Share News

కూటమి.. కేక

ABN , Publish Date - May 08 , 2024 | 12:58 AM

పోలింగ్‌ సమయం సమీపిస్తోంది. వైసీపీకి దీటుగా కూటమి పక్షాన ఎంపీ అభ్యర్థులు పుట్టా మహేష్‌ కుమార్‌ యాదవ్‌, శ్రీనివాసవర్మ అటు ప్రచారంలోనూ ఇటు ఎత్తుగడలలోనూ పైచేయిగా నిలుస్తున్నారు.

కూటమి.. కేక
చింతలపూడి మండలం గొల్లగూడెం సభలో మాట్లాడుతున్న ఏలూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్‌

(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి )

ప్రచారం, ఎత్తుగడల్లో ఎంపీ అభ్యర్థులు పుట్టా,వర్మదే పై చేయి

అన్నిచోట్ల సైకిల్‌ అభ్యర్థుల జోష్‌

జనసేన అభ్యర్థులది దూకుడే

అధికార వైసీపీ నివ్వెరపోయేలా కూటమి ఎత్తుగడలు

ఈ మూడురోజులు ఊరువాడ హోరే

ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ప్రచార సరళి

పోలింగ్‌ సమయం సమీపిస్తోంది. వైసీపీకి దీటుగా కూటమి పక్షాన ఎంపీ అభ్యర్థులు పుట్టా మహేష్‌ కుమార్‌ యాదవ్‌, శ్రీనివాసవర్మ అటు ప్రచారంలోనూ ఇటు ఎత్తుగడలలోనూ పైచేయిగా నిలుస్తున్నారు. తమ టీమ్‌ ఎమ్మెల్యే అభ్యర్థులతో దూసుకుపోతున్నారు. సామాజిక వర్గాలకు చెందినవారే కాక ఇప్పటి వరకు వైసీపీలో ఉన్న కార్యకర్తలు కూడా కూటమిలో చేరేందుకు ఎంపీ అభ్య ర్థుల సమక్షంలోనే క్యూ కడుతున్నారు. దాదాపు అన్ని నియోజక వర్గాల్లో ఈ తాకిడి పెరగడం, రాబోయే ఫలితాలకు ఒక సంకేతంగా ఉందని కూటమి భావిస్తోంది. ఇప్పటికే ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ప్రచారంలో, ప్రజలకు మరింత చేరువ అవ్వడం లో కూటమి పక్షాన మేనిఫెస్టో ప్రజలకు చేర్చడంలోనూ ముందు వరుసలో ఉన్నట్టు అంచనా వేస్తున్నారు.

ఎంపీ అభ్యర్థుల హవా

ఏలూరు లోక్‌సభ స్థానం నుంచి కూటమి అభ్యర్థిగా పోటీలో నిలబడిన పుట్టామహేష్‌యాదవ్‌ ప్రచారంలో వినూత్నంగా వ్యవహరిస్తున్నారు. తనకంటూ ఒక ఆత్మీయ బలగాన్ని చేరువ చేసుకోవడానికి ఆయన ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలోనూ విస్తృతంగా పర్యటించగలిగారు. తక్కువ సమయంలోనే ఎక్కువ ప్రాంతాలను మహేష్‌ యాదవ్‌ సందర్శించగలిగారు. ఓ వైపు కూటమి బిగ్‌బాస్‌లు ప్రచారానికి ఆయా నియోజకవర్గాలకు వస్తుండటం వాటిల్లో పాలుపంచుకుంటూనే మరోవైపు ఏ నియోజక వర్గానికి సంబంధించి అక్కడే ఏ సమయంలోనైనా వాలిపోవడం స్థానిక అవసరాలకు అనుగుణంగా స్పందించడం, తక్షణ చర్యలకు దిగడం వంటి పరిణామాలు అన్ని కూటమి అభ్యర్థి మహేష్‌ ప్రచారంలో పై చేయి సాధించటానికి కారణమయ్యాయి. ముక్కుసూటిగా, ఉన్నది ఉన్నట్లుగా ప్రజలకు భరోసా ఇవ్వడమే కాకుండా ప్రత్యర్థి పార్టీ వైసీపీ సవాళ్లను, ఆరోపణలను దీటుగా తిప్పికొట్టడం నియోజకవర్గాలు అన్నింటిలోనూ ప్రచారంలో ఆయనకు పూర్తిగా కలిసివచ్చింది. ఇదే స్పీడుతో పోలింగ్‌ వరకు దూసుకుపోతానని ఆయన కూటమి ముఖ్యనేతలు అందరికి భరోసా ఇస్తూనే తన స్పీడు అందుకోవాల్సిందిగా విజ్ఞప్తి కూడా చేస్తున్నారు. దీంతో నియోజక వర్గాల్లో కూటమి కేడర్‌ ఉత్సాహంతో ఉరుకులు వేస్తోంది. నరసాపురంలో బీజేపీ బలపరిచిన లోక్‌సభ అభ్యర్థి శ్రీనివాసవర్మ కూటమి పక్షాన ప్రచారంలో ఇప్పటికే ముందు వరుసలో ఉన్నారు. ఆయా నియోజక వర్గాల్లో అసెంబ్లీ అభ్యర్థులతో కలిసి క్షణం తీరకలేకుండా ప్రచారంలో పాల్గొనడమే కాకుండా కొన్ని నియోజకవర్గాల్లో తన ప్రసంగాల్లో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇదంతా కూటమి కేడర్‌లో జోస్‌ పెంచినట్టు అయింది. కూటమి మేనిఫెస్టోతో పాటు తనకు ఉన్న అనుభవం, స్థానిక సమస్యలపై అవగాహన, ప్రచారంలో స్థానికులను కలుసుకోవడం, తగినన్ని వాగ్దానాలు ఇవ్వడం ద్వారా ప్రజలకు మరింత చేరువ కాగలిగారు. ప్రచారపర్వంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో ప్రజలను కలుసుకోగలిగారు. దీంతో అధికార వైసీపీకి అక్కడ గట్టిపోటీ ఇచ్చేలా వ్యూహం అమలు చేయగలిగారు.

సైకిల్‌ అభ్యర్థుల జోరు

ఏలూరు, నరసాపురం లోక్‌సభ స్థానాల పరిధిలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఉన్న టీడీపీ పక్షాన పోటీ పడుతున్న వారంతా ఇప్పటికే మండుటెండల్లోనే ప్రచారంలో దూసుకువెళుతూ వచ్చారు. ఈ మధ్యనే కూటమి పక్షాన విడుదలైన మేనిఫెస్టో వీరిలో మరింత జోష్‌ పెంచింది. ఏలూరులో బడేటి చంటి, దెందులూరులో చింతమనేని ప్రభాకర్‌, చింతలపూడిలో సొంగా రోషన్‌, పాలకొల్లులో నిమ్మల రామానాయుడు, నూజివీడులో కొలుసుపార్థసారథి, ఆచంటలో పితాని సత్యనారాయణ, ఉండిలో రఘురామకృష్ణంరాజు, తణుకులో ఆరిమిల్లి రాధాకృష్ణ ఇప్పటికే ప్రచారంలో అధికారపక్షానికి మించి దూసుకుపోయారు. మరేపార్టీకి అందనంత వేగంగా ముందుకు సాగారు. ఉండిలో ఫైర్‌బ్రాండ్‌ రఘురామకృష్ణంరాజు క్షణం తీరికలేకుండా ప్రచారంలో ప్రజల మధ్య ఉంటున్నారు. ఆయనకు వాడవాడలా జనం మద్దతు లభిస్తుండటంతో కూటమి నేతలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంకోవైపు పార్టీలో సీనియర్‌, పొలిట్‌బ్యూరో సభ్యుడు పితాని సత్యనారాయణ ఈ మధ్యకాలంలో ప్రచార దూకుడిని పెంచి ప్రత్యర్థిని తికమక పెడుతున్నారు. పాలకొల్లులో నువ్వానేనా అన్నట్టుగా నిమ్మలరామానాయుడు నిత్యం జనంతో మమేకం అవుతూనే ఆఖరికి సైకిల్‌మీద ప్రచారంలో పాల్గొనడం అందరిని ఆకర్షిస్తోంది. తణుకులో ఆరిమిల్లి రాధాకృష్ణ సరికొత్త, వినూత్న ప్రచారంలో ఎవరికి తీసిపోకుండా తణుకు బరిలో ఉన్న వైసీపీ అభ్యర్థి, మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు కొత్త సవాళ్ళు విసురుతున్నారు.

అన్నిచోట్ల జనసేన క్రేజ్‌

పొత్తులో భాగంగా ఉంగుటూరు, పోలవరం, భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం నియోజక వర్గాల నుంచి జనసేన అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరంతా ప్రచారంలోనూ ప్రజలకు దగ్గరకావడంలోనూ వాగ్ధానాలను సమర్థవంతంగా వివరించడంలోనూ ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో పై చేయి సాధించారు. పోలింగ్‌కు సమయం దగ్గరపడటంతో నిద్రాహారాలు మానిమరీ ప్రచారాన్ని గరిష్ఠస్థాయికి తీసుకెళ్లగలిగారు. జనసేన అభ్యర్థులు పులపర్తి రామాంజనేయులు, బొలిశెట్టి శ్రీనివాస్‌, బొమ్మిడి నాయకర్‌, పత్సమట్ల ధర్మరాజు, చిర్రి బాలరాజు తమకు ఉన్న పరిధిలో ఎన్నికల ప్రచారంలో వినూత్నంగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడ చూసినా జనసేనాని పవన్‌ పంచ్‌డైలాగులు, మేనిఫెస్టో పోరే వినిపిస్తోంది. కూటమి పక్షాన జనసేన పోటీ చేస్తున్న నియోజకవర్గాలు అన్నింటిలోనూ టీడీపీ, బీజేపీ పూర్తిగా కలిసిరావడం వీరి ప్రచారంలో జోష్‌ పెంచింది. దీంతో గెలుపు తమదే అనే విధంగా దూసుకెళ్లుతున్నారు.

కైకలూరులో కామినేని

కైకలూరు నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌ గడిచిన కొన్నాళ్ళ నుంచి చేస్తున్న ప్రచారం ఇప్పుడు మరింత జోరు పెంచేశారు. వయోభారాన్ని లెక్క చేయకుండా మండుటెండను తట్టుకుని ఆయన కైకలూరులో దూసుకువెళ్ళటం మిగతా పార్టీలు సైతం నివ్వెరపోయేలా చేస్తోంది. ప్రచారంలో ప్రజలకు చేరువ కావడంలోనూ, కూటమి పక్షాన ఇప్పటిదాకా ఆయనదే పై చేయిగా కనిపిస్తోంది. ఎన్నికల కమిషన్‌ నియమావళి ప్రకారం ప్రచారం చేస్తూనే ఇంకోవైపు అన్నివర్గాలను ఆకర్షించేలా తనదైనశైలిలో ఇన్నాళ్ళు ప్రచారం చేయడమే కాకుండా రానున్న కొద్దిరోజుల్లోనూ వేలాదిమంది తనకు చేరువ అయ్యేలా ప్రచారం వ్యూహాన్ని అమలు చేయబోతున్నారు. దీంతో పాటు జనసేన, తెలుగుదేశం ఉమ్మడిగా తనతో పాటు ప్రయాణిస్తూ ఉండడంతో కామినేని ప్రచారాన్ని హోరెత్తించేశారు.

Updated Date - May 08 , 2024 | 12:58 AM