Share News

RK Kothapaluku : న్యాయవ్యవస్థ.. అంతేనా?

ABN , Publish Date - Aug 11 , 2024 | 01:04 AM

‘ఢిల్లీ మద్యం కేసులో విచారణ పూర్తి చేయకుండా నిందితులను ఇంకెంత కాలం జైలులో ఉంచుతారు?’ ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియాకు బెయిలు మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు చేసిన...

RK Kothapaluku  : న్యాయవ్యవస్థ.. అంతేనా?

‘ఢిల్లీ మద్యం కేసులో విచారణ పూర్తి చేయకుండా నిందితులను ఇంకెంత కాలం జైలులో ఉంచుతారు?’ ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియాకు బెయిలు మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇవి. ‘ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిపై దాఖలైన అవినీతి కేసుల విచారణలో ఇంత జాప్యం ఎందుకు? విచారణకు, డిశ్చార్జ్‌ పిటిషన్లకు సంబంధంలేదని సుప్రీంకోర్టు గతంలోనే తీర్పు ఇచ్చినా అదే సాకు చెప్పటం ఏమిటి?’ తాజాగా సుప్రీంకోర్టు వ్యక్తం చేసిన అసహనం ఇది. ఈ రెండు సందర్భాలలోనూ దర్యాప్తు సంస్థలనే సుప్రీంకోర్టు తప్పు పట్టింది. ఢిల్లీ మద్యం కేసులో వంద కోట్లు చేతులు మారాయన్నది దర్యాప్తు సంస్థల ఆరోపణ. జగన్‌రెడ్డి కేసులలో 35 వేల కోట్ల ప్రజాధనం లూటీ జరిగిందని ఇవే దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి. మద్యం కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా 17 నెలల పాటు జైల్లో ఉండగా, 35 వేల కోట్ల రూపాయల అవినీతి కేసులో జగన్‌రెడ్డి 16 నెలలు మాత్రమే జైల్లో ఉండి బెయిల్‌ పొందారు. పుష్కర కాలంగా బెయిల్‌పై ఉన్న జగన్‌రెడ్డి ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కూడా కొనసాగారు. మద్యం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ఇంకా జైల్లోనే ఉన్నారు. ఈ వైరుధ్యాలకు కారణం ఎవరు? సిసోడియా, జగన్‌రెడ్డి కేసులలో సుప్రీంకోర్టుకు కనిపించిన అభ్యంతరం కింది కోర్టులకు ఎందుకు కనిపించలేదు? న్యాయం కోసం సుప్రీంకోర్టు వరకు ఈ దేశంలో ఎంత మంది వెళ్లగలరు? వెళ్లినా న్యాయం దక్కుతుందన్న గ్యారంటీ ఉంటుందా? అదీ లేదు. మన దేశంలో అన్ని వ్యవస్థలూ కుప్పకూలి పోయాయన్నది మెజారిటీ ప్రజల భావన. ఇతర వ్యవస్థల్లో న్యాయం దక్కనప్పుడు ఎవరైనా న్యాయ వ్యవస్థ తలుపు తడతారు. అక్కడ కూడా వెంటనే న్యాయం దక్కుతుందన్న భరోసాగానీ, అసలు న్యాయం లభిస్తుందన్న గ్యారంటీ కూడా లేకుండా పోయింది. మిగతా వ్యవస్థలతో పోల్చితే న్యాయ వ్యవస్థ కొంచం మెరుగ్గా ఉన్నప్పటికీ... ఆ వ్యవస్థపై కూడా ప్రజలకు నమ్మకం పోతోంది. వివిధ సందర్భాలలో సుప్రీంకోర్టు చేసే వ్యాఖ్యలకూ, అది ఇచ్చే ఆదేశాలకూ పొంతన ఉండటం లేదు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కేసులో ముందస్తు బెయిల్‌ మంజూరు చేసిన హైకోర్టును తప్పుపట్టిన సుప్రీంకోర్టు... హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ను మాత్రం రద్దు చేయలేదు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలో నెలకొన్న పరిస్థితులను గమనిస్తే పాలక పక్షాలపై ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. ఎన్నికల్లో గెలిచామని చెప్పి విర్రవీగుతూ ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుండా నిర్ణయాలు తీసుకుంటూ ఉండటం వల్ల ఈ పరిస్థితి ఉత్పన్నం అవుతోంది. బంగ్లాదేశ్‌ పరిణామాలనే తీసుకుందాం.

ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన షేక్‌ హసీనా ఏడు నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. పాకిస్థాన్‌ నుంచి బంగ్లాదేశ్‌ విడిపోయి స్వతంత్ర దేశంగా ఆవిర్భవించడానికి ఆమె తండ్రి ముజిబుర్‌ రెహమాన్‌ కారణం. బంగ్లా ప్రజలు ఆయనను జాతిపితగా గౌరవించి నెత్తిన పెట్టుకున్నారు. అదే ప్రజలు ఇప్పుడు ఆయన విగ్రహాలను పగలగొడుతున్నారు. ఆయన కూతురు హసీనా దేశం విడిచి పారిపోవలసి వచ్చింది. రిజర్వేషన్ల విషయంలో హసీనా నిర్ణయాన్ని పాక్షికంగా సమర్థించిన బంగ్లా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నివాస భవనంపై కూడా ప్రజలు దాడి చేశారు. పాలకులు మాత్రమే కాదు– న్యాయ వ్యవస్థ కూడా ప్రజాభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే తీర్పులు ఇవ్వాలని బంగ్లా పరిణామాలు చెబుతున్నాయా? అలా అని గుంపుస్వామ్యానికి తల ఒగ్గితే రాజ్యాంగంలోని నిబంధనల విషయమేమిటి అన్న ప్రశ్న వస్తుంది. ఇలాంటి సంక్లిష్ట సమస్య ఎదురవకూడదంటే ప్రభుత్వాలు మాత్రమే కాదు– వ్యవస్థలు కూడా ప్రజల్లో తమపై నమ్మకం పోకుండా వ్యవహరించాలి. లేనిపక్షంలో ఏదో ఒకరోజు ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుంది.


దారి తప్పిన దర్యాప్తులు...

మన దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీలపై ప్రజలు నమ్మకం కోల్పోయారు. పాలక పక్షాల చేతిలో అవి కీలుబొమ్మలుగా మారిపోయాయి. తాజాగా న్యాయ వ్యవస్థపై కూడా ప్రజల్లో నమ్మకం సడలుతోంది. ప్రజా ప్రతినిధులపై దాఖలయ్యే అవినీతి కేసులలో విచారణ ఏడాదిలోగా పూర్తి కావాలని సుప్రీంకోర్టు పలు సందర్భాలలో అభిప్రాయపడింది. మరి జరుగుతున్నదేమిటి? ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి సిసోడియా 17 నెలల పాటు జైల్లో ఉన్నారు. అయినా దర్యాప్తు సంస్థల విచారణ పూర్తి కాలేదు. దర్యాప్తు పూర్తయిన తర్వాత కోర్టు విచారణలో సిసోడియా నిర్దోషి అని తేలితే ఆయన 17 నెలల పాటు జైల్లో ఉన్నందుకు ఎవరు బాధ్యత తీసుకుంటారు? ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ఎప్పుడు బయటకు వస్తారో తెలియదు. ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిపై కోర్టు విచారణలో జాప్యం జరుగుతున్న తీరు కేస్‌ స్టడీ అవుతుంది. ఈ కేసులలో నిందితులందరూ హైకోర్టులో డిశ్చార్జి పిటిషన్లు వేస్తున్నందువల్ల కోర్టు ట్రయల్‌లో జాప్యం జరుగుతోందని సీబీఐ తన అఫిడవిట్‌లో పేర్కొంది. అయితే సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ వాదనను తోసిపుచ్చింది. డిశ్చార్జి పిటిషన్‌కు, కోర్టు ట్రయల్‌కు సంబంధం లేదని గతంలోనే తీర్పు ఇచ్చిన విషయాన్ని ధర్మాసనం గుర్తు చేసింది. సీబీఐ వంటి సంస్థల తరపున సుప్రీంకోర్టులో వాదించే సొలిసిటర్‌ జనరల్‌ లేదా ఆ సంస్థ న్యాయవాదులకు ఈ విషయం తెలియదా? అయినా జాప్యం జరుగుతూనే ఉంది. అవరోధాలు తొలగి విచారణ ప్రారంభం అవుతుందని అనుకుంటున్న సందర్భాలలో సంబంధిత న్యాయమూర్తి బదిలీ అవుతున్నారని కూడా సీబీఐ తన ఆఫిడవిట్‌లో పేర్కొంది. నిజమే, జగన్‌ కేసులు విచారణకు రాకుండానే న్యాయమూర్తులు బదిలీ అవుతున్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఏమీ చేయలేదా? వివిధ సందర్భాలలో ఎవరికి వారు తమ తప్పు లేదని చెప్పి చేతులు దులుపుకొంటున్నారు.

ఈ కారణంగానే వ్యవస్థలపై ప్రజల్లో అపనమ్మకం ప్రబలుతోంది. పొలిటికల్‌ బాసుల కనుసన్నల్లో పనిచేయడానికి వ్యవస్థలు అలవాటుపడ్డాయి. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఇదే పరిస్థితి. ఇలా అయితే ప్రజల్లో తిరుగుబాటు రాదా? పాలకులుగా అవతరించే ప్రజా ప్రతినిధుల విషయంలో అయినా తప్పు చేశారా? లేదా? అన్నది వెనువెంటనే తేల్చకపోతే జరిగే అనర్థాలకు బాధ్యులు ఎవరు? జగన్‌రెడ్డి వ్యవహారాన్నే తీసుకుందాం! ఆయన పుష్కర కాలంగా బెయిల్‌పై ఉన్నారు. భవిష్యత్తులో న్యాయస్థానం ఆయనను దోషిగా ప్రకటిస్తే... అతను ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఒక రాష్ర్టాన్ని పాలించే అవకాశం కల్పించిన పాపం ఎవరిది అవుతుంది? గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీతో చెడినందునే జగన్‌పై కేసులు నమోదయ్యాయని, ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్నవారితో సత్సంబంధాలు ఉన్నందునే తనపై దాఖలైన కేసులలో విచారణ కూడా జరగకుండా జగన్‌ తప్పించుకోగలుగుతున్నారన్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పడిన మాట నిజం కాదా? మధ్యలో దర్యాప్తు సంస్థలకు, న్యాయస్థానాలకు పాత్ర లేదా? ఈ రెండు వ్యవస్థల ప్రత్యక్ష, పరోక్ష సహకారం లేని పక్షంలో ఇది సాధ్యమా? డిశ్చార్జి పిటిషన్లను సాకుగా చూపడాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది. ఆ విషయం కింది కోర్టులకు తెలియదా? సుప్రీంకోర్టు మాదిరిగా కింది కోర్టులు కూడా ఆలోచించి ఉంటే జగన్‌ కేసులలో ఈ పాటికి విచారణ కూడా పూర్తయ్యేది కదా? ఈ చిక్కు ముడులు ఎవరు విప్పాలి? తమపై ప్రజల్లో నమ్మకం చచ్చిపోకుండా ఉండేందుకు సుప్రీంకోర్టు స్థాయిలో అప్పుడప్పుడు ప్రజలకు ఉపశమనం లభించే విధంగా తీర్పులు వస్తున్నాయి కానీ నిందితులైన రాజకీయ నాయకులు మాత్రం అందలం ఎక్కుతూనే ఉన్నారు. దర్యాప్తు సంస్థలపై కనీస నమ్మకం లేనందున కేసులు ఉన్న వారికి కూడా ప్రజలు అధికారం కట్టబెడుతున్నారు. చివరకు, ఎవరు మాత్రం అవినీతిపరులు కాదు– అని సరిపెట్టుకొనే పరిస్థితులు ఈ దేశంలో నెలకొన్నాయి.


భారత్‌లోనూ జరుగుతుందా?

బంగ్లాదేశ్‌ వంటి పరిణామాలు మన దేశంలో జరగకపోవచ్చును గానీ, నిజాయితీపరులు, ప్రజాస్వామ్య ప్రియులు, కష్టపడి సంపాదించి పన్నులు కడుతున్న వారిలో అసంతృప్తి గూడుకట్టుకుంటోంది. అది ఎప్పుడైనా, ఏ రూపంలోనైనా పెల్లుబకవచ్చు. అంతులేని ప్రజాభిమానంతో అధికారంలోకి వచ్చిన నాయకులపై కూడా అనతి కాలంలోనే ప్రజాగ్రహం పెల్లుబకడాన్ని చూస్తున్నాం. 2019 ఎన్నికల్లో 51 శాతం ఓట్లతో 151 సీట్లు గెలుచుకున్న జగన్మోహన్‌రెడ్డికి తాజా ఎన్నికల్లో 11 సీట్లు మాత్రమే ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కారకుడైన కేసీఆర్‌కు ప్రస్తుత దుస్థితి ఎందుకొచ్చింది? ఆయన కూడా తనను ‘తెలంగాణ పిత’గా పిలిపించుకున్నారు. తొమ్మిదిన్నరేళ్లు తిరిగే సరికి అదే తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను తిరస్కరించారు. దర్యాప్తు సంస్థలు, న్యాయ వ్యవస్థలు నిజాయితీతో సక్రమంగా పని చేసినా చేయకపోయినా ఎన్నికల్లో ప్రజలు మాత్రం ఓటు అనే ఆయుధంతో నిరంకుశంగా వ్యవహరించే వారిని శిక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ ఔన్నత్యాన్ని కాపాడుకోవడమా? లేదా? అన్నది దర్యాప్తు సంస్థలు, న్యాయ వ్యవస్థ తేల్చుకోవాలి. ప్రజాస్వామ్యంలో ఏ వ్యవస్థ అయినా ప్రజలకు మాత్రమే జవాబుదారీగా ఉండాలి. పాలకులకు కాదు. ఈ సూత్రాన్ని పాటిస్తే ప్రజల్లో అసహనానికి, అసంతృప్తికి తావుండదు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కేసులలో ఇప్పటికైనా విచారణ ప్రారంభమవుతుందని ఆశిద్దాం! డజనుకు పైగా అవినీతి కేసుల భారాన్ని మోస్తూ అతను నీతీ నిజాయితీల గురించి మాట్లాడుతుంటే వినడానికి ఎబ్బెట్టుగా ఉంటోంది. విచారణకు సహకరించి నిర్దోషిగా రుజువు చేసుకుంటే ఆయనకే మంచిది కదా! ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలలో చోటుచేసుకుంటున్న పరిణామాలను గమనించి కేంద్ర ప్రభుత్వం కూడా తగు విధంగా వ్యవహరించడం మంచిది. మూడో పర్యాయం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ తమకు ఈసారి సొంతంగా మెజారిటీ ఎందుకు లభించలేదో ఆత్మపరిశీలన చేసుకోవాలి. దేశంలోని అన్ని వ్యవస్థలూ లొంగిపోయినప్పటికీ ప్రజలు మాత్రం లొంగిపోలేదు. అందుకే ఆ పార్టీకి సొంతంగా మెజారిటీ లభించలేదు. ప్రజలు ఎప్పుడూ అలసిపోరు.


జగన్‌ (అ)భద్రత!

ఆ విషయం అలా ఉంచితే, ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తనకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కల్పించిన భద్రతను కొనసాగించాలంటూ హైకోర్టును కోరడం వింతగా ఉంది. ఇంకా నయం, ముఖ్యమంత్రి హోదాను కూడా కొనసాగించాలని ఆయన కోర్టును కోరలేదు. ఇప్పటికే ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఏ రాజకీయ పార్టీని ఎక్కడ ఉంచాలో కోర్టులు కాదు– ప్రజలు నిర్ణయిస్తారు. తెలుగునాట ఒకప్పుడు కమ్యూనిస్టు పార్టీలు బలంగా ఉండేవి. ఇప్పుడు కారణాలు ఏవైనా ఆ పార్టీలు గత చరిత్రకు వర్తమానంలో ఆనవాళ్లుగా మిగిలాయి. తెలంగాణలో సీపీఐకి శాసనసభలో కనీసం ప్రాతినిధ్యం ఉంది. సీపీఎంకు ఉభయ రాష్ర్టాలలో ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. తమకు గత వైభవం కల్పించాలని ఆ పార్టీ న్యాయస్థానం గడప తొక్కడం ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో, ప్రతిపక్ష హోదా ఇప్పించాలని జగన్మోహన్‌రెడ్డి న్యాయస్థానాన్ని కోరడం కూడా అంతే హాస్యాస్పదంగా ఉంది. ఇది చాలదన్నట్టు ఆయన ఇప్పుడు దాదాపు వెయ్యి మందితో తనకు భద్రత కల్పించాలని కోర్టు మెట్లు ఎక్కారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంతమందితో భద్రత ఏర్పాటు చేసుకున్నారా? ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు కూడా అంత మంది భద్రతగా ఉన్నారా? ఉంటే మాత్రం అభ్యంతరకరమే! ఈ దేశంలో ఎన్ని రాష్ర్టాల ముఖ్యమంత్రులకు ఇంత మందితో భద్రత ఏర్పాటు చేశారు? అంత అవసరం ఏమిటి? ఆంధ్రప్రదేశ్‌ ఇప్పుడు చిన్న రాష్ట్రమే. పొరుగున ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు ఇంత భద్రత లేదే? వివాహాది శుభకార్యాలు, లేదా మరేదైనా ప్రైవేటు కార్యక్రమానికి వెళ్లినా ఆయనకు ఇద్దరు ముగ్గురు కానిస్టేబుళ్లు రక్షణగా ఉంటారు. స్టాలిన్‌ కూడా సాదాసీదాగా ఇతరులతో పాటు కలసి కూర్చుంటారు. తెలుగునాట ఈ ఆర్భాటం ఏమిటి? జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 980 మందితో రక్షణ కల్పించుకున్నారని తెలిసి పలువురు ఆశ్చర్యపోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు నాయకులకు హైదరాబాద్‌లో ఇళ్లూవాకిళ్లు ఉన్నాయి. ఈ కారణంగా హైదరాబాద్‌లో ఉన్న ఇళ్లలో కూడా ముఖ్యమంత్రులుగా ఉన్నవాళ్లు రక్షణ కల్పించుకుంటున్నారు. జగన్‌రెడ్డికి హైదరాబాద్‌, బెంగళూరు, ఇడుపులపాయలో ప్యాలెస్‌లు ఉన్నాయి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్యాలెస్‌లకు వెళ్లినా వెళ్లకపోయినా భద్రత కల్పించేవారు. ఇప్పుడు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా ఆయన తనకు అదే స్థాయి భద్రత కల్పించాలని కోరుతున్నారు. చంద్రబాబుకు నక్సలైట్ల నుంచి ముప్పు ఉంది.

జగన్‌రెడ్డికి ఆ ముప్పు లేదే! అయినా వెయ్యి మందితో భద్రత కావాలని ఆయన ఎందుకు కోరుతున్నారు? ఆయనకు అంత మంది శత్రువులు ఉన్నారా? ఉంటేగింటే ఎందుకున్నారు? ఐదేళ్లపాటు ప్రజారంజక పాలన అందించానని చెప్పుకొంటున్న ఆయనకు శత్రువులు ఉండకూడదు కదా? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత భద్రత ఉండిందో అంత భద్రత కావాలని కోరుతున్నారంటే ఆయన ప్రజారంజక పాలన కాకుండా ప్రజాకంటక పాలన అందించారని భావించడం తప్పు కాదనుకుంటా! ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలతో కలసిపోయిన జగన్‌... ముఖ్యమంత్రి అయ్యాక ప్రజలకు దూరమయ్యారు. తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి అడుగు బయట పెడితే పరదాలు కట్టించుకున్నారు. పోలీసు రక్షణ వలయంలో బతికారు. చివరకు అధికారానికి దూరమయ్యారు. రక్షణ కోసం కాకుండా, కేవలం అధికార దర్పానికి చిహ్నంగా అప్పట్లో ఆయన అంత మందితో రక్షణ వలయం ఏర్పాటు చేసుకున్నట్టున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనల సందర్భంగా కూడా కనిపించనంత హడావిడి జగన్‌రెడ్డి పర్యటనల్లో కనిపించేది. తాడేపల్లి ప్యాలెస్‌లో ఏం జరుగుతుందో నరమానవులకు కనిపించనంత ఎత్తుల్లో కంచె ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణలో కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రస్తుత ప్రజాభవన్‌ వద్ద ఇదే స్థాయిలో ఇనుప కంచె ఏర్పాటు చేసుకున్నారు. వివిధ దేశాలలో నియంతలుగా పేరొందినవారు మాత్రమే ఇలాంటి రక్షణ ఏర్పాట్లు చేసుకోవడం చూశాం. ఆంధ్రప్రదేశ్‌ భారతదేశంలో ఒక చిన్న రాష్ట్రం.


ఆ రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తికి వెయ్యి మందితో భద్రత కల్పించడం విడ్డూరమే. ఇప్పుడు జగన్మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు. మాజీ ముఖ్యమంత్రి మాత్రమే. ఒక మాజీ ముఖ్యమంత్రికి నిబంధనల ప్రకారం ఎంత రక్షణ కల్పించాలో అంతే కల్పిస్తారు. అంతకు మించి కావాలనుకుంటే అందుకు అయ్యే ఖర్చును అతడే భరించడం న్యాయం. అయినా ఆయన ఇప్పటికే వందల మంది ప్రైవేట్‌ భద్రతా సిబ్బందిని నియమించుకున్నారు. తెలుగునాట భద్రత అన్నది ఒక హోదాగా మారింది. ఇతర రాష్ర్టాలలో శాసనసభ్యులు అందరికీ అంగరక్షకులు కూడా ఉండరు. ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అంతకు ముందు కూడా ముఖ్యమంత్రులుగా పని చేసిన వారికి ఒక పైలట్‌, ఒక ఎస్కార్ట్‌ కారు మాత్రమే ఉండేవి. డజన్ల కొద్దీ వాహనాలతో భారీ కాన్వాయ్‌ ఉండేది కాదు. ఏది ఏమైనా ఇప్పుడు జగన్‌ చేసిన విజ్ఞప్తి న్యాయస్థానం పరిశీలనలో ఉంది. కోర్టు ఏమి చెబుతుందో చూద్దాం!

అలా వదిలేస్తారా...?

కాగా, చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు మాసాలే అయింది. ఇంతలోనే జగన్‌రెడ్డిలో అసహనం పెరిగిపోతోంది. తన పాలనలో రాజారెడ్డి రాజ్యాంగం అమలైందన్న విమర్శలు వచ్చినందున ఇప్పుడు రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలవుతోందని ఆయన విమర్శిస్తున్నారు. శాంతిభద్రతలు కుప్పకూలి పోయాయని గగ్గోలు పెడుతున్నారు. తనకు ఎదురైన అనుభవాలు ప్రత్యర్థులకు కూడా ఎదురవాలని ఆయన ఆశిస్తున్నారు. అవినీతి కేసులలో తాను పదహారు నెలల పాటు జైలు జీవితం గడపాల్సి వచ్చినందున తన రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబు కూడా జైలుకు వెళ్లాలని జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోరుకున్నారు. అందుకే తాడూ బొంగరం లేని స్కిల్‌ కేసులో చంద్రబాబును దాదాపు రెండు నెలల పాటు జైలుకు పంపించారు. ఆ బాటలోనే అప్పుడు రాజారెడ్డి రాజ్యాంగం అన్నారని ఇప్పుడు రెడ్‌ బుక్‌ రాజ్యాంగం అని అంటున్నారు.


అంతేకాదు, రాష్ట్రంలో శాంతిభద్రతలు కుప్పకూలిపోయాయని, పెట్టుబడులకు భద్రత ఉండదని, తెలంగాణ వైపు చూడండని తన మద్దతుదారులతో సోషల్‌ మీడియాలో ప్రచారం చేయిస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా జగన్‌ అండ్‌ కో ప్రచారం చేయడం వింతగా ఉంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టవద్దని కోరే దాకా వెళ్లారంటే వారి మానసిక పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. నిజానికి చంద్రబాబు అధికారం చేపట్టినప్పటికీ మెతక వైఖరినే అవలంబిస్తున్నారని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమను వేధించిన వారిపై కనీసం చర్యలు తీసుకోవడం లేదని తెలుగు తమ్ముళ్లు ఆవేశంతో ఊగిపోతున్నారు. గడచిన కొద్ది రోజులుగా జగన్‌ రోత మీడియాలో వస్తున్న వార్తలను గతంలో ఇతర పత్రికలు ప్రచురించి ఉంటే కేసులు పెట్టి ఉండేవారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టవద్దని ప్రచారం చేస్తున్న వారిపై కూడా చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. విజయవాడలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద జగన్‌ పేరును ఎవరో దుండగులు తొలగిస్తే దళితులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఆ దుశ్చర్యకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ ప్రధాన కారణమంటూ సదరు రోత పత్రికలో వార్తలు వండి వార్చారు. అయినా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో తెలుగు తమ్ముళ్లు మరింత మండిపడుతున్నారు. కంటికి కన్ను పంటికి పన్ను సిద్ధాంతం మంచిది కాదని చంద్రబాబు భావిస్తున్నట్టుగా ఉంది. అయితే, ఈ ధోరణి తెలుగుదేశం కార్యకర్తల్లో నిరాశా నిస్పృహలకు కారణం అవుతోంది. శుక్రవారం నాటి విజయవాడ సంఘటన పూర్వాపరాలను పరిశీలిస్తే... ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకతను పెంచేందుకు జగన్‌ అండ్‌ కో ఎంతకైనా తెగిస్తారని అర్థమవుతోంది. 2014–19 మధ్య కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కల్పితాలు ప్రచారం చేసి జగన్‌ అండ్‌ కో లబ్ధి పొందింది. ఇప్పుడు కూడా అవే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2019లో చంద్రబాబు ఓడిపోయి జగన్‌రెడ్డి అధికారం చేపట్టడంతో దాదాపు రెండేళ్లపాటు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు బయటకు రావాలంటేనే భయపడ్డారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన మరుసటి రోజు నుంచే వైసీపీ శ్రేణులు స్వేచ్ఛగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వానికి చికాకులు సృష్టిస్తున్నారు. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా జగన్‌రెడ్డి ప్రత్యక్షమవుతున్నారు.


దీన్ని తేలికగా తీసుకుంటే అధికార పక్షమే నష్టపోతుంది. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలంటారు. జగన్‌ అండ్‌ కో చేస్తున్న ప్రచారంపై వాస్తవాలను ఎప్పటికప్పుడు ప్రజలకు వివరిస్తూ తప్పుడు ప్రచారాలను కట్టడి చేయని పక్షంలో తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది. విజయవాడలో అంబేడ్కర్‌ విగ్రహం వద్ద జగన్‌రెడ్డి పేరు తొలగించడానికి కారకులైన వారి వెనుక చంద్రబాబు, లోకేశ్‌ ఉన్నారా? లేరా? అన్నది తేల్చాలి. వారి ప్రమేయం లేని పక్షంలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి. కక్ష సాధింపులు వాంఛనీయం కాదుగానీ... అసత్య ప్రచారాలు, అభూత కల్పనలతో రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలిగించే వారిపైన, రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపైనా చర్యలు కూడా తీసుకోని పక్షంలో అది అసమర్థత అవుతుంది. గతంలో చంద్రబాబు ఇలా ఉదాసీనంగా వ్యవహరించడం వల్లనే రాష్ట్రం భారీ మూల్యం చెల్లించుకుంది. జగన్‌ అండ్‌ కో విషయంలో చంద్రబాబు ప్రభుత్వం మరింత అప్రమత్తత ప్రదర్శించాలి. లేనిపక్షంలో ఎదురయ్యే పరిణామాలకు సిద్ధం కావాలి!

ఆర్కే

Updated Date - Aug 11 , 2024 | 07:11 AM