Share News

Indian Railways: రూ.30 వేల కోట్ల టెండర్ల రద్దు.. రైల్వే శాఖ సంచలన నిర్ణయం

ABN , Publish Date - Aug 14 , 2024 | 03:20 PM

వందేభారత్ రైళ్లను తయారు చేసేందుకు నిర్ణయించిన రూ.30 వేల కాంట్రాక్ట్‌ను రద్దు చేస్తూ భారతీయ రైల్వే సంచలన నిర్ణయం తీసుకుంది. సెమీ-హై-స్పీడ్ రైల్వే సర్వీస్ అయిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్(Vande Bharath Express) తయారీ, నిర్వహణ కోసం ఈ టెండర్‌ను పిలిచారు.

Indian Railways: రూ.30 వేల కోట్ల టెండర్ల రద్దు.. రైల్వే శాఖ సంచలన నిర్ణయం

ఇంటర్నెట్ డెస్క్: వందేభారత్ రైళ్లను తయారు చేసేందుకు నిర్ణయించిన రూ.30 వేల కాంట్రాక్ట్‌ను రద్దు చేస్తూ భారతీయ రైల్వే సంచలన నిర్ణయం తీసుకుంది. సెమీ-హై-స్పీడ్ రైల్వే సర్వీస్ అయిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్(Vande Bharath Express) తయారీ, నిర్వహణ కోసం ఈ టెండర్‌ను పిలిచారు. ఇందుకోసం అల్‌స్టోమ్ ఇండియా 100 వందే భారత్ రైళ్ల టెండర్‌ను చేజిక్కించుకునేందుకు ముందుకు వచ్చింది. అయితే ఆ కాంట్రాక్ట్‌ని రద్దు చేసినట్టు ఆల్‌స్టోమ్ ఇండియా కూడా ధృవీకరించింది. భారతీయ రైల్వే ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ.. భవిష్యత్తులో ఎలాంటి అవసరం ఉన్నా తమని సంప్రదించవచ్చని తెలిపింది. వందే భారత్ రైళ్ల కోసం 2023 మే 30వ తేదీన తెరిచిన టెండర్లలో ఆల్‌స్టోమ్ కంపెనీ అత్యల్ప బిడ్డర్‌గా నిలిచింది.


కారణమిదే..

రైల్వే శాఖ టెండర్ కమిటీ, అల్‌స్టోమ్ ఇండియా ఒక్కో రైలు తయారీ రేటుపై ఒప్పందంలో ఏకాభిప్రాయం కుదరలేదు. ఆల్‌స్టోమ్ ఇండియా ఒక్కో రైలుకు రూ.150.9 కోట్ల బిడ్డింగ్ ధర వేయగా.. ఆ మొత్తం ఎక్కువగా ఉందని భారతీయ రైల్వే గుర్తించింది. అందుకే బిడ్డింగ్ రేటును రూ.140 కోట్లకు తగ్గించాలని ఆల్‌స్టోమ్ ఇండియాను అధికారులు కోరారు. కానీ.. ఆల్‌స్టోమ్ ఇండియా రూ.140 కోట్లకు తగ్గడానికి నిరాకరించింది. చివరగా రూ.145 కోట్ల చొప్పున ఒప్పందం కుదుర్చుకోవాలని కంపెనీ భావించింది. రూ. 30 వేల కోట్ల టెండర్‌కు బిడ్లు వేయడానికి వచ్చిన కంపెనీల్లో ఆల్‌స్టోమ్ ఇండియా బిడ్ అత్యల్పం కావడం గమనార్హం.


మొత్తం 100 రైళ్ల తయారీకి ఈ టెండర్ జరిగింది. ఇతర బిడ్డర్ స్టాడ్లర్ రైల్, హైదరాబాద్‌కు చెందిన మేధా సర్వో డ్రైవ్‌లతో కూడిన కన్సార్టియం ఒక్కో రైలు సెట్‌కు రూ.170 కోట్ల అత్యధిక బిడ్ వేశాయి. గతంలో 120 రైళ్లకు చేసుకున్న కాంట్రాక్ట్‌లో 200 వందే భారత్ రైళ్లకుగాను ఒక్కో ట్రైన్‌కు రూ.120 కోట్లకే బిడ్లు పూర్తయ్యాయి. అయితే కంపెనీలు తాజాగా బిడ్ ధరలు ఎక్కువగా కోట్ చేస్తుండటంతో రైల్వే శాఖ మరికొన్ని కంపెనీలకు ఆహ్వానం పలకనుంది. ఎక్కువ కంపెనీలను ఆకర్షించేలా చర్యలు తీసుకుంటామని రైల్వే శాఖ తెలిపింది. కాగా.. రైలు సెట్‌లను డెలివరీ చేసిన తర్వాత వాటిని తయారు చేసిన కంపెనీకి భారతీయ రైల్వే శాఖ తొలి విడతగా రూ. 13 వేల కోట్లు చెల్లిస్తుంది. మిగిలిన రూ.17 వేల కోట్లు కంపెనీకి 35 ఏళ్లపాటు నిర్వహణ కోసం చెల్లించాలి.


వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు అంటే...

దేశంలో మొట్టమొదటి స్వదేశీ సెమీ హైస్పీడ్ రైలే ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌. దీన్ని ద్వారా 'మేక్ ఇన్ ఇండియా' ఆలోచన బలోపేతం అవుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. 'మేక్ ఇన్ ఇండియా' విజయ గాథకు అద్భుతమైన ఉదాహరణగా.. భారతీయ రైల్వేలు 2019లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించాయి. మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును న్యూఢిల్లీ-కాన్పూర్-అలహాబాద్-వారణాసి మార్గంలో ఫిబ్రవరి 15, 2019న నడిపారు.

Updated Date - Aug 14 , 2024 | 03:20 PM