Share News

మెరిసేదంతా.. వెండి కాదు!

ABN , Publish Date - Nov 21 , 2024 | 12:29 AM

వస్తువుల్లో ఎంత శాతం వెండి ఉందో అన్న విషయాన్ని ఆరా తీసి కొనుగోలు చేయాలి. కొన్ని వస్తువుల్లో 85శాతం వెండి ఉంటుంది. మరికొన్నింటిల్లో 75, 65, 55, 45శాతం కూడా ఉంటుంది.

మెరిసేదంతా.. వెండి కాదు!

చాలా వస్తువుల్లో సగం శాతమే వెండి

మార్కెట్‌ రేటు కంటే తక్కువ ధరకు విక్రయాలు

ఆరా తీయకుండా కొనుగోళ్లు

ధర లక్షకు చేరడంతో వెలుగు చూస్తున్న మోసాలు

కొనేటప్పుడు ఎంత శాతం వెండి ఉందో అడగాలి: వ్యాపారులు

నరసాపురం, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): ఇటీవల కేజీ వెండి ధర రూ.లక్ష దాటింది. దీంతో ఓ వ్యక్తి తన దగ్గర ఉన్న మూడు కేజీల వెండిని విక్రయించాలని మార్కెట్‌కు వచ్చాడు. తరుగు పోను.. కనీసం రూ.2.60లక్షల వరకు వస్తుందని అంచనా వేశాడు. అయితే ఆ వస్తువుల్ని పరిశీలించిన బులియన్‌ వ్యాపారి ఇందులో వెండి శాతం తక్కువుగా ఉందని చెప్పడంతో ఆ కస్టమర్‌ షాక్‌ తిన్నాడు. ఇలా ఒకరూ కాదు... ఇద్దరు కాదు.. చాలా మంది పెరిగిన వెండి ధరలను చూసి తమ దగ్గర ఉన్న వెండి కూడా అంతే ధర ఉంటుందని లెక్కలు కట్టుకుంటారు. ఇలా భావిస్తే మీరు పొరపడినట్లే. బంగారానికి మేలిన, 22 క్యారెట్లు, ఆర్నమెంట్‌ బంగారం అని ఎలా ఉంటుందో.... వెండికి కూడా ఇలాగే ఉంటుంది. అయితే ఇది శాతంలో ఉంటుంది. వస్తువుల్లో ఎంత శాతం వెండి ఉందో అన్న విషయాన్ని ఆరా తీసి కొనుగోలు చేయాలి. కొన్ని వస్తువుల్లో 85శాతం వెండి ఉంటుంది. మరికొన్నింటిల్లో 75, 65, 55, 45శాతం కూడా ఉంటుంది. అయితే ఈ వస్తువులన్ని మేలిన వెండి వస్తువుల వల్లే దగదగ మెరిసిపోతాయి. ఇలా తెలుసుకోకుండా మార్కెట్‌లో కేజీ వెండి రూ.లక్ష ఉన్న కొందరు వ్యాపారులు తక్కువ ధరకు విక్రయిస్తారు. ఇలాంటి సమయంలో ఆ వస్తువులో ఎంత శాతం వెండి ఉందో అన్న విషయాన్ని కస్టమర్లకు చెప్పరు. ఇలాంటి వస్తువుల్ని కొంటే మోసపోయినట్లే. పట్టిల దగ్గర నుంచి గ్లాసు, చెంబు, కంచం ఇలా ఏ వస్తువు చూసినా... ఆందులో నూరుశాతం వెండి ఉండదు. 90శాతం వెండి వస్తువులు కావాలంటే తయారు చేయించి ఇస్తారు, దీనికి తరుగు, మజూరి తీసుకుంటారు. అయితే ప్రస్తుతం మార్కెట్‌లో అమ్ముతున్న ఏ వెండి వస్తువు కొన్నా తరుగు, మజూరి ఉండదు. ఇక్కడే అసలు మోసం ఉంది.

జిల్లాలో కొట్లలో వ్యాపారం....

జిల్లా పసిడి, వెండి మార్కెట్‌కు ప్రసిద్ధి. నిత్యం కోట్లల్లో వ్యాపారం జరుగుతుంది. అందులో అత్యధికంగా వెండి వస్తువులే అమ్మకాలు జరు గుతుంటాయి. జిల్లా వ్యాప్తంగా దాదాపు 700 పైగా వెండి విక్రయ దుకాణాలు ఉన్నాయి. పేరుకు జ్యూయలరీ షాపులు అయినప్పటికీ ఎక్కువ అమ్మకాలు వెండి వస్తువులే ఉంటా యి. బంగారాన్ని చాలా మంది కాసు, ఆరకాసు, గ్రాముల్లో కొని దాచుకుంటారు. డ బ్బులు ఉన్నప్పుడల్లా బంగారం మీద పెట్టు బడి పెడతారు. వెండి మీద ఇలా పెట్టుబడి పెట్టేవారి సంఖ్య తక్కువ. ఎందుకంటే వెండి కేజీల్లో ఉంటుంది. దీంతో ఎక్కువ మంది వస్తువులనే కొనుగోలు చేస్తుంటారు.

తక్కువ శాతం వెండితో రంగు మార్పు

సాధారణంగా వెండి వస్తువుల్ని కొనుగోలు చేసి వాటిని బీరువాలో భద్రపరుస్తారు. కొం దరు బ్యాంకు లాకర్‌లో దాచుకుంటారు. పూ జలు, ఇంట్లో ఏదైన శుభకార్యక్రమాలు జరిగినప్పుడు వాటిని బయటకు తీస్తారు. ఇలా తీసినప్పుడు వాటి రంగు బయటప డుతుంది. తక్కువ శాతం వెండి ఉన్నవస్తు వులు కొద్దికాలానికే నల్లబడతాయి. అయితే కొద్ది మంది వెంటనే వెళ్లి వ్యాపారిని నిల దీస్తారు. అలాంటి సమయంలో కొందరు వాటికి పాలిష్‌ పెట్టి ఇస్తుంటారు. అయితే చాలా మంది వెండి నల్లబడటం సాధారణ మనుకుని సరిపుచ్చుకుంటారు. చింతపండు, పెస్టు, కొల్‌గేట్‌ పౌడర్‌లతో కడుగుతారు. ఇలా వాష్‌ చేయగానే అవి మళ్లీ మెరిసి పోతాయి. అంతేగాని వాటిలో ఉన్న వెండి శాతం గురించి ఆరా తీయరు. ఒకవేళ అమ్మి నప్పుడే వాటిని కరిగిస్తారు. ఇలాంటి సమ యంలోనే అందులో ఉన్న వెండి నాణ్యత బయటపడుతుంది.

అడిగి కొనుగోలు చేయాలి

మార్కెట్‌ ధర కంటే తక్కువకు వస్తువులు వస్తున్నాయని ఆశపడి కొనుగోలు చేయకూడదు. కేజీ వెండి లక్ష ఉన్నప్పుడే రూ.60వేలకు వస్తువులు ఎలా ఇస్తున్నారన్న విషయాన్ని తెలుసుకోవాలి. నమ్మకం ఉన్న షాపుల్లోనే కొనుగోలు చేసుకోవాలి. కొనే ముందు ఒకటి రెండు సార్లు వెండి శాతంపై ఆరా తీయాలి. ఆప్పుడే వ్యాపారీ ఖచ్చితంగా చెబుతాడు. తిరిగి వస్తువులు అమ్మేటప్పుడు కూడా కొన్న రేటు వస్తుంది.

– వినోద్‌ కుమార్‌ జైన్‌,

బులియన్‌

అసోసియేషన్‌ అధ్యక్షుడు

Updated Date - Nov 21 , 2024 | 12:29 AM