Share News

గాలిమేడలు, ఊహాగానాలు, పీడకలలు

ABN , Publish Date - May 23 , 2024 | 05:34 AM

జూన్ ఒకటిన ఓటు వేసేవారు అదృష్టవంతులు. వాళ్లకు ఆ రోజు సాయంత్రమే దేశవ్యాప్త ఎగ్జిట్ పోల్ ఫలితాలు తెలిసిపోతాయి. ఆ తరువాత ఇంకో మూడు రోజులలో నిజమైన ఫలితాలూ తెలిసిపోతాయి...

గాలిమేడలు, ఊహాగానాలు, పీడకలలు

జూన్ ఒకటిన ఓటు వేసేవారు అదృష్టవంతులు. వాళ్లకు ఆ రోజు సాయంత్రమే దేశవ్యాప్త ఎగ్జిట్ పోల్ ఫలితాలు తెలిసిపోతాయి. ఆ తరువాత ఇంకో మూడు రోజులలో నిజమైన ఫలితాలూ తెలిసిపోతాయి. కానీ, ఏప్రిల్ 19 నాడు పోలింగ్ జరిగినవారికి నలభై ఆరు రోజుల నరకం. తమ మనసు విప్పి, ఈవీఎం నొక్కిన తెలుగు రాష్ట్రాల ఓటర్లకు మే 13 తరువాత ఇరవై మూడు రోజుల ఉత్కంఠ. అభ్యర్థులకు, వారి పార్టీలకు ఒకరకం గుబులు. జనం ఎంపిక ఎట్లా ఉన్నదో అని. ప్రజలకు కూడా అదే గుబులు. తమ ఎంపిక ఏ సామూహిక రూపం తీసుకున్నదో అని.


కౌంటింగ్ దాకా కౌంట్ డౌన్ కాలం జారుడుబండలాగా ఉండదు. నిటారు కొండ మీదికి హైకింగ్ లాగా ఉంటుంది. బరిలోని వస్తాదులనుంచి, కేవలం ఓటేసిన సామాన్యుల దాకా దిగులు, ఆత్రుత, వణుకు, గుండెదడ, చిరాకు, భయం వంటి అనేక మానసిక వికారాలు కమ్ముకుంటాయి. నమ్మకం, ఆశ బలంగా ఉన్నవారు కలల్లో తేలిపోతుంటారు. ప్రచారఘట్టంలోనే పస తేలిపోయినవారు పీడకలల్లో ఓలలాడుతుంటారు. మరి కొందరు ఊహలకు, గణితశస్త్రాన్ని, గణాంకాలను తొడిగి, రకరకాల సంభావ్యతలను ప్రతిపాదిస్తుంటారు. క్రికెట్ క్రీడలో ప్రతి బంతి ప్రయాణానికీ, ప్రతి ఆటగాడి కదలికలకీ భాష్యాలు చెప్పే వ్యాఖ్యాతలలాగా, ఎన్నికల ప్రక్రియలోని ప్రతి కోణాన్నీ రాజకీయ పరిశీలకులు, సెఫాలజిస్టులు, వ్యూహకర్తలు కుంభాకార కటకంలో నుంచి చూపిస్తున్నారు. ఎదురుచూపుల భారాన్ని మోస్తున్న రాజకీయాసక్తులకు శ్రమ తెలియకుండా నిత్యం కొత్త కథలు చెబుతున్నారు. మరో వైపు మరి కొందరు ముసళ్ల పండగ జూన్ 4 తరువాత ఉందని భయపెడుతున్నారు.

దేశం మీదకు రెండు సంఖ్యలను వదిలి, ప్రత్యర్థులను వాటి మాయలోకి పడేసింది బీజేపీ. అవి 400, 370. గెలుపు ముందే ఖరారు అనీ, సంఖ్య మాత్రమే తేలవలసి ఉన్నదన్న అభిప్రాయాన్ని అవి కలిగించాయి. ఆ తరువాత నెమ్మదిగా, 220, 250, 260, 268 వంటి సంఖ్యలు కూడా ప్రవేశించి, వాతావరణాన్ని వేడెక్కించాయి. యథాతథవాదులు కొందరు 303 సంఖ్య అటూఇటూగా కొనసాగుతుందని, ఇదే ప్రభుత్వం, ఇదే మోదీ మూడోసారి పాలిస్తారని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఇప్పుడున్నంత బలమే, కొంత చేర్పుతో, కొనసాగితే, అందులో రసవత్తరమైన ఊహలకు ఆస్కారం ఎక్కడుంది? అందుకని, బీజేపీ మెజారిటీకి ఆమడ దూరంలో ఉంటుందని, మిత్రుల సాయంతో గట్టుక్కుతుందని కొందరు ధైర్యంగా వేస్తున్న లెక్కలు, ఎన్నికల అనంతరం కొత్త సన్నివేశాల జోస్యానికి వీలు కల్పిస్తున్నాయి. మెజారిటీ తగ్గితే మోదీయే నేతగా ఉంటారా? ప్రభ తగ్గిన నాయకత్వంలో కొనసాగడానికి ఆయన ఇష్టపడతారా? బీజేపీలో అనంతర నేతలు పోటీపడరా? మద్దతు ఇచ్చే మిత్రపక్షాలు తమకు ఆమోదమయ్యే నేత కోసం పట్టుబట్టే అవకాశం ఉంటుందా? అడగాలే కానీ అనేక ప్రశ్నలు!


నరేంద్రమోదీ ఓడిపోతారని గానీ, కనీసం బలహీనపడతారని గానీ నమ్మడానికి, ఆయన విమర్శకులలో కూడా అత్యధికులు సంకోచిస్తారు. ఆయన ఇంకా ఇంకా బలపడతారని, తాను అనుకున్న లక్ష్యాలను నిర్దాక్షిణ్యంగా సాధిస్తారని కూడా వారు విశ్వసిస్తారు. ఎంతో కొంత వ్యతిరేకత వ్యక్తమవుతున్నదన్న సూచనలు కనిపిస్తున్నా, ప్రతికూలతల మీదనే వారి దృష్టి ఉంటుంది. బాధితులు కాగలిగిన దుర్బలులకు ఆ నిస్పృహ అధికం. భారతదేశంలో నెలకొన్న సామాజిక, రాజకీయ వాతావరణం మీద తీవ్రంగా కలవరపడే ఒక సామాజిక మాధ్యమాల మిత్రుడు, ఈ మధ్య మోదీ చేసిన ఒక హెచ్చరికకు బాగా బెదిరిపోయారు. తాను తిరిగి అధికారంలోకి వచ్చిన తరువాత, అవినీతిపరులను జీవితాంతం జైళ్లలో మగ్గేట్టు చేస్తానని మోదీ మొన్న ఆదివారం నాడు ఒక బెంగాల్ సభలో అన్నారు. దాన్ని హెచ్చరికగా కాదు. గ్యారంటీ కింద చెప్పారు. మోదీ పాలనలో రాజకీయప్రత్యర్థుల మీదనే అన్నిరకాల అభియోగాలూ మోపుతారన్న అభిప్రాయం నేపథ్యంలో, ఆ గ్యారంటీ ప్రజాజీవితంలో స్వతంత్ర భావాలతో ఉండేవారూ కలవరపడదగినదే. నరేంద్రమోదీ ప్రాభవం తగ్గుముఖంలో ఉన్నది కానీ, ఈ సారికి ఆయనే నెగ్గుతాడని నిలకడగా వాదిస్తున్న ప్రశాంత్ కిశోర్ కూడా మూడో దఫా పాలన గురించి భయం కలిగించే అంచనాలే ఇచ్చారు. మళ్లీ అధికారంలోకి వచ్చాక, ఇంతకాలం అనుసరిస్తున్న విధానాలనే మోదీ మరింత తీవ్రంగా కొనసాగిస్తారని, వనరులను అధికారాలను కేంద్రీకృతం చేస్తారని, ఆర్థిక అంతరాలు పెరుగుతాయని, రాష్ట్రాల అధికారాలు మరింతగా క్షీణిస్తాయని, ప్రజల ప్రతిఘటన పెరుగుతుందని భవిష్యత్ చిత్రపటాన్ని ఆవిష్కరించారు. ఆర్థికవేత్త, సామాజిక రాజకీయ వ్యాఖ్యాత పరకాల ప్రభాకర్, ఈ మధ్య అనేక ఇంటర్వ్యూలలో మరోసారి మోదీ ప్రభుత్వం వస్తే ఎంతటి విధ్వంసానికి కారణమవుతుందో హెచ్చరిస్తున్నారు. మణిపూర్ లాంటి పరిస్థితి అన్ని రాష్ట్రాలలో ఏర్పడుతుందని, అక్కడక్కడ జరుగుతున్న మూకదాడులు అధికారికంగానే జరుగుతాయని ఆయన చెబుతున్నారు.


అవయ్ శుక్లా అని ఒక పూర్వ ఐఏఎస్ అధికారి బ్లాగుల ద్వారా, ఇతర మాధ్యమాల ద్వారా రాజకీయాలపై వ్యాఖ్యానిస్తుంటారు. ఆయన తాజా వ్యాసం చదివితే, కొత్త భయానుమానాలు ముంచెత్తుతాయి. కొందరు చెబుతున్నట్టు, లేదా, ఆశపడుతున్నట్టు, తాను అధికారంలోకి వచ్చే విధంగా ఫలితాలు లేకపోతే, నరేంద్రమోదీ అధికారాన్ని విజేతలకు అప్పగించి నిష్క్రమిస్తారా? అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్ మొదలుకొని, నిఘావ్యవస్థలు, భద్రతాయంత్రాంగం, దర్యాప్తు సంస్థలు ప్రభుత్వానికి పరిచారకులుగా మారిన పరిస్థితులలో, అలవాటుపడిన అధికారాన్ని నాయకుడు వదులుకుంటారా? ఎమర్జెన్సీ అనంతరం ఎన్నికలలో ఓడిపోయిన ఇందిరాగాంధీ 1977లో చేసినట్టు, నరేంద్రమోదీ అధికారాన్ని వదులుకుంటారా? అని శుక్లా సందేహం. సుప్రీంకోర్టు, రాష్ట్రపతి.. ఈ రెండు వ్యవస్థలు దృఢంగా ఉంటే ప్రజల తీర్పు అమలుకు అవరోధాలు ఉండవని, కానీ, ఆ దృఢత్వం మీద తనకు విశ్వాసం కలగడం లేదని ఆయన అన్నారు. ఎన్నికల ఫలితాల తరువాత ప్రజల బాధ్యత ముగిసిపోవడం లేదు, ఇదే పాలన కొనసాగితే, ప్రతిఘటించవలసిన అంశాలు పెరగడం ఒక పార్శ్వం. ఒకవేళ, మార్పును కోరే తీర్పు వస్తే, అది అమలు జరిగేట్టు చూడవలసి రావడం మరో పార్శ్వం.

మోదీ ప్రభుత్వానికి ఎదురుగాలి వీస్తున్నదని తీవ్ర ఆశావాదంతో చెబుతున్నవారిని పక్కనపెట్టినా, ఈ సారి ఖాయంగా మోదీదే ప్రభుత్వం అని చెబుతున్నవారు కూడా పరిస్థితిలో ఒక ముఖ్యమైన మార్పును సూచిస్తున్నారు. ఈ సారి కేంద్రంలో అధికారపార్టీ బాహుబలి పార్టీగా ఉండబోదు. అక్కడా ఇక్కడా బలాన్ని సమీకరించుకుని ముందుకు వెళ్లవలసిన స్థితిలో ఉంటుంది.. దాని వల్ల పరిపాలనలో తీవ్రత తగ్గుతుందని చెప్పలేం కానీ, ప్రజలకు ఉద్యమించే శక్తి పెరుగుతుంది. మొత్తానికి 2029 దాకా గడిచే కాలం, సంక్లిష్టంగా, సంరంభంగా, ఉద్రిక్తంగా ఉండబోతున్నది.


***

ఒక పార్టీకి తిరుగులేని మెజారిటీ వస్తే, ఒకటే సంభావ్యత. కానీ, కూటమిలోని మిత్రుల సహకారంతో మాత్రమే అధికారం సాధ్యపడితే, అది వేరే సన్నివేశం. ఎన్‌డీఏ కూటమిలో మళ్లీ చేరిన తెలుగుదేశంపార్టీ, తనమిత్రపక్షాలతో సహా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఘనవిజయం సాధించబోతున్నదన్న టాక్ సర్వత్రా వ్యాపించింది. మరి బీజేపీకి మునుపటిలా సొంతబలం లేక, కూటమి మిత్రుల బలంపై ఆధారపడేపరిస్థితి వస్తే? రాష్ట్రంలో అధికారంలోకి రావడమే కాకుండా, జాతీయస్థాయిలో కూడా చంద్రబాబుకు ప్రాధాన్యం పెరిగితే? ఈ చర్చ కూడా తెలుగుదేశం అభిమానులలోనే కాక, ఇతరులలో కూడా జరుగుతోంది. 2014 లాంటి ఎన్డీయే కాక, 1999 నాటి ఎన్డీయే ప్రభుత్వం వస్తే మెరుగని, మిత్రపక్షాలకు అందులో మెరుగైన భాగస్వామ్యం ఉంటుందని, రాష్ట్రానికి కావలసిన నిధులను, హోదాలను సంపాదించుకోవడానికి అవకాశాలు పెరుగుతాయని ఆంధ్రప్రదేశ్ శ్రేయోభిలాషులు మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ, మోదీ కేంద్రంలో అధికారంలోకి రాకుండా, కూటమి ఆంధ్రప్రదేశ్‌లో అధికారం సాధిస్తే అప్పుడు పరిస్థితి ఎట్లా ఉంటుందన్న చర్చ కూడా వినిపిస్తోంది.

ఇటువంటి ఊహాగానాల మధ్య భారత రాష్ట్రసమితి పేరు ఎక్కడా వినిపించకపోవడం విచారకరమైన పరిణామం. నిజానికి ఇది టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ స్వయంకృతం. ఏ ప్రమాదాన్ని, ఏ ప్రయోజనాన్ని చూసి 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లారో గానీ, దానివల్ల సమకూరిన అదనపు లాభమేమీ లేదు. అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికలు తెలంగాణలో వేరయ్యాయి. 2024లోనే లోక్‌సభ ఎన్నికలతో పాటు, అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగి ఉంటే, రాష్ట్రప్రభుత్వం ఎట్లాగూ చేజారినా, అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న నిష్పత్తిలో ఎంపీ స్థానాలు గెలిచే అవకాశం ఉండేది. అసెంబ్లీ ఎన్నికలు ముందే జరగడం వల్ల, అప్పుడు బీఆర్ఎస్‌కు పడిన ఓటు ఇప్పుడు చెదిరిపోయి, పార్టీ మూడోస్థానానికి దిగే పరిస్థితి ఏర్పడింది. ఆరేడు ఎంపీ స్థానాలు గెలుచుకుని ఉంటే, కేసీఆర్ ప్రధాని కాలేకపోయినా, ఢిల్లీలో ఒక చిన్నచక్రమైనా తిప్పే అవకాశం ఉండేది.

కె. శ్రీనివాస్

Updated Date - May 23 , 2024 | 05:34 AM