Share News

Viral: అశ్లీల వీడియోలు సర్క్యులేట్ చేస్తున్నారంటూ.. మహిళా డాక్టర్‌కు రూ.59 లక్షల కుచ్చుటోపీ

ABN , Publish Date - Jul 25 , 2024 | 05:26 PM

అధునాతన సాంకేతికత అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఆన్‌లైన్ మోసాలు పెచ్చుమీరిపోయాయి. సైబర్ నేరగాళ్లు రకరకాల మార్గాల ద్వారా జనాలను బురిడీ కొట్టిస్తూ.. లక్షల్లో డబ్బులు కాజేస్తున్నారు. ఓసారి ఆఫర్లతో..

Viral: అశ్లీల వీడియోలు సర్క్యులేట్ చేస్తున్నారంటూ.. మహిళా డాక్టర్‌కు రూ.59 లక్షల కుచ్చుటోపీ
Digital Arrest Scam

అధునాతన సాంకేతికత అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఆన్‌లైన్ మోసాలు (Online Scams) పెచ్చుమీరిపోయాయి. సైబర్ నేరగాళ్లు రకరకాల మార్గాల ద్వారా జనాలను బురిడీ కొట్టిస్తూ.. లక్షల్లో డబ్బులు కాజేస్తున్నారు. ఓసారి ఆఫర్లతో, మరోసారి బెదిరింపులతో జనాలను లొంగదీసుకొని.. భారీ మొత్తం దోచేస్తున్నారు. తాజాగా ఓ మహిళ డాక్టర్ ‘డిజిటల్ అరెస్ట్ స్కామ్’ (Digital Arrest Scam) బారిన పడి.. ఏకంగా రూ.59 లక్షలు పోగొట్టుకుంది. అశ్లీల వీడియోలు సర్క్యులేట్ చేస్తున్నారని ఆమెను భయపెట్టించి మరీ.. అంత మొత్తాన్ని దోపిడీ చేశారు. ఈ ఘటన నోయిడాలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..


అశ్లీల వీడియోలు సర్క్యులేట్ చేస్తున్నారంటూ..

ఆ వైద్యురాలి పేరు పూజా గోయల్. ఆమె నోయిడా సెక్టార్ 77లో నివాసం ఉంటున్నారు. జులై 13వ తేదీన పూజాకు ఒక ఫోన్‌కాల్ వచ్చింది. కాల్ చేసిన వ్యక్తి తనని తాను ‘టెలిఫోన్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా’ అధికారిగా పరిచయం చేసుకున్నాడు. ‘మీ ఫోన్ అశ్లీల వీడియోలను సర్క్యులేట్ చేసేందుకు వినియోగించబడింది’ అని అతను తెలిపాడు. దీన్ని ఆ డాక్టరమ్మ ఖండించింది. తాను ఎలాంటి వీడియోలను సర్క్యులేట్ చేయలేదని చెప్పింది. అయితే.. అవతలి వ్యక్తి ఎలాగోలా ఆమెను వీడియో కాల్‌లో చేరమని ఒప్పించాడు. అప్పుడతను మరింత బెదిరింపులకు దిగాడు. అశ్లీల వీడియోలు సర్క్యులేట్ చేసినట్లు తమ వద్ద సాక్ష్యాలు ఉన్నాయని, అందుకు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించాడు. ప్రస్తుతం మీరు డిజిటల్ అరెస్ట్‌లో ఉన్నారని చెప్పాడు.

దీంతో ఆ వైద్యురాలు తీవ్రంగా భయపడిపోయింది. ఇంకేముంది.. తాను వేసిన గాలంలో చేప చిక్కుకుందని స్కామర్ గుర్తించాడు. ఈ కేసు నుంచి బయటపడాలంటే.. తాను చెప్పినట్లు చేయాలని పేర్కొన్నాడు. అందుకు ఆమె అంగీకరించింది. తాను అడిగినంత డబ్బులిస్తే.. ఈ కేసు అనేదే లేకుండా చేస్తానని నమ్మబలికాడు. దాంతో.. అతడు చెప్పినట్లుగానే ఆమె రూ.59.54 లక్షలను ఓ బ్యాంకు ఖాతాకు పంపించింది. తనకు డబ్బులు అందిన తర్వాత ఆ దుండగుడు మాయమైపోయాడు. చివరకు జులై 22వ తేదీన తాను మోసపోయానని ఆ వైద్యురాలు గ్రహించింది. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీనిపై సైబర్ క్రైమ్ అధికారి వివేక్ రంజన్ రాయ్ మాట్లాడుతూ.. దుండగుడి బ్యాంకు ఖాతా వివరాలు తమకు లభ్యమయ్యాయని, త్వరలోనే చర్యలు తీసుకుంటామని చెప్పారు.


డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి?

ప్రజలను భయపెట్టించి, వారిని మోసగించేందుకు గాను సైబర్ నేరగాళ్లు ఈ డిజిటల్ అరెస్ట్ విధానాన్ని తెరమీదకు తీసుకొచ్చారు. ఈమధ్య కాలంలో ఉత్తర భారతంలో ఇటువంటి నేరాలు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. తొలుత దుండగులు ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకొని.. ఫేక్ ఐడీలతో తాము ప్రభుత్వ అధికారులమని నమ్మించి.. డబ్బులు దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. కొన్ని రోజుల క్రితమే 73 ఏళ్ల వృద్ధురాలిని టార్గెట్ చేసి.. ఆమె వద్ద నుంచి రూ.83 లక్షల వరకు దోచేశారు. కొన్ని నెలల్లోనే ఇలాంటివి 10 సంఘటనలు నమోదు కావడంతో.. జనాలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Read Latest Crime News and Telugu News

Updated Date - Jul 25 , 2024 | 05:34 PM