Share News

ఏలూరులో సైకిల్‌ జోరు

ABN , Publish Date - May 09 , 2024 | 12:05 AM

సుదీర్ఘ రాజకీయచరిత్ర కలిగిన ఏలూరు పీఠాన్ని కైవసం చేసుకునేందుకు ఉత్కంఠ పోరు.

ఏలూరులో సైకిల్‌ జోరు

దేనికైనా సిద్ధమంటున్న వైసీపీ

ధీటుగా టీడీపీ కూటమి

నగర ఓటర్లే ఇక్కడ అత్యంత కీలకం

సార్వత్రిక ఎన్నికల్లో పోటీలో ఏడోసారి పోటీ చేస్తున్న అనుభవం ఆయనిది. కాంగ్రెస్‌.. వైసీపీలో పైచేయిగా ఉండి ఏలూరు స్థానంలో మరెవరికీ చోటు లేకుండా సుదీర్ఘకాలం పాటు ఒకే నియోజకవర్గంలో పోటీ చేసిన నేత. ఎమ్మెల్యే నుంచి ఉపముఖ్యమంత్రి స్థాయికి ఎదిగి, ఈసారి కూడా ఏలూరు బరిలో దిగారు వైసీపీ అభ్యర్థి ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్‌ అలియాస్‌ నాని. రాజకీయ ఉద్దండులు తాత, తండ్రి, అన్న నుంచి రాజకీయాన్ని అందిపుచ్చుకున్న నాయకుడు. ఎక్కడ ఎదగాలో మరెక్కడ ఒదిగుండాలో తెలిసి రాజకీయక్షేత్రంలో చక్రం తిప్పే ఉద్దండుడు. తన అన్న, మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి మరణానంతరం తెలుగుదేశం పగ్గాలు అందుకున్న రాజకీయ వారసుడిగా అందరిని ఆకట్టుకునే తెలుగుదేశం అభ్యర్థి బడేటి రాధాకృష్ణయ్య అలియాస్‌ చంటి. వీరిద్దరి నడుమ ఈ సార్వత్రిక ఎన్నికల్లో అమీతుమీ తేల్చుకునే స్థాయి పోరు సాగుతోంది. ఏలూరు నగర ఓటర్లే గెలుపు ఓటములకు అత్యంత కీలకం కాబట్టి ఆ దిశగా గానే వీరిద్దరి ఎత్తులు.. పై ఎత్తులు. తొలిసారి గెలుపు దిశగా బడేటి చంటి అడుగులు.. దీనిని అడ్డుకునేందుకు సీనియర్‌గా ఆళ్ళ నాని ఎత్తుగడలు.

(ఏలూరు, ఆంధ్రజ్యోతి ప్రతినిధి)

వారసుడొస్తున్నాడు..!

సుదీర్ఘ రాజకీయచరిత్ర కలిగిన ఏలూరు పీఠాన్ని కైవసం చేసుకునేందుకు ఉత్కంఠ పోరు. ఒకరిది రాజకీయ అనుభవం, మరొకరిది రాజకీయ వ్యూహాత్మక అడుగులు. కుటుంబ నేపథ్యం ఒకరిది, రాజకీయపక్షాల సారఽథ్యం ఇంకొకరిది. ఈ రెండు కుటుంబాలు సుదీర్ఘకాలంగా నువ్వా నేనా అంటూ ఏలూరులో తలపడుతున్నాయి. ఏలూరు నుంచి 2014లో బడేటి బుజ్జి ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికయ్యారు. అప్పటి వరకు కొనసాగిన అళ్ళ నాని ఆధిపత్యానికి బడేటి బుజ్జి బ్రేక్‌ చేశారు. ఏలూరులో తన ముద్ర వేసుకునే దిశగా వినూత్న అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేట్టారు. తండ్రి, తాత, రాజకీయ వారసత్వ పోకడులున్న బుజ్జి రాజకీయాల్లో దూకుడు ప్రదర్శించారు. ఉదయం ఆరు గంటలకు క్యాంపు కార్యాలయంలో ప్రజల విజ్ఞప్తులను స్వయంగా తీసుకున్న ఏకైక ఎమ్మెల్యేగా అప్పట్లోనే చంద్రబాబు దృష్టిని ఆకర్షించారు. నిత్యం ప్రజలతో ఉండడం, వారి బాగోగులు, ఆర్థిక సమస్యలు, వైద్య సదుపాయాల కల్పనలో రాత్రి అపరాత్రి తేడా లేకుండా నిమగ్నమయ్యారు. ఆయన మరణానంతరం తెలుగుదేశం సారధ్య బాధ్యతలను బడేటి చంటికి అప్పగించి ఏలూరు నియోజవర్గ కన్వీనరుగా చంద్రబాబు నియమించారు. కరోనా కష్టకాలంలో తనదైన శైలిలో పలువురికి న్యాయం చేశారు. వైసీపీ దుందుడుకు చర్యలకు దిగుతున్నా, కక్ష సాఽధింపు చర్యలతో అక్రమ కేసులు బనాయిస్తున్నా ఏలూరు నగరం, రూరల్‌ క్యాడర్‌ను కాలు కదపనీయకుండా నిలువరిస్తూ వైసీపీ బెదిరించినా బడేటి చంటి నేరుగా ఢీకొన్నారు. క్యాడర్‌కు అండగా నిలబడ్డారు. ఏమైనా నేను చూసుకుంటానంటూ భుజం కాశారు. వైసీపీ ఏకపక్ష దూకుడుకు వ్యూహాత్మంగా అడ్డు తగిలారు. క్యాడర్‌పై ఎలాంటి కేసులు బనాయించినా అడ్డుకోవడంలో సక్సెస్‌ అయ్యారు. దీనితో పార్టీ, ప్రజల్లో బడేటి చంటికి గుర్తింపుతో సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేకి పోటీ చేసే స్థాయికి వచ్చారు. తొలిసారి ఏలూరు బరిలో దిగిన ఆయన ప్రత్యర్థి పార్టీ వైసీపీకి కంటిలో నలుసు అయ్యారు. వైసీపీని బలహీనపర్చేలా, వారి నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీసేలా సీనియర్‌ నేతలను, పలువురు కార్పొరేటర్లను, ధన బలమున్న క్యాడర్‌ను తనవైపు తిప్పుకుని ఎన్నికల బరిలో తొడ కొట్టారు. గెలుపు ఖాయమని, భారీ మెజార్టీ లక్ష్యమంటున్నారు. బడేటి చంటి, ఆయన మద్దతుదారులు. బీజేపీ, జనసేన బలం కూడా ఆయనకు కలిసొచ్చింది.

కెరటంలా ఎగసి..

యువజన కాంగ్రెస్‌ నేతగా రాజకీయాల్లోకి అడుగిడి ఏలూరు రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. మూడవ కంటికి తెలీయకుండా రాజకీయాలు నెరిపే ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్‌ ఏడోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఏలూరు బరిలో నిలిచారు. తొలుత కాంగ్రెస్‌లో పూర్తిస్థాయిలో పాగా వేసి అప్పటి జననేత వైఎస్‌ రాజశేరరెడ్డికి శిష్యుడి కొనసాగుతూ 2004, 2009లో ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలుపొందారు. వైఎస్‌ మరణానంతరం కొద్దికాలం కాంగ్రెస్‌లోనే కొనసాగి వైసీపీ ఆవిర్భావంతో ఆ వైపు మళ్లారు. 2014లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓటమి పొందినా తిరిగి 2019 ఎన్నికల్లో విజయం సాధించి జగన్‌ మంత్రివర్గంలో చేరారు. ఉప ముఖ్యమంత్రిగా రాజకీయంగా ఎదిగారు. తన సొంత క్యాడర్‌ను బలోపేతం చేసుకునే ప్రయత్నం చేశారు. కరోనా సమయంలో తన వంతు పాత్ర ఉండేలా జాగ్రత్త పడ్డారు. అయినప్పటికీ ఆయన కోటరీలో ముఖ్యులు కొందరు ఏకపక్షంగా వ్యవహరించడం, అంతా తన కన్నుసన్నల్లోనే జరగాలన్న వ్యక్తిగత పట్టుదల ఆళ్ళ నాని నాయకత్వంలో కాస్తంత నిశ్శబ్దాన్ని ఛేదించినట్లయింది. కొందరు సీనియర్లు, అత్యంత సన్నిహితులు పార్టీని వీడారు. కుడి ఎడమ భుజాలుగా వున్న మరి కొందరు పక్కకు జరిగారు. మంత్రి పదవి ఆరంభం నుంచి, ఆ తరువాత కూడా ఆళ్ళ నానికి ప్రజలకు మధ్య సన్నిహిత సంబంధాలు చెదిరాయి.

ఏలూరు బరిలో కాంగ్రెస్‌ పొత్తులో సీపీఐ అభ్యర్థి బండి వెంకటేశ్వరరావు, ఇతర పార్టీలు, స్వతంత్రులు ఉన్నారు. జర్నలిస్ట్‌గా, వామపక్షాల ప్రతినిధిగా బండి వెంకటేశ్వర రావు అనేక పోరాటాల్లో స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఏఐటీయూసీలోనూ కీలక నేతగా, సీపీఐలో రాష్ట్ర స్థాయి కంట్రోల్‌ స్థాయికి ఎదిగారు. మారిన పరిస్థితులు, కాంగ్రెస్‌లో పుంజుకున్న రాజకీయ బలంతో బండి వెంకటేశ్వరరావు ఎన్నికల సమరానికి సిద్ధమయ్యారు.

Updated Date - May 09 , 2024 | 12:05 AM