Share News

టీచర్లకు ఇక నెలవారీ ‘పని సర్దుబాటు’ ?!

ABN , Publish Date - Nov 19 , 2024 | 12:30 AM

టీచర్ల వర్క్‌ అడ్జస్ట్‌మెంట్‌ను ఇక మీదట నెలవారీగా చేపట్టడానికి కొత్త విధానానికి విద్యాశాఖ తెరతీసింది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే ఉపాధ్యాయులు ఏ స్కూలులో పనిచేస్తున్నామో లేదా తదుపరి నెలలో ఏ స్కూలులో పనిచేయాల్సి ఉంటుందోననే గందరగోళానికి గురికావడం ఖాయమని చెప్పవచ్చు.

టీచర్లకు ఇక నెలవారీ ‘పని సర్దుబాటు’ ?!

ఏ నెలకానెల విద్యార్థుల ఎన్‌రోల్‌మెంటే ప్రామాణికం

హెచ్చుతగ్గుల ఆధారంగా సర్‌ప్లస్‌, డిప్యుటేషన్లు !

ఏలూరు అర్బన్‌, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): టీచర్ల వర్క్‌ అడ్జస్ట్‌మెంట్‌ను ఇక మీదట నెలవారీగా చేపట్టడానికి కొత్త విధానానికి విద్యాశాఖ తెరతీసింది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే ఉపాధ్యాయులు ఏ స్కూలులో పనిచేస్తున్నామో లేదా తదుపరి నెలలో ఏ స్కూలులో పనిచేయాల్సి ఉంటుందోననే గందరగోళానికి గురికావడం ఖాయమని చెప్పవచ్చు. వాస్తవానికి ఏడాదికో మారు విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌కు కటాఫ్‌ తేదీని ప్రామాణికంగా తీసుకుని, టీచర్‌:విద్యార్థుల సంఖ్య నిష్పత్తి ఆధారంగా ఆయా స్కూళ్ళు, సబ్జెక్టుల్లో మిగులు (సర్‌ప్లస్‌) టీచర్లను గుర్తించి, వారిని కొరతవున్న పాఠశాలలకు తాత్కాలికంగా డిప్యుటేషన్లపై సర్దుబాటు (వర్క్‌ అడ్జస్ట్‌మెంట్‌) చేసే విధానం ఇప్పటివరకు అమల్లోఉంది. తాజాగా జారీ అయిన మౌఖిక ఆదేశాల ప్రకారం ఇకనుంచి ఆయా పాఠశాలల్లో ప్రతీనెలా 30వ తేదీ నాటి విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌ను ప్రామాణికంగా తీసుకుని సర్‌ప్లస్‌ టీచర్లను గుర్తించి, ఆ వెంటనే వారిని కొరతవున్న పాఠశాలలకు సర్దుబాటు చేయడానికి కసరత్తు జరుగుతోంది. నెలవారీ సర్దుబాట్ల నిబంధనలకు విరుద్దం కావడంతో ఈ విషయమై లిఖితపూర్వకంగా ఎక్కడా ఉత్తర్వులు లేకుండా, ఎవరూ న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం లేకుండా ఉండేందుకు కేవలం మౌఖిక సమాచారంతోనే ముందస్తు జాగ్రత్తలు తీసుకున్న ట్టు ప్రచారం జరుగుతోంది.

‘అపార్‌’ డేటా లోటుపాట్లతో

టీచర్లకు ‘మిగులు’ భయం

ప్రస్తుతం అన్ని పాఠశాలల్లో విద్యార్థుల సమగ్ర డేటాను ‘అపార్‌’ పేరిట నమోదు చేస్తున్న విషయం తెలిసిందే. జిల్లాలో ఇటీవల వరకు దాదాపు 80 శాతం విద్యార్థుల ‘అపార్‌’ డేటా పూర్తయిందని కొద్దిరోజుల క్రితమే డీఈవో వెంకటలక్ష్మమ్మ ప్రకటించారు. కాగా మిగతా విద్యార్థుల డేటాను ‘అపార్‌’లో చేర్చడానికి పుట్టిన తేదీలు, ఆధార్‌లో సవరణలు, పేర్లలో సవరణలు తదితర సమస్యలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో సమగ్ర వివరాలు లేని విద్యార్థుల డేటాను అపార్‌లో నమోదు చేసేందుకు అవకాశం లేకపోవడంతో, అటువంటి విద్యార్థులను స్కూలు డ్రాప్‌బాక్స్‌లో కొందరు స్కూలు ప్రధానోపాధ్యాయులు వేస్తున్నారు. దీంతో సంబంధిత విద్యార్థుల పేర్లు స్కూలు యు–డైస్‌ డేటాలో కనబడవు. వాస్తవానికి డ్రాప్‌బాక్స్‌లో వేసిన విద్యార్థులు భౌతికంగా అదే స్కూలులో ఉన్నప్పటికీ, ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకునే యు–డైస్‌లో సంబంధిత విద్యార్థి పేరు లేకపోతే ఆ విద్యార్థి మరోచోటకు వెళ్ళిపోయినట్టుగానే పరిగణిస్తారని చెబుతున్నారు. ఇలా చాలా పాఠశాలల్లో ‘అపార్‌’ ప్రతిష్టంభనల వల్ల విద్యార్థులను స్కూలు డ్రాప్‌బాక్స్‌లో వేసినప్పటికీ, వారంతా భౌతికంగా అదే స్కూలులోనే ఉంటున్నారు. తాజాగా నెలవారీ వర్క్‌ అడ్జస్ట్‌మెంట్‌కు స్కూలు యు–డైస్‌ డేటానే విద్యాశాఖ ప్రామాణికంగా తీసుకుంటుండంతో కొత్తగా సర్‌ప్లస్‌ టీచర్ల ఆవిర్భానికి కారణమవుతోందని భావిస్తున్నారు. నెలవారీ వర్క్‌ అడ్జస్ట్‌మెంట్‌లో సర్‌ప్లస్‌గా గుర్తించిన టీచర్లను కొరతవున్న పాఠశాలలకు సర్దుబాటు చేసిన తర్వాత, మరుసటి నెలలో విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌ పెరిగితే ఆ టీచరును మళ్లీ వెనక్కిపంపించే అవకాశంలేదని తెలిసింది. ఇతర పాఠశాలల్లో మిగులు ఉపాధ్యాయుల నుంచి కొరతవున్న స్కూలుకు డిప్యుటేషన్‌లపై సర్దుబాటు చేస్తారు. అపార్‌ నమోదుకు ఈ నెలాఖరువరకు గడువు ఉంది. తర్వాత మరికొంతకాలం పొడిగించే అవకాశమూ లేకపోలేదు. అపార్‌కు ఆటంకంగా వున్న సమస్యలను పరిష్కరించలేని పరిస్థితుల్లో పలువురు విద్యార్థులను స్కూలు డ్రాప్‌బాక్స్‌లో వేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు చేపడుతున్న టీచర్ల వర్క్‌ అడ్జస్ట్‌మెంట్‌కు యు–డైస్‌ను ప్రామాణికంగా తీసుకుంటుండడం ఉపాధ్యాయులకు తీరని నష్టమేనని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

వర్క్‌ అడ్జస్ట్‌మెంట్‌పై అభ్యంతరాల అవకాశం ?

ఏడాదికోసారి మాత్రమే చేపట్టే మిగులు టీచర్ల వర్క్‌ అడ్జస్ట్‌మెంట్‌ను నెలవారీగా మార్చుతుండడంపై అభ్యంతరాలు వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది ఆగస్టులో జిల్లాలో చేపట్టిన వర్క్‌ అడ్జస్ట్‌మెంట్‌లో 805 మంది సర్‌ప్లస్‌ టీచర్లను గుర్తించగా, వీరిలో 511 మం దిని కొరతవున్న స్కూళ్ళకు సర్దుబా టు చేయగలిగారు. ఇక నెలవారీ వర్క్‌ అడ్జస్ట్‌మెం ట్‌కు ప్రభుత్వం వద్ద వున్న యు–డైస్‌ డేటాలో విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌ హెచ్చు తగ్గులను ప్రామాణికంగా ఏ నెలకా నెల తీసుకుని నేరుగా డైరెక్టరేట్‌ నుంచే సర్‌ప్లస్‌ టీచర్లను గుర్తించి కొరతవున్న పాఠశాలలకు డిప్యుటేషన్లు వేస్తూ సంబం ధిత జిల్లా డీఈవో పేరిట ఉత్తర్వులు జారీచేస్తారని తెలిసింది. ఇటీవల వరకు ఇటువంటి డిప్యుటేషన్లను స్థానికంగా వున్న కొరత, నెలవారీ రిటైర్మెంట్ల వేకెన్సీలను భర్తీ చేసేందుకు సంబంధిత మండలాల ఎంఈ వోలే వేసుకునేందుకు వెసులుబాటు ఉండగా ఇపుడు ఆ విధానాన్ని రద్దుచేసి నేరుగా డైరెక్టరే ట్‌నుంచే తాత్కాలిక నియామకాలు చేపట్టడా నికి రంగం సిద్ధం చేసినట్టు ప్రచారం జరుగు తోంది. ఈ నేపథ్యంలో గత గురువారం వెలువ డిన మౌఖిక ఆదేశాలు అమలు జరిగేలా నెల వారీ సర్దుబాట్లు ప్రక్రియలో సర్‌ప్లస్‌గా గుర్తిం చిన టీచర్లను త్వరలోనే డిప్యుటేషన్లు వేయ నున్నట్టు సమాచారం. దీనిపై అధికారికంగా లిఖితపూర్వక ఉత్తర్వులేవీ లేకపోవడం గమనార్హం.

Updated Date - Nov 19 , 2024 | 12:30 AM