Share News

ఈదురు గాలులు.. భారీ వర్షం

ABN , Publish Date - May 08 , 2024 | 01:01 AM

భారీగా ఈదురు గాలులు....ఉరుములు, పిడుగులతో కూడిన వర్షంతో జిల్లాలో జనజీవనం స్తంభించింది.

ఈదురు గాలులు.. భారీ వర్షం
కోటనాగవరంలో విరిగిపడిన కొబ్బరి చెట్లు, తెగిపోయిన విద్యుత్‌ వైర్లు

నేలరాలిన మామిడి.. నేలకొరిగిన అరటితోటలు

విరిగిపడిన విద్యుత్‌ స్తంభాలు

ఏజెన్సీలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం

నిలిచిన విద్యుత్‌, అంధకారంలో ఏజెన్సీ గ్రామాలు

పిడుగుపాటుకు ఇద్దరి మృతి

ఏలూరు సిటీ/బుట్టాయగూడెం/ద్వారకా తిరుమల/లింగపాలెం, మే 7 : భారీగా ఈదురు గాలులు....ఉరుములు, పిడుగులతో కూడిన వర్షంతో జిల్లాలో జనజీవనం స్తంభించింది. మంగళవారం పగలు 43 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వరకు ఉష్ణోగ్రతలు నమోదు కాగా మధ్యాహ్నం 3 గంటల నుంచి ఈదురుగాలులుతో కూడిన భారీ వర్షం కురవడంతో వాతా రణం ఒక్క సారిగా చల్లబడింది. వాతావరణ మార్పులు కారణంగా, ద్రోణి ప్రభావంతో మంగళవారం వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దానికి తగ్గట్టుగానే జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. ఏలూరు నగరంలో భారీగా కురిసిన వర్షానికి రహదారులపై నీరు ఉధృతంగా ప్రవహించింది. జిల్లాలోని అనేక ప్రాంతాలలో ఇదే పరిస్థితి కనిపించింది. రబీ వరి సాగు చివరి దశలో ఉండడం, ఇంకా కొన్ని ప్రాంతాల్లో మాసూళ్లు పూర్తి కాకపోవడంతో చేతికొచ్చిన వరి పంట వర్షం నీటి పాలైంది. పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో బలమైన ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షం కురిసింది. ఈదురు గాలులకు పలుచోట్ల విద్యుత్‌ స్తంభాలు విరిగిపోగా వైర్లు తెగిపోయాయి. కోటనాగవరంలో ఇళ్ల మధ్యలో ఉన్న కొబ్బరి చెట్లు విరిగి పడి విద్యుత్‌ వైర్లు తెగిపోయాయి. కరెంట్‌ లేక ఏజెన్సీ గ్రామాల్లో అంధకారం నెలకొంది. 11 కేవీ లైన్లు కూడా దెబ్బతినడంతో విద్యుత్‌ అధికారులు, సిబ్బంది విద్యుత్‌ను పునరుద్ధరించే పనుల్లో నిమగ్న మయ్యారు. ద్వారకా తిరుమల చినవెంకన్న క్షేత్రంపై దాదాపు రెండుగంటల పాటు ఎడతెరపిలేని వర్షం కురవడంతో క్షేత్రపరిసరాలు జలమయమయ్యాయి. శ్రీవారి ప్రధాన రాజగోపుర మెట్ల దారిలో వర్షపునీరు ఉరకలెత్తింది.

Updated Date - May 08 , 2024 | 01:01 AM