Share News

గాలి.. వాన బీభత్సం

ABN , Publish Date - May 08 , 2024 | 01:20 AM

మండల వ్యాప్తంగా మంగళవారం మధ్యాహ్నం ఈదురు గాలి, ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వర్షం గ్రామాల్లో విధ్వంసం సృష్టించింది.

గాలి.. వాన బీభత్సం
ముసునూరులో ఈదురు గాలులకు నేలకొరిగిన అరటిపంట

విరిగిన విద్యుత్‌ స్తంభాలు

ఒరిగిన అరటి తోటలు

జలమయమైన రహదారులు

సేదతీరిన ప్రజలు

ముసునూరు, మే 7: మండల వ్యాప్తంగా మంగళవారం మధ్యాహ్నం ఈదురు గాలి, ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వర్షం గ్రామాల్లో విధ్వంసం సృష్టించింది. ఈదురు గాలులకు ముసునూరు, అక్కిరెడ్డిగూడెం, చెక్కపల్లి తదితర గ్రామాల్లో గెల దశలో ఉన్న అరటిపంటలు నేలకొరిగి తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముసునూరులో రైతు దేవినేని శ్రీవెంకటేశ్వర రావుకు చెందిన 4 ఎకరాలు గెల దశలో ఉన్న అరటిపంట పూర్తిగా దెబ్బతింది. సుమా రు రూ. 3 లక్షల వరకు నష్టం వాటిలిందని రైతు వాపోయారు. అలాగే గ్రామా ల్లో డ్రైనేజీ వ్యవస్ధ లేక అంతర్గత, ప్రధాన రహదారులు చిన్నపాటి చెరువులను తలపించగా, వాగు, వంకలు పొంగిపొర్లాయి. రమణక్కపేట కుమ్మరి బజారులో వర్షపునీరు పోయే దారిలేక కొన్ని ఇళ్ళలోకి చేరింది. అ రహదారిలో మోకాలులోతు వరకు నీరు ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. దీనిపై పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్‌లకు సమాచారం ఇచ్చినా స్పందన లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలు గ్రామాల్లో ఈదురు గాలులకు రహదా రులపై పెద్ద, పెద్ద చెట్లు విరిగిపోయి రాకపోకలకు అంత రాయం ఏర్పడగా, వాటిని తొలగింపు చర్యలను అధికారులు చేపట్టారు. ఈదురు గాలుల విధ్వంసానికి మండల వ్యాప్తంగా 23 విద్యుత్‌ స్తంభాలు విరిగిపో వడంతో పలు గ్రామాల్లో సరఫరా నిలిచిపోయిందని ఏఈ ఆకుల హేమ సుందర్‌ కుమార్‌ తెలిపారు. సుమారు రూ. 2 లక్షల 30 వేలు నష్టం వాటిల్లిం దన్నారు. గ్రామాల్లో విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరిచేందుకు ట్రాన్స్‌కో సిబ్బంది చర్యలు చేపట్టారు. ఎండలకు అల్లాడిన ప్రజలు ఈ భారీ వర్షానికి సేదతీరారు.

చాట్రాయి: ఈదురుగాలి, ఉరుములతో భారీ వర్షం కురవటంతో ప్రజలకు ఊరట లబించగా, మామిడికాయలు నేలరాలి రైతులు నష్టపోయారు. మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణ మారిపోయింది. ఉరుములతో సుమారు గంట సేపు వర్షం కురిసింది. ఈ ఏడాది మామిడి కాపు చాలా తక్కువగా వచ్చింది. ఇటీవల ధరలు తగ్గటంతో రైతులు కోతలు కొన్ని రోజులు వాయిదా వేసుకోగా, గాలివానకు కాయ మొత్తం రాలిపోయి తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆగిరిపల్లి: అకాలవర్షం మామిడి వ్యాపారుల్ని ముంచింది. మంగళవారం సాయంత్రం సుమారు గంటకు పైగా వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. మామిడి పంట చేతికి వస్తున్న తరుణంలో గాలివానతో కురిసిన ఈ వర్షం వల్ల మామిడి రైతులు, కొనుగోలుదారులు నష్టానికి గురయ్యారు.

నూజివీడు టౌన్‌: భానుడి భగభగల నుంచి నూజివీడు వాసులకు కాస్త ఉపశమనం లభించింది. మంగళవారం మధ్యాహ్నం నుంచి వాతా వరణంలో మార్పు చోటుచేసుకుని మూడు గంటల నుంచి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా మేఘాలు కమ్ముకుని చిరుజల్లులతో ప్రారంభమైన వర్షం దాదాపు రెండు గంటల పాటు కురిసింది. తొలుత ఈదురు గాలులు వీచినా మామిడి తోటలపై అంత ప్రభావం చూపకపోవడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. అసలే ఈ సీజన్‌లో మామిడి దిగుబడులు తగ్గి ఆందో ళనలో ఉన్న రైతులకు ఈదురు గాలుల ప్రభావం ఉంటే మరింత నష్టపోవాల్సి వచ్చేదని, వర్షం ముందు ఓ మోస్తరు ఈదురుగాలులు వీచినా అంతగా కాయ రాలకపోవడంతో పెద్దనష్టం జరగలేదని రైతులు పేర్కొం టున్నారు. అయితే దాదాపు ఐదునెలల తరువాత పడిన వర్షంవల్ల మామిడి తోటలు, ఇతర ఉద్యానవన పంటలకు కొంత మేలు చేకూరుతుందని రైతులు చెబుతున్నారు.

ముదినేపల్లి: రెండు నెలలుగా తీవ్రమైన ఎండ, వడగాల్పులతో ఉక్కిరి బిక్కిరి అయిన గ్రామీణ ప్రజలు మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షం నుంచి ఊరట లభించింది. ఈదురుగాలులతో ముదినేపల్లి ప్రాంతంలో రెండు గంటల పాటు కురిసిన వర్షంతో ప్రజలు సేదతీరారు. గాలులకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పలుచోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది.

కలిదిండి: కలిదిండిలో మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల పాటు ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. చెట్ల కొమ్మలు విరిగి పడ్డాయి. ముందస్తుగా విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. కొద్ది రోజులుగా మండుతున్న ఎండల నుంచి ప్రజలు ఉపశమనం పొందారు. అంతర్గత రహదారులు జలమయమయ్యాయి. అకాల వర్షంతో చెరువుల్లో నీరు చల్లబడి ఆక్సిజన్‌ లోపించి రొయ్యలు మృత్యువాత పడే ప్రమాదం ఉందని ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈదుగాలులతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలగటంతో అద్దె జనరేటర్లను ఏర్పాటు చేసి చెరువులో ఏరియేటర్లు తిప్పుతున్నారు.

Updated Date - May 08 , 2024 | 01:20 AM