Share News

Adani Group: క్షణాల్లోనే రూ. 2.3 లక్షల కోట్లు కోల్పోయిన అదానీ గ్రూప్.. కారణమిదే..

ABN , Publish Date - Nov 21 , 2024 | 01:37 PM

అదానీ గ్రూప్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అమెరికాలో లంచం, మోసం ఆరోపణలు రావడంతో భారత స్టాక్ మార్కెట్‌లో అదానీ గ్రూప్‌ షేర్లు భారీగా పడిపోయాయి. దీంతో క్షణాల్లోనే కంపెనీ లక్షల కోట్ల రూపాయలను నష్టపోయింది. ఆ పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

 Adani Group: క్షణాల్లోనే రూ. 2.3 లక్షల కోట్లు కోల్పోయిన అదానీ గ్రూప్.. కారణమిదే..
Adani Group lost Rs 2.6 lakh crore

ప్రముఖ భారత పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ గ్రూప్‌పై (adani Group) సంక్షోభ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అమెరికా న్యూయార్క్‌లో లంచం, మోసం ఆరోపణల ప్రభావం భారత స్టాక్ మార్కెట్‌పై చూపించింది. ఈ క్రమంలో అదానీ గ్రూప్ షేర్లు 20 శాతం వరకు క్షీణించాయి. గురువారం స్టాక్ మార్కెట్ ప్రారంభమైన వెంటనే అదానీ గ్రూప్ షేర్లు శోకసంద్రంలో మునిగిపోయాయి. గ్రూప్‌లోని మొత్తం 10 లిస్టెడ్ కంపెనీల షేర్లు భారీగా పడిపోయాయి. దీంతో అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ షేర్లు 20 శాతం క్షీణించి రూ.697.70కి పడిపోయి లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. దీనికి ముందు రోజు ఈ షేర్ ధర రూ. 871.55గా ఉంది. అంటే ఒక్కరోజే రూ. 174.30 దిగజారింది.


ఈ కంపెనీల షేర్లు కూడా..

అంతేకాదు అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లు కూడా 18% క్షీణించి రూ.1159కి చేరుకోగా, అదానీ టోటల్ గ్యాస్ షేర్లు 14% తగ్గి రూ.577కి చేరుకున్నాయి. ACC షేర్లు కూడా 10% పడిపోయాయి. అదానీ గ్రూప్ మాతృ సంస్థ అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు కూడా 10% పడిపోయి రూ.2539 స్థాయికి చేరుకున్నాయి. అదానీ పోర్ట్స్ షేర్లు 10% పడిపోయి రూ.1160కి చేరుకున్నాయి. అంబుజా సిమెంట్, అదానీ పవర్ షేర్లు వరుసగా 10%, 16% పడిపోయాయి. దీని విల్మార్ షేర్లు కూడా 8 శాతం తగ్గాయి.


ఎంత నష్టమంటే..

దీంతో అదానీ గ్రూప్ 10 కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ గురువారం రూ.11,91,557.79 కోట్లకు పడిపోయింది. ఇది మంగళవారం రూ.14,24,432.35 లక్షల కోట్లుగా ఉంది. అంటే ఇన్వెస్టర్లు కొన్ని నిమిషాల్లోనే దాదాపు రూ.2.60 లక్షల కోట్లు నష్టపోయారు. ఆకస్మాత్తుగా ఈ షేర్ల తగ్గుదల పెట్టుబడిదారులను ఆందోళనకు గురిచేసింది. దీంతో అదానీ గ్రూప్ కంపెనీల భవిష్యత్తుపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అదానీ గ్రూప్ ఈ సంక్షోభం నుంచి బయటపడగలదా లేదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.


విశ్లేషకులు ఏం అన్నారంటే

అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణల దర్యాప్తులో ఏదైనా నిర్దిష్టమైన వాస్తవాలు బయటపడితే, అది తీవ్ర పరిణామాలను కలిగిస్తుందని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది కాకుండా విదేశీ పెట్టుబడిదారుల విశ్వాసం కూడా దెబ్బతినవచ్చని అంటున్నారు. దీని కారణంగా ఈ కంపెనీల షేర్లు మరింత పడిపోయే అవకాశం ఉంది. ఈ సమయంలో అదానీ గ్రూప్ తన వ్యూహాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందని, తద్వారా పరిస్థితి మరింత దిగజారకుండా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.


పెట్టుబడిదారులు ఏం చేయాలి?

ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అదానీ గ్రూప్ షేర్లలో ఇన్వెస్ట్ చేసిన వారు తమ పొజిషన్‌ను సమీక్షించుకుని, అవసరమైతే తమ పెట్టుబడులను కాపాడుకునేందుకు చర్యలు తీసుకోవాలని అంటున్నారు. అయితే దీర్ఘకాలికంగా పెట్టుబడి చేయాల్సిన వారు పరిస్థితి గురించి పూర్తి సమాచారం ఉన్న తర్వాత మాత్రమే ఏదైనా నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ కంపెనీ షేర్లు ఇటీవల మంచి పనితీరును కనబరుస్తున్న సమయంలో ఇది పెట్టుబడిదారులకు పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు.


మిలియన్ డాలర్ల లంచం

భారత పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ అమెరికాలో మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలు బుధవారం రాత్రి వెలుగులోకి వచ్చాయి. అమెరికాలోని తన కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చేందుకు 250 మిలియన్ డాలర్లు లంచం ఇచ్చారని, ఆ విషయాన్ని దాచిపెట్టారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయనతోపాటు పలువురిపై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. దీని ప్రభావం గురువారం భారత స్టాక్ మార్కెట్‌పై కనిపించింది. మోసం ఆరోపణల కారణంగా అదానీ గ్రూప్‌లోని మొత్తం పది షేర్లు పడిపోయాయి.


ఇవి కూడా చదవండి:

Luxury Car Deal: రూ. 50 లక్షల విలువైన కారు కేవలం రూ. 7.5 లక్షలకే.. ఎలాగంటే..

Gautam Adani: ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు.. కారణమిదే..

Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..

Aadit Palicha: చదువు, జాబ్ వదిలేసి స్టార్టప్ పెట్టాడు.. ఇప్పుడు రూ.4300 కోట్ల సంపదకు..

Read More Business News and Latest Telugu News

Updated Date - Nov 21 , 2024 | 01:42 PM