Share News

ముందే తెలిసిపోయిన ఓ ఓటమి కథ!

ABN , Publish Date - May 30 , 2024 | 01:23 AM

ఈ సారి ఉన్నంత ఉత్కంఠ ఇంతకుముందెప్పుడూ ఉండి ఉండదు. వారం తిరిగేసరికి, అంతా తెలిసిపోతుంది. ఫలితాలు ఆశ్చర్యం కలిగిస్తాయా, కలవరపెడతాయా, నీరసపరుస్తాయా, నిర్లిప్తత...

ముందే తెలిసిపోయిన ఓ ఓటమి కథ!

ఈ సారి ఉన్నంత ఉత్కంఠ ఇంతకుముందెప్పుడూ ఉండి ఉండదు. వారం తిరిగేసరికి, అంతా తెలిసిపోతుంది. ఫలితాలు ఆశ్చర్యం కలిగిస్తాయా, కలవరపెడతాయా, నీరసపరుస్తాయా, నిర్లిప్తత పెంచుతాయా చూడవలసి ఉంది. ఐపీఎల్ ఫైనల్‌కు పెల్లుబికినంత ఉద్రకరసం, ఈ ఎన్నికలలోనూ ప్రవహించిందంటే మన ప్రజాస్వామ్యం చాలా పరిణతి చెందిందనిపిస్తోంది. ఎన్నికల బరిలో అభ్యర్థులు, పార్టీలు మాత్రమే ఆటగాళ్లు అని, ఓటర్లు ప్రేక్షకులు మాత్రమేనని ఒక అభిప్రాయం ఏర్పడిపోయింది. బతుకు దుర్భరం అయినప్పుడు మాత్రం తమకు కూడా ఎన్నికలవ్యవహారంలో పాత్ర ఉందని, తాము కూడా లాభనష్టాలు పొందేవారమని ప్రజలకు స్ఫురిస్తుంది. అప్పటికి చేతులు కాలిపోయి ఉంటాయి. కొత్త ఆకులు పట్టుకోవడానికి మళ్లీ అయిదేళ్ల నిరీక్షణ.


నిజానికి, ఈ సాధారణ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించినప్పుడు, జాతీయదృశ్యంలోనే పెద్ద సస్పెన్స్ లేదు. మంచిరోజులో చెడ్డరోజులో ఏవైతే అవి, ఉన్నవే కొనసాగుతాయని అనిపించింది. ప్రచార విశేషాలను, అంతిమంగా ఫలితాలను పట్టించుకోవలసిన అవసరమే ఉండదనిపించింది. ప్రచారపర్వాన్ని దిగ్భ్రాంతికరంగా, వినోదాత్మకంగా మలచి, రంజింపజేసినందుకు లేదా కలవరపెట్టినందుకు నరేంద్రమోదీకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మోదీ ఆకస్మిక విన్యాసాలలో ఆందోళన ఉన్నదని, ఆకాశయానపు కుదుపులున్నాయని గుర్తించి విశ్లేషణలు అందించిన ఎలక్షనిస్టు మేధావులకు ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఏడుదశల ఎన్నికలలో మూడోదశ నుంచి గాలిమార్పు కనిపించింది. ఖాయమనుకున్నది అనుమానంగా మారింది. నిర్ణయమైపోయిందనుకున్నది, నందోరాజా భవిష్యతి అన్న స్థితికి వచ్చింది. చివరకు కొనసాగింపే నెగ్గవచ్చును కానీ, వేచే వేసట తెలియకుండా కొంత సంశయం, కొంత సందేహం, కొంత ఆశ, కొంత భయం, కొంత ఊగిసలాట, మొత్తం మీద నరాలు చిట్లిపోయే ఉత్కంఠ దక్కాయి.

ఈ సన్నివేశంలోనూ కొన్ని నిశ్చల నిశ్చితాలు ఉన్నాయి. కొన్ని అచంచల అస్తిత్వాలు ఉన్నాయి. ఏ డోలాయమానతా లేకుండా, బల్లగుద్ది చెప్పే ఫలితాలు కొన్ని ఉన్నాయి. మొత్తం ఎన్నికల ప్రక్రియలో తమకు తరిగేదే తప్ప ఒరిగేదేమీ ఉండదని ముందే తెలిసిపోయిన నష్టజాతకాలు ఉన్నాయి. దురదృష్టం పట్టిన అటువంటి ఒకానొక పార్టీ బీఆర్ఎస్. ఈ ఎన్నికల్లో గెలిచి అబ్బురపరిచేదీ లేదు, కొత్తగా ఓడేదీ లేదు. మునుపటి ఓటమి మరింతగా విస్తరించడమే తప్ప, కనుచూపు మేరలో ముందడుగు ఉండదు. ఒకటీ అరా గెలిచినా అవి మిగిలేది నమ్మకమూ లేదు. ప్రజలకు బాధ్యతాయుతమైన ప్రతిపక్ష భాగ్యమూ లేదు.


తెలంగాణలో సాధారణ ఎన్నికల తరువాత, బీఆర్ఎస్ రెండో స్థానం నుంచి మూడోస్థానానికి దిగిపోతుంది. ఈ ఎన్నికలు సాధించే ఒకానొక అనివార్య ఫలితం అది. అసెంబ్లీ ఎన్నికలలో సాధించిన గెలుపు కూడా అతి త్వరలోనే మలుపు తిరిగి, అత్యధికంగా ఉన్న తాలూతప్పా తొలగిపోతుంది. కాంగ్రెస్ కొంతా, బీజేపీ కొంతా ఆ పార్టీని కొరుక్కు తింటాయి. ఇంత జరుగుతున్నా, తమను ఓడించి ప్రజలే తప్పు చేశారు అంటూ ఆ పార్టీ నేతలు ఇంకా అహంకరిస్తూనే ఉంటారు, మరోవైపు బీఆర్ఎస్ పరిపాలనలోను, విధానాల్లోనూ చేసిన తప్పులు జనాన్ని భయభ్రాంతులను చేస్తూ ఉంటాయి. రాష్ట్రంలో రెండో స్థానం కోసం ఆరాటంలో, ఫోన్ ట్యాపింగ్ దగ్గర నుంచి లిక్కర్ స్కామ్ దాకా కేసీఆర్ మీద కూడా కేంద్రం ఓ కన్ను వేసి ఉంచుతుంది. వాగ్దానాలను నెరవేర్చడానికి వెసులుబాటు కోసం, విమర్శలను కాచుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పాతనేరాలను చిలవలు పలవలుగా తవ్విపోస్తూనే ఉంటుంది. తన గోతులను తాను బీఆర్ఎస్ చాలా ముందే తవ్వి పెట్టుకుంది.

అట్లాగని, అంతా అయిపోయిందని కాదు. ఉద్యమపార్టీ, ఉద్యమ నేత నాయకత్వం. మంచి వాగ్ధాటి, చతురత కలిగిన తండ్రీకొడుకులు, పుష్టి కలిగిన పార్టీ ఖజానా, సొంత మీడియా, ఉద్యమ కాలం నుంచి కొనసాగుతున్న క్షేత్రస్థాయి కార్యకర్తలు... బీఆర్ఎస్ హంగు చిన్నదేమీ కాదు. ఫక్తు రాజకీయపార్టీగా మార్చుకుని, నైతిక పరిమితులను సడలించుకోవడం వల్ల, నిన్న కాదన్నది నేడు అవుననడం, తాను చేసిన తప్పులు ఇతరులు చేస్తే మాత్రం తప్పు పట్టడం వంటి వెసులుబాట్లు అనేకం ఆ పార్టీకి ఉన్నాయి. పరిస్థితి సానుకూలం కాగానే, తిరిగి పునరుజ్జీవించగల శక్తిసామర్థ్యాలు బీఆర్ఎస్‌కు ఉన్నాయి. ప్రత్యర్థిపార్టీలు ఆ శక్తిని తక్కవ అంచనా వేస్తున్నట్టయితే, అది పెద్ద పొరపాటు.


తెలంగాణ వాదం, సాంస్కృతిక అస్తిత్వం వంటి మాటలను బీఆర్ఎస్ విడిచిపెట్టి ఎంతకాలమైంది? చివరకు, పేరులో కూడా తెలంగాణ లేకుండా చేసుకున్నది. ఉద్యమకారులను బయటకు పంపి, అవకాశవాదులను ఆదరించి, ఆర్జనను ఆదర్శంగా మలచి, తన రాజకీయనిర్మాణాన్నే కాక, తెలంగాణ నీతినే ఆర్థికంగా కలుషితం చేసిపెట్టింది. అయినా కూడా, ఇంగువ కట్టిన గుడ్డ మాదిరిగా, బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్, టీఆర్ఎస్ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ ఉద్యమం స్ఫురించక మానవు. అందుకే, అప్పుడప్పుడు అవసరార్థం ఆ పార్టీ తెలంగాణ వాదాన్ని ఝుళిపించగలుగుతోంది. తాను తెలంగాణ స్ఫూర్తికి భిన్నంగా గతంలో వ్యవహరించి ఉన్నా, సాంస్కృతిక అస్తిత్వాన్ని ఖాతరు చేయకపోయినా, ఇప్పుడు అవే అంశాల మీద కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నది. మనోభావాలపై కలిగే ప్రభావాలను గుర్తించకుండా, కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ గీతం, ముద్రల విషయంలో చూపిస్తున్న తొందరపాటు ధోరణిని ఇప్పుడు బీఆర్ఎస్ చాకచక్యంగా ఉపయోగించుకుంటోంది. బీఆర్ఎస్ పాలన ఆనవాళ్లను తొలగించే ఆత్రుతలో, తెలంగాణ చిహ్నాలమీద గురిపెట్టడం సరికాదని ప్రభుత్వం గుర్తించకపోతే, రాజకీయంగా నష్టపోతుంది. మున్ముందు కూడా, బీఆర్ఎస్ తన మనుగడ కోసం తెలంగాణ వాదాన్ని ఆశ్రయిస్తూ ఉంటుంది. తాను తిరిగి ఊడలు సాచడానికి ఆలంబన చేసుకుంటుంది. జాతీయపార్టీ కాబట్టి, ప్రాంతీయ ఆకాంక్షలను విస్మరించవచ్చునని కాంగ్రెస్ భావిస్తే, బీఆర్ఎస్‌కు అదే ఆసరా అవుతుంది. తెలంగాణవాదానికి ప్రతినిధిగా బీఆర్ఎస్ మాత్రమే కనిపించడం కాంగ్రెస్‌కు కానీ, బీజేపీకి కానీ నష్టదాయకమే.

బీఆర్ఎస్ తన ఉనికికి ఆధారం చేసుకోగలిగే మరో అంశం, తాను ఎక్కడ విఫలమైందో ఆ రంగాల్లో కాంగ్రెస్ వైఫల్యాన్ని నిలదీయడం. నీకేమి అర్హత ఉన్నదని మొదట్లో దాన్ని తిరగకొట్టవచ్చును కానీ, రానురాను, ప్రజల స్మృతిలో బీఆర్ఎస్ వైఫల్యం మసకబారిపోయి, వర్తమానంలోని స్థితే మిగులుతుంది. ప్రభుత్వాన్ని నిలదీసే చర్యలు ఫలితం ఇవ్వాలంటే మాత్రం బీఆర్ఎస్ ఎంతో కొంత నిజాయితీని, వినయాన్ని, పశ్చాత్తాపాన్ని ప్రదర్శించాలి. ప్రజల నుంచి తెలంగాణ సమాజం నుంచి అది మొదటి షరతు.


పరిస్థితి ఎట్లా ఉంది అంటే, బీఆర్ఎస్ ఒక లోక్‌సభ స్థానం గెలుచుకుంటే, ఎవరికీ ఆశ్చర్యం కలగదు. చాలా సర్వేలు ఒక విజయాన్ని ఊహించాయి. నిజానికి ఆ ఒక్కటీ దక్కకున్నా కూడా పెద్ద ఆశ్చర్యం ఉండదు. అసెంబ్లీ ఎన్నికల ఓటమి కొనసాగింపే అని అర్థం చేసుకుంటారు. రెండు స్థానాలు గెలిచే అవకాశాన్ని కూడా ఒకరిద్దరు చెప్పకపోలేదు. రెండు విజయాలు చేకూరితే, బీఆర్ఎస్‌కు పరువు దక్కినట్టే. సీరియస్‌గా కష్టపడిన ఎమ్మెల్సీ ఎన్నికలో కూడా గెలిస్తే ఇక ఉనికికి ఢోకా ఉండదు. వాస్తవానికి, పార్టీలకు ప్రాణాధారాలు ప్రజలతో సంబంధాలు మాత్రమే, ఎన్నికల విజయాలు కావు.

బీఆర్ఎస్ తిరిగి కోలుకోలేనంతగా అణగారిపోవాలని ఎవరూ కోరుకోవడం లేదు. బహుశా రాష్ట్ర కాంగ్రెస్ కూడా అట్లా కోరుకోదు. తన ప్రత్యర్థిగా కాంగ్రెస్ ఉంటే మంచిదని బీజేపీ అనుకుంటే, తన ప్రత్యర్థి బీఆర్ఎస్ అయితేనే మేలు అని కాంగ్రెస్ అనుకుంటుంది. మనసా వాచా నికార్సయిన ప్రాంతీయపార్టీగా పరిణమిస్తే, తెలంగాణ ప్రజలు స్వాగతిస్తారు. అందుకు బీఆర్ఎస్ చాలా కష్టపడాలి. ఎన్నికల తరువాత, ఇతర పార్టీలకు భారీ వలసలు పూర్తయ్యాక, బీఆర్ఎస్ తన అంతర్మథనాన్ని నిజాయితీతో జరుపుకోవాలి. పదేళ్ల కాలంలో జరిగిన పాపాలను మరచిపోయేంతగా తమ ప్రతిష్ఠను ప్రక్షాళనచేసుకోవాలి. అహంకారాన్ని తొలగించుకుని, ప్రజాభాగస్వామ్యాన్ని చేర్చుకుంటే కొంత మెరుగైన బీఆర్ఎస్ సాధ్యపడవచ్చు. అట్లా కాని పక్షంలో, బీఆర్ఎస్ కుదురు నుంచి కొత్త ప్రాంతీయపార్టీ అవతరించాలి. బయట చెల్లచెదురుగా ఇతర పార్టీలలో ఆశ్రయం పొందిన ఉద్యమకారులను కలుపుకుని బలమైన సంస్థగా అవతరించాలి. ప్రాంతీయపార్టీ అన్నది ఒక స్లాట్. అది భర్తీ అయితీరవలసిందే. ఒక బీఆర్ఎస్ కానీ, దాని అంశ కానీ లేకపోతే, తెలంగాణ రాష్ట్రం ప్రాంతీయపార్టీ రహితంగా మారిపోతుంది. ముప్పయ్యేళ్ల కిందటి నుంచి ఉద్యమంగాను, పదేళ్ల నుంచి ప్రత్యేక రాష్ట్రంగాను జరుగుతున్న తెలంగాణ ప్రయాణం నిష్ఫలంగా ముగిసిపోగూడదు.

కె. శ్రీనివాస్

Updated Date - May 30 , 2024 | 01:23 AM