రులకు చెప్పడంతో వారు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.

పెచ్చు మీరుతున్న రాజకీయ ప్రమేయం

నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో రాజకీయ ప్రమేయం నానాటికి పెరుగుతోంది. నాన్‌ టీచింగ్‌, సెక్యూరిటీ సిబ్బంది నియామ కాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల ప్రమేయం ఉండటంతో అవాంఛనీయ ఘటనలు జరిగిన సమయంలో వారిపై పల్లెత్తు మాట అనలేని పరిస్థితి. దీంతో విద్యార్థుల రక్షణకు సంబంధించి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కమిటీలకు తిలోదకాలు ఇచ్చిన గత ప్రభుత్వం

ఆర్‌జీయూకేటీ స్టూడెంట్‌ వెల్ఫేర్‌లో భాగంగా భద్రతా సం క్షేమం వంటి వాటి పర్యవేక్షణకు కమిటీలు ఏర్పాటు చేయాలి. గత టీడీపీ ప్రభుత్వంలో కమిటీలో పర్యవేక్షణ సాగగా వైసీపీ ప్రభుత్వంలో మాత్రం కమిటీలకు తిలోదకాలు ఇచ్చారనే ఆరోపణలు వున్నాయి. ప్రధానంగా భద్రతా కమిటీల్లో ఒక సీఐ ర్యాంకు అధికారితోపాటు సైకాలజిస్టును నియమించాలి. దాడులు, ఆత్మహత్యలు వంటి ఘటనలు జరిగినప్పుడు కౌన్సె లింగ్‌ నిర్వహించాలి. ఇందుకు సంబంధించి సీఐ, సైకాలజి స్టులను డిప్యూటేషన్‌పై నియమించుకునే వారైతే గత వైసీపీ ప్రభుత్వంలో సీఐ, సైకాలజిస్టుల డిప్యూటేషన్‌కు ఆర్‌జీయు కేటీ విధి విధానాలను నిర్ణయించే గవర్నింగ్‌ కౌన్సిల్‌ అంతగా సుముఖత చూపకపోవడంతో ఈ కమిటీలు పూర్తిగా నిర్వీర్య మయ్యాయి. ఫలితంగా నూజివీడు ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో మద్యం మత్తులో దాడులు వంటివి చోటు చేసుకుంటు న్నాయనే ఆరోపణలు వున్నాయి. వాటిని అరికట్టాల్సిన అధికారులు ఇటువంటి ఘటనలు బయటకు వెళితే సంస్థ రెఫిటేషన్‌ దెబ్బ తిని, క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌కు అవరోధం కలుగుతుందని ఘటనలను కప్పి పుచ్చుతున్నారే తప్ప సంస్థ ప్రతిష్ట దెబ్బ తింటుందనే ఆలోచన చేయడం లేదు. ట్రిపుల్‌ ఐటీల ప్రతిష్ట దెబ్బ తినడానికి గత ప్రభుత్వ విధానాలు ఒక విధంగా కారణమైతే ఆ ప్రభావం ప్రస్తుత కూటమి ప్రభు త్వంపై పడుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకొని ట్రిపుల్‌ ఐటీల ను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అసలు లోపమెక్కడ ?

నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో జరుగుతున్న అవాంఛనీయ ఘటనలకు ప్రధాన లోపం ఎక్కడనే అంశంపై చర్చ జరుగుతోంది. పరిపాలన బాధ్యతలు చూడాల్సిన డైరెక్టర్‌ సహా ఉన్నత స్థాయి అధికార వర్గం ఇటీవల వారి పదవులకు రాజీనామా చేశారు. దీంతో వీరు తమ విధులపై అంతగా శ్రద్ధ చూపడం లేదు. మరోవైపు డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అధికారి ఇక్కడ విధులకన్నా ఓడీల పేరుతో బయటే ఎక్కువగా ఉన్నా రని ఫలితంగా ట్రిపుల్‌ ఐటీపై పట్టు సాధించలేకపో యారని కొందరు సిబ్బంది అంతర్గతంగా వ్యాఖ్యానిస్తు న్నారు. చివరికి అడ్మిషన్ల ప్రక్రియలో అంతగా డైరెక్టర్‌ పాల్గొనలేదని ఆరోపణలు వచ్చాయి.

మంత్రి లోకేశ్‌ ప్రత్యేక దృష్టి

నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో జరుగుతున్న అరాచకాలు, సమస్యలను వివరిస్తూ విద్యార్థులు ట్విటర్‌ ఎక్స్‌ వేదికగా రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ దృష్టికి తీసుకుని వెళ్లారు. దీనిపై స్పందించిన ఆయన ‘నూజివీడు ట్రిఫుల్‌ ఐటీ విద్యార్థుల సమస్య నా దృష్టికి వచ్చింది. ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తానని నా చెల్లెళ్లు, తమ్ముళ్లకు హామీ ఇస్తున్నాను. విద్యార్థుల చదువు, ఆరోగ్యం వారి భద్రతే మా మొదటి ప్రాధాన్యత. మీ బంగారు భవిష్యత్‌కు నాదీ బాధ్యత’ అంటూ స్పందించారు. అనంతరం అసెంబ్లీ సమావేశాల సాక్షిగా విద్యా శాఖ అధికారులకు సుతిమెత్తగా హెచ్చరికలు జారీచేశారు. గత ప్రభుత్వం వ్యవస్థలను భ్రష్టు పట్టించింది. అధికారులలో బాధ్యత లేకుండా పోయింది. నేను చెబితేనే భోజన నాణ్యతలో మార్పులు వస్తున్నాయి. నెల రోజులు సమయం ఇస్తున్నా. గాడి తప్పిన వాటిని గాడిలో పెట్టాలి. ఇకపై నేను ప్రత్యేక దృష్టి పెట్టి పర్యవేక్షిస్తా’ అంటూ స్పష్టం చేశారు.

Updated Date - Jul 27 , 2024 | 12:32 AM