Share News

RK Kothapaluku: ఏం చేద్దాం.. ఒకరినొకరు ఓదార్చుకోండి!

ABN , Publish Date - Jul 14 , 2024 | 02:14 AM

‘‘చంద్రబాబు నాయుడులో మార్పు ఆశించడం వేస్ట్‌.. పేరుకే కూటమి ప్రభుత్వం గానీ వైసీపీ–2 ప్రభుత్వం ఉన్నట్టుగానే ఉంది’’ –సోషల్‌ మీడియాలో తెలుగు తమ్ముళ్లు పుంఖానుపుంఖాలుగా పెడుతున్న పోస్టులు, వ్యాఖ్యల సారాంశం...

RK Kothapaluku: ఏం చేద్దాం.. ఒకరినొకరు ఓదార్చుకోండి!

‘‘చంద్రబాబు నాయుడులో మార్పు ఆశించడం వేస్ట్‌.. పేరుకే కూటమి ప్రభుత్వం గానీ వైసీపీ–2 ప్రభుత్వం ఉన్నట్టుగానే ఉంది’’ –సోషల్‌ మీడియాలో తెలుగు తమ్ముళ్లు పుంఖానుపుంఖాలుగా పెడుతున్న పోస్టులు, వ్యాఖ్యల సారాంశం ఇది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారి చంద్రబాబు నేతృత్వంలో నూతన ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు మాత్రమే అయింది. అయినా తెలుగు తమ్ముళ్లు ఆవేశపడిపోతున్నారు. చంద్రబాబులో ఏమి మార్పు ఆశిస్తున్నారో తెలియదు. అధికారుల పోస్టింగుల నుంచి ప్రతి చిన్న విషయానికీ సోషల్‌ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. గత జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో జరిగిన అరాచకాలకు తక్షణ శిక్షలు వేయాలని, అప్పట్లో ప్రభుత్వానికి సహకరించిన అధికారులు అందరినీ పక్కన పడేయాలని వారు కోరుకుంటున్నారు. ఈ నెల రోజులుగా తెలుగు తమ్ముళ్లు వ్యక్తంచేస్తున్న అభిప్రాయాలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు తలనొప్పిగా మారాయి. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ వ్యవహారాలకు కొన్ని మార్గదర్శకాలు ఉంటాయి. అయితే జగన్‌రెడ్డి హయాంలో ఈ మార్గదర్శకాలు అన్నింటినీ తుంగలో తొక్కి పగ, ప్రతీకారాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో అప్పుడు బాధితులుగా ఇబ్బందులు పడినవారందరూ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కూడా అదే బాటలో నడవాలని కోరుకుంటున్నారు. జగన్‌రెడ్డి ప్రభుత్వంలో జరిగిన దురాగతాలలో భాగస్వాములైన అధికారులు అందరినీ శిక్షించాలని వారు కోరుకుంటున్నారు. నిజానికి కూటమి ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు అవుతున్నప్పటికీ ప్రభుత్వం ఇంకా కుదురుకోలేదు. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. జగన్‌రెడ్డి వ్యవహార శైలి కారణంగా వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయి. మరకలు అంటని అధికారులను గుర్తించడం కష్టంగా మారింది. ఈ కారణంగా అధికారుల నియామకాలలో ముఖ్యమంత్రి ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అయినప్పటికీ జగన్‌ హయాంలో తొత్తుగా వ్యవహరించిన ఫలానా అధికారిని ఎందుకు నియమించారు? అంటూ నిట్టూర్పులు వెలువరిస్తున్నారు. పోలీసు శాఖలో కీలక పదవుల భర్తీకి అనువైన అధికారుల కోసం వెదుక్కోవలసి వచ్చింది. ప్రభుత్వ శాఖల కార్యదర్శుల నియామకం ఇంకా పూర్తికాలేదు. శాఖాధిపతులుగా ఎవరిని నియమించాలో తెలియని పరిస్థితి. జిల్లా కలెక్టర్ల నియామకం కొంతవరకు పూర్తిచేసిన ప్రభుత్వం జిల్లా ఎస్పీల నియామకాన్ని ఈ శనివారం మాత్రమే చేపట్టగలిగింది. వాస్తవానికి కార్యదర్శులు, శాఖాధిపతులు, కలెక్టర్లు, ఎస్పీల నియామకం పూర్తి అయితే గానీ కింది స్థాయి అధికారుల బదిలీ గురించి ఆలోచించే పరిస్థితి ఉండదు. అయితే తెలుగు తమ్ముళ్లు మాత్రం సహనం కోల్పోతున్నారు. ‘‘మా దగ్గర ఫలానా పోలీసు అధికారే, ఫలానా రెవెన్యూ అధికారే కొనసాగుతున్నారు. ఇలా అయితే ప్రభుత్వం మారాలని ఒళ్లూ ఇళ్లూ హూనం చేసుకోవడం ఎందుకూ?’’ అని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ ధోరణి ఎంత ప్రమాదకరంగా మారిందంటే, స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవలసిన ముఖ్యమంత్రి చంద్రబాబు వెనుకంజ వేయాల్సి వస్తోంది. ప్రభుత్వాలు మారినప్పుడు అప్పటిదాకా హడావిడి చేసిన అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు తెరమరుగై కొత్తగా అధికారంలోకి వచ్చిన పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు హల్‌చల్‌ చేయడం సర్వసాధారణం. ప్రభుత్వ యంత్రాంగంలో ఇలా చేయడం సాధ్యం కాదు. ఏ ప్రభుత్వమైనా అదే అధికారులు, సిబ్బందితో పనిచేయించుకోవాల్సి ఉంటుంది.


అయితే తెలుగు తమ్ముళ్లు ఇప్పుడే ఎందుకు ఇంత అసహనానికి గురవుతున్నారంటే కారణం లేకపోలేదు. జగన్‌రెడ్డి పాలనలో రాజకీయ ప్రత్యర్థులను, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులను కేసులతో వేధించారు. వారు స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకోలేని పరిస్థితి ఉండింది. పోలీసులు కనీవినీ ఎరుగని రీతిలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. బారా ఖూన్‌ మాఫీ అన్నట్టుగా ఎవరేమి చేసినా చెల్లుబాటు అయింది. ప్రశ్నించే వెసులుబాటు కూడా లేకుండాపోయింది. ప్రజాస్వామ్యంలో తాను ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిని మాత్రమే అన్న స్పృహ లేకుండా తాను ఒక చక్రవర్తిలాగా జగన్‌రెడ్డి వ్యవహరించారు. ఇక వైసీపీ నాయకులు సామంతుల్లాగా తమ తమ ప్రాంతాలపై ఆధిపత్యం చెలాయించారు. మొత్తంగా రాష్ట్రంలో రూల్‌ ఆఫ్‌ లా లేకుండా చేశారు. వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. పగ, ప్రతీకారాలే రాజకీయాలకు పరమావధి అన్నట్టుగా రాజకీయాలకు కొత్త నిర్వచనం ఇచ్చారు. దీంతో నాటి బాధితులు ఇప్పుడు ఇన్‌స్టంట్‌ జస్టిస్‌ కోరుకుంటున్నారు. కంటికి కన్ను–పంటికి పన్ను సిద్ధాంతాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. జగన్‌రెడ్డి బాటలోనే వ్యహరించాలనుకుంటే రాష్ట్రంలో ప్రభుత్వం మారాల్సిన అవసరం లేదని మరచిపోతున్నారు. చంద్రబాబు నాయుడు కూడా జగన్‌ మాదిరిగా సైకో పనులు చేయాలనుకుంటున్నారు. ఇదొక దురదృష్టకర వాతావరణం.


జగన్‌ కళ్లలో ఆనందం కోసం..

తెలుగునాట ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, పోయాయి. అయితే గతంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. అధికారంలోకి వచ్చిన వారి ప్రాధాన్యతల ఆధారంగా పాలన ఉండేది. అధికారులపై పార్టీల ముద్ర ఉండేది కాదు. తమిళనాడులో డీఎంకే – అన్నాడీఎంకే అధిపతులుగా కరుణానిధి–జయలలిత ఉన్నప్పుడు, డీఎంకే అధికారంలోకి వస్తే వారికి అనుకూలమైన అధికారులు కీలక స్థానాల్లోకి వచ్చేవారు. అన్నాడీఎంకే అధికారంలోకి రాగానే వారందరినీ అప్రధాన పోస్టులలో నియమించేవారు. ఈ పరిస్థితి తెలుగునాట గతంలో లేదు. జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాతే కొంతమంది అధికారులు కుల, మత ప్రాతిపదికన పార్టీలకు విధేయత ప్రకటించుకున్నారు. ఆ క్రమంలో వారు హద్దులు మీరి ప్రవర్తించారు. దీంతో రాష్ట్రంలో ప్రజల మైండ్‌సెట్‌ కూడా మారిపోయింది. పగ, ప్రతీకారాలే ఎజెండాగా అవతరించాయి. జగన్‌రెడ్డి హయాంలో ఏడెనిమిది మంది అధికారులు మరీ దిగజారి వ్యవహరించారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే ప్రవీణ్‌ ప్రకాశ్‌ అనే ఐఏఎస్‌ అధికారి స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నారు. అంటే, చంద్రబాబు ప్రభుత్వంలో పనిచేయడం ఆయనకు ఇష్టం లేకపోయి ఉండవచ్చు లేదా తన పాపాలకు శిక్ష అనుభవించాల్సి వస్తుందన్న భయం కావచ్చు. పరిటాల రవిని హత్య చేసిన వారిలో ఒకరైన మొద్దు శీను ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన బావ (మద్దెలచెరువు సూర్యనారాయణ రెడ్డి) కళ్లలో ఆనందం చూడటానికే రవిని చంపానని చెప్పాడు. ప్రవీణ్‌ ప్రకాశ్‌ కూడా జగన్‌ కళ్లలో ఆనందం చూడటం కోసం ప్రభుత్వానికి దిక్కుమాలిన సలహాలు ఇస్తున్నానని తన సహచరులతో చెప్పేవారట. ఒక ఐఏఎస్‌ అధికారి ఆలోచించాల్సిన తీరు అదేనా? ఇలాంటి వారి సూచనలు అమలుచేసి ఆనందపడిన జగన్మోహన్‌రెడ్డి ఇంటికి పోయారు. ఆయన కళ్లలో ఆనందం చూడడమే ముఖ్యమనుకున్న ప్రవీణ్‌ ప్రకాశ్‌ కూడా స్వచ్ఛంద పదవీ విరమణ చేయాల్సి వచ్చింది. ఇలాంటి అధికారుల మూలంగానే అఖిల భారత సర్వీసుల ప్రతిష్ఠ మసకబారుతోంది. ప్రవీణ్‌ ప్రకాశ్‌ తరహాలోనే మరికొందరు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు వ్యవహరించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నెల రోజులు అవుతున్నా సదరు అధికారులకు ఆయన దర్శనం కూడా లభించలేదు. ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మి విషయమే తీసుకుందాం. దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో అడ్డగోలుగా వ్యవహరించిన కారణంగా సీబీఐ నమోదు చేసిన కేసులలో జగన్‌రెడ్డితో పాటు శ్రీలక్ష్మి కూడా జైలుకు వెళ్లి ఆరోగ్యం కూడా చెడగొట్టుకున్నారు. అయినా బుద్ధి తెచ్చుకోకుండా తెలంగాణ కోటాకు వెళ్లిన ఆమె.. విజయసాయి రెడ్డి ద్వారా పైరవీలు చేసుకొని జగన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లారు. ఇప్పుడు ఆమెకు చంద్రబాబు దర్శనం కూడా లభించడంలేదు. విధి నిర్వహణలో సక్రమంగా వ్యహరించి ఉంటే శ్రీలక్ష్మి కేంద్ర కేబినెట్‌ సెక్రటరీగా పదోన్నతి పొంది ఉండేవారు. ఐపీఎస్‌ అధికారులు పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, పీవీ సునీల్‌ కుమార్‌, సంజయ్‌ వంటి వారు కూడా ఈ కోవలోకే వస్తారు. వారిని కలవడానికి కూడా చంద్రబాబు ఇష్టపడటం లేదు. అఖిల భారత సర్వీసుకు ఎంపికైన అధికారులు ఇలా ఎందుకు ప్రవర్తించారనే ప్రశ్నకు వారే సమాధానం చెప్పాలి. చంద్రబాబు గతంలో కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయితే అధికారుల విషయంలో ఇంత కఠినంగా ఆయన ఎప్పుడూ వ్యవహరించలేదు. సౌమ్యుడైన చంద్రబాబు కఠినంగా మారడానికి ఇలాంటి అధికారులే కారణం. జగన్‌రెడ్డి లేదా చంద్రబాబుకు సేవ చేసి తరించడానికే ఆయా అధికారులు అఖిల భారత సర్వీసుకు ఎంపిక కాలేదు కదా! చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా ప్రజలకు సేవ చేయడమే అధికారుల బాధ్యత. ముఖ్యమంత్రుల కళ్లలో ఆనందం చూడటం కోసం కాకుండా రాజ్యాంగానికి కట్టుబడి పనిచేయాలి. జగన్‌రెడ్డి పాలనలో అధికారుల బలహీనతలను వాడుకొని వారితో అడ్డమైన పనులూ చేయించారు. ‘జగన్‌రెడ్డి జైలుకు వెళ్లడానికి కారకుడైన చంద్రబాబును జైలుకు పంపకపోతే ఎలా? మీరు మాతో సహకరించండి. లేదా మిమ్మల్ని కూడా జైలుకు పంపుతామ’ని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అజయ్‌ జైన్‌ మెడపై కత్తి పెట్టిన చరిత్ర ఐపీఎస్‌ అధికారి కొల్లి రఘురామిరెడ్డిది.


చంద్రబాబు, జగన్‌ మధ్య రాజకీయ వైరం ఉంటే వాళ్లిద్దరూ తేల్చుకుంటారు. వారికోసం అధికారులు కిరాయి సైనికులుగా మారడం సమర్థనీయం కాదు కదా! అధికారులు ఇంతగా చెడిపోవడమే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమస్యగా మారింది. కీలక పోస్టుల భర్తీకి ఒకటికి రెండుసార్లు ఆలోచించవలసి వస్తోంది. తెలుగు తమ్ముళ్లూ.. ఇప్పుడు చెప్పండి– జగన్‌రెడ్డి బాటలోనే చంద్రబాబు కూడా పాలెగాడి తరహా పాలన చేయాలా? లేక రూల్‌ ఆఫ్‌ లా ప్రకారం వ్యవహరించాలా? జగన్‌ ప్రభుత్వం అరాచకంగా ఉండిందనే కదా ప్రజలు ఆయనను చిత్తుగా ఓడించారు. చంద్రబాబు కూడా అలాగే చేస్తే ఆయనను కూడా ప్రజలు అంతే చిత్తుగా ఓడిస్తారు. కక్ష సాధింపులు ప్రభుత్వాలకు ఎజెండాగా ఉండకూడదు. అయితే నాటి బాధితులకు ఉపశమనం లభించాల్సిందే. కాకపోతే అది చట్టబద్ధంగా జరగాలి. తప్పు చేసిన అధికారులను నిబంధనల ప్రకారం శిక్షించాలి గానీ ఆటవిక న్యాయం అమలు చేయాలని కోరుకోవడం సమంజసం కాదు కదా! ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని గాడిలో పెట్టడానికి చంద్రబాబుకు తగినంత వ్యవధి ఇవ్వాలి. సోషల్‌ మీడియా పేరిట ఆయనను ప్రభావితం చేయాలనుకోవడం, ప్రభుత్వం అనుచిత నిర్ణయాలు తీసుకొనే విధంగా ప్రేరేపించడం సమర్థనీయం కాదు. జగన్‌రెడ్డి పాలనలో అనేక ఇబ్బందులు పడిన ప్రజలు.. చంద్రబాబు ప్రభుత్వంపై గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ఈ ప్రభుత్వాన్ని వేయి కళ్లతో గమనిస్తున్నారు. ప్రభుత్వాలు రాజధర్మాన్ని పాటించాలి. గత ప్రభుత్వంలో లీజుదారులను వెళ్లగొట్టి గనులను కబ్జా చేశారు. వ్యాపారాలను కబళించారు. పోర్టులను చెరపట్టారు. రాష్ట్రంలో న్యాయబద్ధంగా వ్యాపారం చేసుకోవాలన్నా కప్పం కట్టాల్సిన దుస్థితి కల్పించారు. ఇప్పుడు కూటమి నాయకులు కూడా అలాగే వ్యవహరిస్తే ప్రజలు కచ్చితంగా హర్షించరు. నాయకులు, కార్యకర్తలలోనే కాదు ప్రజల్లో కూడా ఎన్నో ఆశలు, ఆకాంక్షలు ఉన్నాయని గుర్తించాలి.


వారిని కట్టడి చేయాల్సిందే!

గడచిన కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంటున్న కొన్ని సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తెలుగుదేశం, జనసేన నాయకులు, ఎమ్మెల్యేలు గత పాలకుల బాటలోనే వ్యవహరిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. నర్సరావుపేట పార్లమెంటు నియోజకవర్గానికి చెందిన ఒక ఎమ్మెల్యే తన నియోజకవర్గంలోని నాలుగు బార్ల యజమానులను తక్షణమే వాటిని ఖాళీ చేసి తమ మనుషులకు అప్పగించాలని హుకుం జారీ చేశారట. అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గంలోని ఒక జనసేన ఎమ్మెల్యే ఫార్మా కంపెనీ వాళ్లు తనకు కప్పం కట్టాలని ఆదేశిస్తున్నారట. కడప జిల్లాలో గతంలో మాదిరి భూ కబ్జాలు జరుగుతున్నట్టు సమాచారం. రాష్ర్టానికి పెట్టుబడులను ఆకర్షించే పనిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండగా, కూటమికి చెందిన ఎమ్మెల్యేలు ఇలా ప్రవర్తించడాన్ని ఎలా సమర్థించుకుంటారు? వ్యాపారాలు చేసుకొనే వారికి సహకరించాలే గానీ కప్పం కట్టాలని కోరడం ఏమిటి? గత పాలనలో ఇలా జరిగిందనే కదా ప్రజలు ఆ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో నిమజ్జనం చేశారు! తూర్పు గోదావరి జిల్లాలో ఎన్నో ఏళ్లుగా లేటరైట్‌ క్వారీలు నడుపుకొంటున్న వారిని గత ప్రభుత్వంలో తరిమేసి వైవీ సుబ్బారెడ్డి కుమారుడు వాటిని చెరబట్టారు. ఇప్పుడు ప్రభుత్వం మారాక సానా సతీష్‌ అనే ఆయన అదే బాటలో పయనించే ప్రయత్నం చేసినట్టు వార్తలు వచ్చాయి. నెల్లూరు జిల్లాలో ప్రైవేటు భూములలో సిలికా ఇసుక లభిస్తుంది. ఆయా భూ యజమానులు లీజు పొంది సిలికా అమ్ముకొనేవారు. జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక అధికార పార్టీ వాళ్లు యజమానులను తరిమేసి వాటిని కబ్జా చేశారు. చీమకుర్తిలోని గెలాక్సీ గ్రానైట్‌ గనులు కూడా ఈ కోవలోకే వస్తాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కఠినంగా వ్యవహరించాలి. కబ్జాలకు గురైన గనులను, ఖనిజాలను వాటి యజమానులకు అప్పగించి వారు స్వయంగా వ్యాపారాలు చేసుకోగలిగే పరిస్థితులు కల్పించాలి. ప్రభుత్వ మార్పు మాత్రమే కాదు.. కొత్త ప్రభుత్వంలో ప్రజలు కోరుకుంటున్న మార్పు ఇదే. మంచికి పోతే చెడు ఎదురైందని అంటారు. ఉచిత ఇసుక విషయంలో ఇలాగే జరుగుతోంది. 2014–2019 మధ్య కాలంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఉచిత ఇసుక విధానం అమలు చేసినా విమర్శలపాలయ్యారు. స్పష్టమైన విధానం, అవగాహన లేకుండా లేడికి లేచిందే పరుగు అన్నట్టుగా ఉచిత ఇసుక అని ప్రకటించడంతో అప్పట్లో రీచ్‌లు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, వారి మనుషుల అధీనంలోకి వెళ్లిపోయాయి. ఇసుక లోడింగ్‌, అన్‌ లోడింగ్‌ రవాణా చార్జీలు భరించాల్సి ఉంటుందని చెప్పి ఉంటే విమర్శలకు తావు ఉండేది కాదు. గతంలో అమరావతిలో సచివాలయం, అసెంబ్లీలకు తాత్కాలిక భవనాలు నిర్మించామని అన్నందుకు ఆ మాటను పట్టుకొని చిలువల పలువలు చేశారు. ఏడెనిమిదేళ్లుగా ఉపయోగిస్తున్న ఆ భవనాలను గుడారాలు అంటూ విమర్శించారు. ఇలాంటి అనుభవం దృష్ట్యా ప్రభుత్వం పదాల వాడకంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. అధికారంలోకి వచ్చిన కూటమి నాయకులు ఎవరైనా రేపు అనేది లేకుండా వ్యవహరిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు వెనుకాడకూడదు. ప్రభుత్వం మారినంత మాత్రాన అధికారులు కొత్తగా పుట్టుకురారు. కనుక పూర్తిగా చెడిపోయిన అధికారులను వదిలేసి మిగతావాళ్లకు ప్రభుత్వ ప్రాధాన్యాలను వివరించి వారితోనే పనిచేయించుకోవాలి. ఈ విషయంలో తెలుగు తమ్ముళ్లు కూడా ఆవేశాన్ని తగ్గించుకోవాలి.


..కానివ్వండి ఓదార్చుకోండి!

ఇప్పుడు తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఢిల్లీలో విలేకరుల సమావేశంలో జగన్మోహన్‌రెడ్డి ఓటమిపై చేసిన వ్యాఖ్యల విషయానికి వద్దాం. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు ముందు జగన్‌ మళ్లీ అధికారంలోకి వస్తారన్నది తమకున్న సమాచారం అని కేటీఆర్‌ చెప్పుకొచ్చారు. ఇప్పుడు జగన్‌ చిత్తుగా ఓడిపోయి చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరి నెల అయింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో తాము కోలుకోవడం ఎలాగో ఆలోచించకుండా జగన్‌ ఓడిపోవడం ఆశ్చర్యంగా ఉందని, అయినా 40 శాతం ఓట్లు సాధించిన ఆయన హీరో అని కేటీఆర్‌ సెలవిచ్చారు. తెలంగాణలో తాము జీరోలుగా మారిన విషయం వదిలేసి పక్క రాష్ట్రం వాళ్లను హీరోలని పొగిడితే వచ్చేది ఏమిటో ఆయనకే తెలియాలి. ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి జగన్‌ పట్ల తండ్రీకొడుకులైన కేసీఆర్‌కూ, కేటీఆర్‌కూ అవ్యాజమైన ప్రేమ ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో రోడ్లు లేవు, కరెంటు లేదని ఒకప్పుడు విమర్శించిన ఇదే కేటీఆర్‌.. ఇప్పుడు జగన్‌ ఓటమికి ఆశ్చర్యపోవడం ఎందుకో తెలియదు. తెలంగాణలో తాము ఎందుకు సోయిలో లేకుండా పోయామో సమీక్షించుకోవాల్సింది పోయి జగన్‌పై ప్రేమ ఒలకబోస్తే మరింత నష్టమే తప్ప లాభం ఉండదు. తెలంగాణలో ప్రస్తుతం జీరోగా మారిన కేటీఆర్‌కు ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌రెడ్డిలో హీరో కనిపించడం విడ్డూరంగా ఉంది. 2019 ఎన్నికల్లో ఓటమి పాలైన చంద్రబాబుకు కూడా 40 శాతం ఓట్లు వచ్చిన విషయం కేటీఆర్‌కు గుర్తులేదా? ప్రతిరోజూ జనంలో తిరిగిన ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి ఓడిపోవడం ఆశ్చర్యంగా ఉందని కేటీఆర్‌ అన్న మాటలకు ఆంధ్రప్రదేశ్‌ మంత్రి, ధర్మవరం నుంచి గెలిచిన తాజా ఎమ్మెల్యే సత్యకుమార్‌ తగు విధంగా బదులిచ్చారు. జగన్‌, కేతిరెడ్డి వంటి వారి గురించి కేటీఆర్‌ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా సోషల్‌ మీడియాలో ఒక పోస్టు వచ్చింది. ‘‘గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపోతే, ఒంటె అందానికి గాడిద మూర్ఛపోయిందట! ఏం చేద్దాం.. ఒకరినొకరు ఓదార్చుకోండి!!’’ అని ఆ పోస్టులో పేర్కొన్నారు. నిజమే కదా! పక్క రాష్ట్రంలో ప్రజలు ఎవరి కుర్చీనో మడతపెడితే దానిపై కేటీఆర్‌ విశ్లేషణలు ఎవరికి కావాలి? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నుంచి భారత రాష్ట్ర సమితిని కాపాడుకోవడం కేటీఆర్‌ ప్రస్తుతం చేయాల్సిన పని. ఎన్నికల్లో ఓడిపోయినవారి వ్యాఖ్యలు, విశ్లేషణలకు పెద్దగా విలువ ఉండదని ఆయన ఎప్పుడు తెలుసుకుంటారో?

ఆర్కే

Updated Date - Jul 14 , 2024 | 09:07 AM