Share News

Zomato: డెలివరీ బాయ్‌తో చిల్లర తిప్పలు తప్పినట్లే.. కొత్త ఫీచర్‌తో జొమాటో

ABN , Publish Date - Aug 07 , 2024 | 09:07 PM

ఫుడ్ డెలివరీ క్రమంలో క్యాష్ ఆన్ డెలివరీ అనే బటన్ క్లిక్ చేసిన వారికి ప్రధానంగా ఎదురవుతున్న సమస్య చిల్లర. ఫుడ్ బిల్లు రౌండ్ ఫిగర్‌గా ఉండకపోవడం, డెలివరీ బాయ్ దగ్గర సరిపడినంత చిల్లర లేకపోవడంతో కస్టమర్లు అసహనానికి గురవుతున్నారు.

Zomato: డెలివరీ బాయ్‌తో చిల్లర తిప్పలు తప్పినట్లే.. కొత్త ఫీచర్‌తో జొమాటో

ఇంటర్నెట్ డెస్క్: ఫుడ్ డెలివరీ క్రమంలో క్యాష్ ఆన్ డెలివరీ అనే బటన్ క్లిక్ చేసిన వారికి ప్రధానంగా ఎదురవుతున్న సమస్య చిల్లర. ఫుడ్ బిల్లు రౌండ్ ఫిగర్‌గా ఉండకపోవడం, డెలివరీ బాయ్ దగ్గర సరిపడినంత చిల్లర లేకపోవడంతో కస్టమర్లు అసహనానికి గురవుతున్నారు. ఈ సమస్యకు జొమాటో పరిష్కారం చూపింది. జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ తాజాగా ఈ ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇందుకు సంబంధించి బుధవారం ఆయన ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. ‘‘ క్యాష్‌ ఆన్‌ డెలివరీ ఆర్డర్‌లు చేసే కస్టమర్లు చిల్లర విషయంలో చాలా సార్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇకపై ఆ సమస్య ఉండదు. ఫుడ్ ఆర్డర్‌ తీసుకొనే సమయంలో ఎక్కువ డబ్బులు చెల్లిస్తే మిగిలిన మొత్తాన్ని జొమాటో మనీ అకౌంట్లో యాడ్‌ చేయమని డెలివరీ బాయ్‌లను కోరవచ్చు. అలా చిల్లర సమస్యకు చెక్ పడుతుంది" అని ఆయన అన్నారు.


బిగ్ బాస్కెట్ నుంచి స్ఫూర్తి పొందాం..

తాజా అప్‌డేట్ విషయంలో టాటా గ్రూప్‌ యాజమాన్యంలోని బిగ్‌బాస్కెట్‌ నుంచి తాము స్ఫూర్తిపొందినట్లు దీపిందర్ తెలిపారు. ఈ సందర్భంగా బిగ్‌బాస్కెట్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇకపై జొమాటోలో క్యాష్‌ ఆన్‌ డెలివరీ ఆర్డర్‌ పెట్టాలంటే చిల్లర కోసం హైరానా కావాల్సిన అవసరం లేదని ఆయన వివరించారు. ఇన్‌స్టంట్ క్రెడిట్ ఫీచర్‌పై వినియోగదారులు హర్షం వ్యక్తం చేశారు. ఇది చాలా మంచి ఫీచర్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. సదరు పోస్ట్‌ని రీపోస్ట్ చేస్తున్నారు. కాగా జొమాటో తమ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్లాట్‌ఫాంలో ఇప్పటికే అనేక సేవల్ని అందుబాటులోకి తీసుకువచ్చింది.


మరో రికార్డ్..

జొమాటో.. 15 ఏళ్ల క్రితం మొదలైన ఓ కంపెనీ ఇప్పుడు వేల కోట్ల టర్నోవర్ దిశగా కొనసాగుతోంది. ఈ సంస్థ ఇటీవలే మొదటి త్రైమాసికం ఫలితాలను ప్రకటించింది. ఈ క్రమంలో కంపెనీ లాభాలు అద్భుతమైన వృద్ధిని కనబరుస్తున్నాయి. ఎందుకంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ 2024 త్రైమాసికంలో కంపెనీ కన్సాలిడేటెడ్ లాభం రూ.2 కోట్ల నుంచి రూ.253 కోట్లకు (YoY) చేరుకోవడం విశేషం.

దీంతో ఈ సంస్థ ఆదాయం రూ.2416 కోట్ల నుంచి రూ.4,206 కోట్లకు (YoY) పెరిగింది. మరోవైపు కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ దీపిందర్ గోయల్ ఇటివల బిలియనీర్ క్లబ్‌లో చేరారు. జోమాటో షేర్లలో పెరుగుదల నేపథ్యంలో ఈ ఘనతను సాధించారు. జొమాటో షేర్‌హోల్డింగ్ ప్రకారం CEO దీపిందర్ గోయల్ కంపెనీలో 36,94,71,500 షేర్లను కలిగి ఉన్నారు. ఇది కంపెనీలో 4.26 శాతం వాటాకు సమానం. జొమాటో 2008లో FoodieBayగా బైన్ & కంపెనీలో పనిచేసిన దీపిందర్ గోయల్, పంకజ్ చద్దాచే స్థాపించబడింది. ఈ వెబ్‌సైట్ రెస్టారెంట్ లిస్టింగ్ అండ్ రికమండేషన్ పోర్టల్‌గా ప్రారంభమైంది. ఆ తర్వాత ఈ కంపెనీకి Zomatoగా పేరు పెట్టారు. 2011లో Zomato అధికారికంగా ఆన్‌లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించింది.

Updated Date - Aug 07 , 2024 | 09:07 PM