Share News

Varanasi: ఇక్కడ ఈశ్వరుడికి మందులే నైవేద్యం.. ఎందుకంటే

ABN , Publish Date - Jul 27 , 2024 | 09:27 AM

వారణాసిలోని ప్రతి అణువులోనూ పరమశివుడు ఉంటాడని చెబుతుంటారు. అక్కడ అనేక శివాలయాలు ఉన్నాయి. వీటన్నింటి నడుమ ఓ శివాలయం ప్రత్యేకంగా నిలుస్తోంది. చారిత్రక నేపథ్యం కలిగి ఉన్న ఈ ఆలయాన్ని విరాళాలతో నిర్మించారు.

Varanasi: ఇక్కడ ఈశ్వరుడికి మందులే నైవేద్యం.. ఎందుకంటే

వారణాసి: వారణాసిలోని ప్రతి అణువులోనూ పరమశివుడు ఉంటాడని చెబుతుంటారు. అక్కడ అనేక శివాలయాలు ఉన్నాయి. వీటన్నింటి నడుమ ఓ శివాలయం ప్రత్యేకంగా నిలుస్తోంది. చారిత్రక నేపథ్యం కలిగి ఉన్న ఈ ఆలయాన్ని విరాళాలతో నిర్మించారు. మరి ఇక్కడ అంత ప్రత్యేకత ఏముందనుకుంటున్నారా.

ఇక్కడ శివలింగానికి మందులే(మెడిసిన్స్) నైవేద్యంగా సమర్పిస్తారు. వారణాసిలో ఉన్న రాసేశ్వర్‌ మహాదేవ్‌ ఆలయంలో ఆయుర్వేద సిబ్బంది శివుడికి నైవేద్యంగా ఔషధాలను సమర్పిస్తున్నారు. ఈ ఆలయం బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయంలో ఉంది. వర్సిటీకి చెందిన ఆయుర్వేద అధ్యాపక బృందం రోగాల నివారణ కోసం ఔషధాలను తయారుచేస్తుంది. ఔషధాల తయారీ తర్వాత వాటిని శివుడికి నైవేద్యంగా సమర్పిస్తుంటారు. ఈ సంప్రదాయాన్ని కొన్నేళ్ల నుంచి పాటిస్తున్నారు.


‘‘మేం ఏ మందు తయారుచేసినా ముందుగా శివుడికి సమర్పిస్తాం. రోగాలను తొలగించే దేవుడు రాసేశ్వర్‌ మహాదేవ్‌ అని నమ్ముతాం. కరోనా సమయంలోనూ వైద్యులు తయారుచేసిన కషాయాలను దేవుడికి తొలుత సమర్పించాం. ఇప్పటికీ ఈ నమ్మకాన్ని కొనసాగిస్తున్నాం’’ అని వర్సిటీ కెమిస్ట్రీ విభాగం ప్రొఫెసర్‌ ఆనంద్‌ చౌదరీ తెలిపారు.

క్యాంపస్ ప్రత్యేకతలివే..

ఈ క్యాంపస్ విద్యార్థులకు.. ఒక ఓపెన్ లైబ్రరీ లాంటిది. ఇక్కడ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు నిరంతరం విద్యనభ్యసిస్తూనే ఉంటారు. ప్రశాంతమైన వాతావరణం ప్రిపరేషన్‌కి ఎంతో ఉపయోగపడుతోంది. పోటీ పరీక్షల్లో రానించి అనేక ఉద్యోగాల్లో స్థిరపడిన వారు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు.


నైవేద్యంగా భస్మం, కషాయాలు..

విశ్వేశ్వర స్వామికి మందులు సమర్పించేందుకు వచ్చిన పరిశోధకురాలు వైశాలి గుప్తా మాట్లాడుతూ.. "కొత్త క్రీమ్‌పై పరిశోధన చేస్తున్నాం. దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి వచ్చాం. మా పరిశోధనల్లో ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని స్వామి వారిని కోరుకుంటాం. వీటితోపాటు వివిధ రకాల భస్మం, పొడులు, కషాయాలు, ఇతర ఔషధాలను స్వామివారికి సమర్పిస్తాం" అని తెలిపారు.

Updated Date - Jul 27 , 2024 | 09:27 AM