Share News

డెబ్బయ్‌ అడుగుల దివ్యమూర్తి.. సప్తముఖ మహాశక్తి గణపతి

ABN , Publish Date - Sep 07 , 2024 | 11:25 AM

దేశవిదేశాల్లో ఖ్యాతి గడించిన ఖైరతాబాద్‌ గణపతి ఈ ఏడాది సప్తముఖ మహాశక్తి గణపతిగా దర్శనం ఇవ్వనున్నాడు. ఖైరతాబాద్‌లో గణేశ్‌ ఉత్సవాలు ప్రారంభించి ఏడు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది 70 అడుగుల మూర్తిని శిల్పులు సిద్ధం చేశారు. సప్త ముఖాల్లో ఓవైపు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మరోవైపు సరస్వతి, లక్ష్మి, పార్వతుల మధ్య గణపతి ఉండేలా విగ్రహాన్ని సిద్ధం చేశారు.

డెబ్బయ్‌  అడుగుల దివ్యమూర్తి.. సప్తముఖ మహాశక్తి గణపతి

దేశవిదేశాల్లో ఖ్యాతి గడించిన ఖైరతాబాద్‌ గణపతి ఈ ఏడాది సప్తముఖ మహాశక్తి గణపతిగా దర్శనం ఇవ్వనున్నాడు. ఖైరతాబాద్‌లో గణేశ్‌ ఉత్సవాలు ప్రారంభించి ఏడు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది 70 అడుగుల మూర్తిని శిల్పులు సిద్ధం చేశారు. సప్త ముఖాల్లో ఓవైపు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మరోవైపు సరస్వతి, లక్ష్మి, పార్వతుల మధ్య గణపతి ఉండేలా విగ్రహాన్ని సిద్ధం చేశారు. కోరిన వరాలు ఇచ్చే మహిమాన్విత ఖైరతాబాద్‌ గణపతి ఉత్సవ విశేషాలు.

ప్రపంచ ఖ్యాతిని ఆర్జించిన ఖైరతాబాద్‌ గణేశుడు నేటి నుంచి సప్తముఖ మహాశక్తి గణపతిగా దర్శనం ఇవ్వనున్నాడు. ఖైరతాబాద్‌ గణపతి ఉత్సవాలను 1954లో ప్రారంభించారు. 70 సంవత్సరాల వేడుకల్లో భాగంగా ఈసారి వినాయకుడిని 70 అడుగుల ఎత్తులో రూపొందించినట్లు ఉత్సవ నిర్వాహకులు తెలిపారు. వినాయకచవితి రోజు నుంచి 11 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో సుమారు 25 లక్షల మంది భక్తులు గణపతిని దర్శించుకునేందుకు వీలుగా భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.


లోక కల్యాణమే పరమావధి

ఖైరతాబాద్‌ గణపతి ఉత్సవాల్లో స్వామిని ఏ రూపంలో తయారు చేయాలనే అంశంపై ఏటా ఉత్సవ కమిటీ నిర్వాహకులతో పాటు శిల్పి రాజేంద్రన్‌లు దివ్యజ్ఞాన సిద్ధాంతి విఠలశర్మను కలుస్తారు. ఆయన సూచించిన మేరకు సప్త మాత్రుకలైన బ్రాహ్మణి, చాముండి, మహేశ్వరి, కౌమారి, వారాహి, ఇంద్రాణి, వైష్ణవిల ఆవిర్భావానికి మూలకారకుడైన గణపతిని ఈసారి సప్తమాత్రుకల శక్తిగా పూజిస్తే సర్వజనులకు హితం కలగడమే కాకుండా పాలకులకు మంచి బలం చేకూరుతుందని దివ్యజ్ఞాన సిద్ధాంతి సూచించారు. ఈ సారి వినాయకచవితి సెప్టెంబరు 7న, అదీ వారంలో ఏడవ రోజైన శనివారం రావడం వల్ల సప్త ముఖాలు, ఏడు పడగల ఆదిశేషువు నీడన మహాశక్తి గణపతిని సిద్ధం చేయాలని సంకల్పించారు. సప్త ముఖాల్లో ఓవైపు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మరోవైపు సరస్వతీ, లక్ష్మి, పార్వతుల తలలు మధ్యన గణపతి ఉండేలా విగ్రహాన్ని సిద్ధం చేయాలని నిర్ణయించారు.


spe7.2.jpg

ఈ గణపతిని రాహు, కేతువులతో పాటు దర్శిస్తే సమస్త దోషాలు, అరిష్టాలు తొలగి బలం చేకూరుతుందని విఠలశర్మ సూచించగా, రాహు కేతువుల విగ్రహాలను 12 అడుగుల ఎత్తుతో సిద్ధం చేశారు. దీంతో పాటు ఉత్సవకమిటీ సూచన మేరకు అయోధ్య బాల రాముడి నల్లటి విగ్రహాన్ని కూడా పూజలకు సిద్ధం చేశారు. గణపతితో పాటు ఇరువైపులా ఆనవాయితీ ప్రకారం పూజించే విగ్రహాలు సైతం ఆకర్షణీయంగా ముస్తాబయ్యాయి. లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ కుడి వైపున శ్రీనివాస కళ్యాణం, ఎడమ వైపున శివపార్వతుల కళ్యాణ ఘట్టాలను అందంగా తీర్చిదిద్దారు. మహా గణపతి 14 చేతులతో అందులో కుడివైపున చక్రం, అంకుశం, గ్రంఽథం, శూలం, కమలం, శంఖం, ఆశీర్వాదముద్రలతో, ఎడమవైపున రుద్రాక్ష, పాశం, పుస్తకం, వీణ, కమలం, గద, లడ్డులతో భక్తులకు దర్శనమిస్తున్నాడు. మొత్తం మీద ఈసారి గణపతి 70 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పు, 40 టన్నుల బరువుతో సిద్ధమయ్యాడు. నిమజ్జనానికి తరలించడంలో ఏమాత్రం ఇబ్బందులు లేకుండా పర్యావరణ హితంగా మట్టి గణపతిగా విగ్రహాన్ని తయారు చేశామన్నారు ప్రధాన శిల్పి చినస్వామి రాజేంద్రన్‌.


65 రోజుల్లోనే విగ్రహం సిద్ధం

ఏటా ఖైరతాబాద్‌ గణపతిని దాదాపు 100 రోజుల పాటు శ్రమించి వినాయకచవితి నాటికి సిద్ధం చేసేవారు. అనివార్య కారణాల వల్ల ఈసారి విగ్రహ తయారీ పనులు కొంత ఆలస్యంగా ప్రారంభ మయ్యాయి. అయినా కేవలం 65 రోజుల్లోనే భారీ గణపతిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు శిల్పులు. లక్షలాది మంది భక్తులను ఆకట్టుకునే విధంగా స్వామిని ముస్తాబు చేయడం వెనక ఎంతో మంది కళాకారుల నైపుణ్యం, కఠోర శ్రమ దాగుంది. షెడ్డు వేసే పనులను ఆదిలాబాద్‌కు చెందిన నర్సయ్యతో పాటు 25 మంది నిపుణులు నిర్వహించారు. ఎంతటి బలమైన గాలులు, భయం కరమైన తుఫాను వచ్చినా షెడ్డు కదలకుండా 70 అడుగులకు పైగా ఎత్తుతో ధృఢంగా తయారు చేశారు. మచిలీపట్నంకు చెందిన నాగబాబుతో పాటు 23 మంది నిపుణులు రాత్రింబవళ్లు వెల్డింగ్‌ పనులు చేశారు.


చెన్నైకు చెందిన మూర్తితో పాటు 25 మంది గణపతి ఔట్‌లైన్‌ పనులను, ఒరిస్సాకు చెందిన జోగారావుతో పాటు 20 మంది కళాకారులు రాహు, కేతువు, బాలరాముడు, శివ కళ్యాణం, శ్రీనివాస కళ్యాణం ఘట్టాలతో పాటు వినాయకుడి ఫినిషింగ్‌ పనులను చేపట్టారు. మహారాష్ట్ర, బీహార్‌లకు చెందిన సుభాష్‌, గోపాల్‌ల 25 మంది బృందం స్మూత్‌ ఫినిషింగ్‌ను చేయగా, కాకినాడకు చెందిన భీమేష్‌తో పాటు 30 మంది నిపుణులు గణపతికి సహజ రంగులతో ముస్తాబు చేశారు. గణపతి విగ్రహం తయారీ కోసం 30 టన్నుల స్టీలు, గుజరాత్‌ గాంధీనగర్‌ నుండి 35 కిలోల బరువున్న ప్రత్యేక మట్టి 1000 బ్యాగులు, 50 కిలోల బరువున్న 100 బండిళ్ల వరి గడ్డి, 10 కిలోల బరువున్న వరి పొట్టు 60 బస్తాలు, 10 ట్రాలీల సన్నటి ఇసుక, 2వేల మీటర్ల గోనె బట్ట, 80 కిలోల సుతిలీ తాడు, 5వేల మీటర్ల చికెన్‌ మెష్‌, 2500 మీటర్ల కోరా బట్ట, ఒక టన్ను సుతిలీ పౌడర్‌ వినియోగించినట్లు ఉత్సవ కమిటీ కన్వీనర్‌ సందీప్‌రాజ్‌, కార్యదర్శి రాజ్‌కుమార్‌లు తెలిపారు.

- ఎనగంటి లక్ష్మణ్‌ యాదవ్‌

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, ఖైరతాబాద్‌

ఫొటోలు: అశోకుడు యాదవ్‌

Updated Date - Sep 07 , 2024 | 11:25 AM