మనుషులం కదా, ముద్రలూ మూసలూ ఎందుకు?
ABN , Publish Date - Sep 05 , 2024 | 02:02 AM
నేను అన్నది ఎంతటి సంఖ్యతో సమానం? లక్షలమంది, కోట్లమంది గురించి లెక్కవేస్తున్నప్పుడు కూడా, ‘నేను’ పక్కన వేసే విలువ ఎంత? నేను అన్నది ఉనికి. ఆ ఉనికిలో నుంచి సమస్త ప్రపంచం, జీవితం వ్యక్తమవుతుంది. కనీసం తనవరకు అయినా...
నేను అన్నది ఎంతటి సంఖ్యతో సమానం? లక్షలమంది, కోట్లమంది గురించి లెక్కవేస్తున్నప్పుడు కూడా, ‘నేను’ పక్కన వేసే విలువ ఎంత? నేను అన్నది ఉనికి. ఆ ఉనికిలో నుంచి సమస్త ప్రపంచం, జీవితం వ్యక్తమవుతుంది. కనీసం తనవరకు అయినా ‘నేను’తోనే అంతా పుడుతుంది, అంతా అంతమవుతుంది. అటువంటప్పుడు, తనని తాను కేవలం ఒకటిగా లెక్కించుకుని, పెద్ద అంకె ముందు తనను తక్కువ చేసుకోవడం ఎంత కష్టం? ఇతరులను కాపాడడానికి సాహసం చేయడం సరే, అందుకు సిద్ధపడినప్పుడు తనకు తాను చెప్పుకున్న సమర్థన, అనేక ఇతర ప్రాణాల ముందు తానొక్కడే కదా? ప్రాణాలకు తెగించినందుకే కాదు, ‘నేను’ను జయించిన ఈ సమర్థన వల్ల కూడా సుభాన్ మనందరి ఆరాధనలకు అర్హుడు.
ఒక ఉదాత్తమైన మానవీయత తారసపడినప్పుడు, దైనందిన అల్పత్వం నుంచి ఉద్ధరింపు దొరికిన తన్మయ భావన కలుగుతుంది. ఆ క్షణాలను కూడా కలుషితం చేయడానికి కావలసినంత కల్మషం సమాజంలో యథావిధిగా ప్రవహిస్తూనే ఉంటుంది. సుభాన్ మతం గురించిన ప్రస్తావన అటువంటిదే. అతను ముస్లిమ్ కావడాన్ని ఒకరు ఎక్కువచేసినా, మరొకరు తక్కువ చేసినా, అందులో విషాదం తప్ప మరేమీ లేదు. సుభాన్ స్థానంలో ఒక శంకర్ కూడా ఉండి ఉండవచ్చు అతను కూడా మరొక సమర్థనతో ప్రాణాలకు తెగించి ఉండేవాడేమో? మంచితనం ఏ మతస్థులకూ గుత్త సొత్తు కాదు, చెడ్డ తనం కూడా అంతే. నేరగాళ్లు, ఉత్తములు ఏ గుర్తింపునకు చెందినవారయినా, ఆ గుర్తింపు సమూహమంతా నేరస్థులూ కాదు, నీతివంతులూ కాదు. సమాజంలో తమ, పర భేదాలను తీవ్రంగా విస్తరింపజేసేవారికి, పరులు మంచిపని చేసినప్పుడు అప్రియంగా ఉంటుంది. పరులకు ‘మంచి’ పేరు వస్తుందన్న ఉక్రోషం ఉంటుంది. సమాజంలో సహజీవన సంస్కృతి కోరుకునేవారికి మాత్రం ఇటువంటి ఉదంతాలు జరిగినప్పుడు పండగే. వారిది ఒక నిస్సహాయ స్థితి. ‘పరులు’గా చిత్రితమయ్యేవారు కూడా మంచివారే అని చెప్పగలిగే ఉదాహరణలు ఇట్లా రూపొందుతూ ఉండాలి, వారికి. అందరూ, కనీసం శ్రమజీవులందరూ, లోలోపల, సారాంశంలో, పదిమంది కోసం, పదిమందితో నిలబడేవారే అని సుభాన్ సాహసం చెబుతున్నది. అంతిమంగా, మనుషులలో ఉండే ఏకసూత్రతను, ఏకరూపతను చాటిచెబుతూ, ఒక సముదాయాన్ని, జనశ్రేణిని మూకుమ్మడిగా ఇతరులుగా, పరులుగా చిత్రించే ద్వేషవైఖరిని పరాజితం చేస్తున్నది. కానీ, ఈ విలువను నిరూపించడం కోసం, మంచివారిగా, త్యాగజీవులుగా ఉండే నిర్బంధ భారాన్ని ఆ ‘పరులు’ మోయవలసి రావడం విచారం కలిగిస్తుంది. ఎంత మంచితనాన్ని కుమ్మరిస్తే, నిర్మించి నిర్మించి వదిలిన రాక్షసముద్రలు తొలగిపోతాయి?
ప్రాణాపాయ పరిస్థితుల్లో ఆపద్బాంధవుల్లాగా వచ్చే ధీరోదాత్తులు కొందరున్నట్టే, తామనుకున్న ధర్మాన్ని రక్షించడానికి ప్రాణాలు తీయగలిగేవారు కూడా కొందరు ఉంటారు. వారిలో గోరక్షకులమంటూ ఆయుధాలతో సంచరించేవారు కూడా కొందరుంటారు. వారికి గోవుల రక్షణ ముఖ్యం. అందుకోసం స్వచ్ఛంద సైనికుల్లాగా, ఎక్కడెక్కడ పశువుల రవాణా జరుగుతుందో, ఎవరెవరు పశుమాంసం తింటూ ఉంటారో నిఘావేసి పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. పట్టుకునే క్రమంలో, ఆగ్రహం ప్రకటించే క్రమంలో మనుషుల ప్రాణాలను తీయడానికి కూడా వారు వెనుకాడరు. చట్టాలను కూడా ఖాతరు చేయని గాఢమైన విశ్వాసం వారిది. హర్యానాలో పోయిన సంవత్సరం పశువుల రవాణాదార్లు అన్న అనుమానంతో ఇద్దరిని వారి వాహనంతో సహా దహనం చేయడం, అనంతరం జరిగిన హింసాకాండ తెలిసిందే. పరిస్థితి ఏమీ మారలేదు. ఈ ఆగస్ట్ నెలాఖరులో పాత సామాన్లు అమ్మి బతికే ఒక వలస కార్మికుడిని ఈ గోరక్షకులు చంపేశారు. అతను బెంగాల్ నుంచి వచ్చాడు. బీఫ్ తిన్నాడని అతని మీద అభియోగం. ఈ సంఘటన మీద నిరసనలు వినిపించినప్పుడు, హర్యానా ముఖ్యమంత్రి నాయబ్‌సింగ్ సైని దిగ్భ్రాంతికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆవులంటే వాళ్లకు అంతటి భక్తి, వాళ్లను ఎవరు ఆపగలరు?’’ అన్నాడాయన. ఇటువంటివి జరగకూడదు, ఇటువంటివి చేయకండి, అని కూడా అన్నారు తప్ప, చేసినవారిని చట్టం ఉపేక్షించదన్న మాట అనలేదు. ఆ ఘాతుకం సరే, దానికి మించి బాధ కలిగించే అంశం, ఆ హత్య చేసినవారిలో ఇద్దరు మైనర్లు ఉండడం. ఎటువంటి తరం తయారవుతోందన్న బాధ కలుగుతుంది. బీజేపీ దట్టిస్తున్న ఆవేశాల వల్లనే ఇటువంటివి జరుగుతున్నాయని టీఎంసీ నాయకురాలు మహువా మొయిత్రా అన్నారు కానీ, బీజేపీ నేతలందరూ సైనీ లాగా మాట్లాడలేదు. ‘‘ఇదేమి అన్యాయం? ఇందులో గోరక్షణ ఏముంది? ఇది మానవత్వానికే అవమానం, పోలీసులు కఠినచర్య తీసుకోవాలి’’ అన్నారు బీజేపీ ఎంపీ ధరంబీర్‌సింగ్. చూపు పూర్తిగా కలుషితం కాని రాజకీయవాదులు లేకపోలేదు. ఈ సంఘటనలో హతుడు నిరుపేద. అతని మతమేమిటో స్పష్టంగా తెలుసును. అతను బీఫ్ తిన్నాడో లేదో కానీ, తినడానికి ఆస్కారమున్న పుట్టుకే అతన్ని చంపడానికి కావలసిన ఆధారం. అతన్ని ఒక మనిషిగా, అతనిది ఒక ప్రాణంగా చూడడానికి ఆ పుట్టుకే ఒక అవరోధం.
భారతదేశంలో గోవులను మాంసానికి కానీ, ఇతర అవసరాలకు కానీ వధించడాన్ని నిరోధించడం పెద్ద కష్టమేమీ కాదు. ప్రయత్నిస్తే, అందుకు సామరస్యంతో జనాభిప్రాయాన్ని కూడగట్టడమూ అసాధ్యం కాదు. కానీ, ఇక్కడ సామరస్యమూ, పరిష్కారమూ ముఖ్యం కావు. సమస్య, ఘర్షణా కొనసాగడమే వారికి ప్రయోజనకరం. నిజానికి, సమస్య మూలకారణాలలోకి వెడితే, పరిస్థితి కొంత అర్థమవుతుంది. గోవులను నిర్వహించడం రైతాంగానికి అసాధ్యమైన పరిస్థితి ఏర్పడింది. పశువులతో కూడిన వ్యవసాయం బాగా జరిగే రోజుల్లో కూడా, శ్రమచేయలేని, పాలివ్వలేని పశువులను రైతులు విక్రయించేవారు. సంక్షోభంలో ఉన్న రైతాంగమే గోవులను అమ్ముతున్నది. కబేళాలు కొంటున్నాయి. పశుమాంసాన్ని ఇతర దేశాలకు ఎగుమతిచేసే పెద్ద పెద్ద కబేళాలేవీ బీఫ్ భక్షక సామాజిక, మతవర్గాలకు చెందినవి కావు. ఈ రెండు చోట్లా గోరక్షకులు ఏ కార్యక్రమమూ తీసుకోరు. పశుమాంసం ఎగుమతిని నిషేధించమని, కబేళాలు మూసివేయమని వారెప్పుడూ ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయరు. తరలింపులు చేసి పొట్టపోసుకునే వారి మీద మాత్రం దాడులు చేస్తారు. మాంసం తీసుకుపోయేవారిని అనుమానిస్తారు. కారణాలు పెద్ద ఆశ్చర్యకరమైనవేమీ కావు. ముద్రలే ముఖ్యం. ముద్రల సహాయంతో చేయగలిగే సమీకరణలు ముఖ్యం.
మనుషుల మీద పడే ముద్రలు, ఒక్కోసారి ఆ ముద్రల నుంచి రక్షణ ఉన్నవారిని కూడా బలితీసుకుంటాయి. ఆగస్టు నెలలోనే హర్యానాలో ఒకచోట పశువులను ఎస్యువి వాహనంలో తరలిస్తున్నారన్న సమాచారం తెలిసి, గోరక్షక బృందం మాటువేసింది. ఆ సమయంలో ఎదురైన ఒక వాహనాన్ని అడ్డగించబోతే, లోపల ఉన్నవారు బెదిరిపోయి, వేగం పెంచి పారిపోవడానికి ప్రయత్నించారు. దానితో గోరక్షకులు తుపాకితో కాల్పులు జరిపారు. ఆ ఘటనలో వాహనంలో ఉన్న 12వ తరగతి విద్యార్థి ఆర్యన్ మిశ్రా చనిపోయాడు. బహుశా, ఆ సమయంలో వాహనంలోని వారిని ‘గుర్తించడానికి’ గోరక్షకులకు వీలుకాలేదో, రూపురేఖలు అందుకు అవకాశం ఇవ్వలేదో? అనుమానితులు, అమాయకులు అందరూ ఒకేరకంగా కనిపించడంలోని ‘శారీరక’ సారూప్యత ఒక్కోసారి హంతకుల చేత ‘పొరపాటు’ చేయిస్తుంది. భారతదేశపు ముఖాలలో ఇంకా మతవిభజన జరగలేదు. తరలింపుదారులు వీరే అనుకుని పొరపడ్డామని హంతకులు చెబుతున్నారు తప్ప, తాము చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని తుపాకులతో వీధుల్లోకి రావడం తప్పని అనుకోవడం లేదు. ఈ రెండో వరుస సంఘటన తరువాత కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిలో పెద్ద కదలిక లేదు. రెండు రోజుల కిందట మహారాష్ట్రలో కూడా ఒక ముసలాయనను రైల్లో ఒక గుంపు కిందకు తోసేసినంత పనిచేసింది. ఆయన దగ్గర గోమాంసం ఉన్నదని అనుమానం. అటువంటి ఘటనలు సాధారణమైపోయాయి. కానీ, ఆ గుంపు ఎవరు? పోలీసు ఉద్యోగానికి అర్హత పరీక్ష రాయడానికి వెడుతున్న ఉద్యోగార్థులట! రేపు వాళ్లు పోలీసులైతే, న్యాయం ఎట్లా ఉంటుందో?
ఈ సంఘటనల్లో మృత్యువు కంటె, హింస కంటె, దేశవ్యాప్తంగా అది వ్యాపింపజేసే భయమూ పరాయితనమే ఎక్కువ బాధిస్తుంది. అంతో ఇంతో సఖ్యత సహజీవనం ఉన్న దక్షిణాదిలో కూడా, విభజనరేఖలు వెలుస్తున్నాయి. మంచిచెడ్డలను చట్టం కాక, విశ్వాసాలు నిర్వచించి అమలుచేస్తున్నాయి. మూసలను బట్టి, ముద్రలను బట్టి మనుగడలు నిర్ణయం అవుతున్నాయి. విభజనల మీద ఆధారపడి రాజకీయార్థిక పరమార్థాలు చెలరేగిపోతున్నాయి!
కొత్త ఆలోచనలు లేకపోవడం ఎవరికైనా అవలక్షణం మాత్రమే, కానీ, బలశాలికీ, పెత్తందారుకీ భావదారిద్ర్యం ఉంటే మాత్రం అది మహా ప్రమాదకరం. ఒకసారి విఫలం అయ్యాక, జనం నీలో చెడు చూడడం మొదలుపెట్టారని తెలిశాక, ఆ గ్రహింపు తెచ్చుకోవడమే మొదట చేయవలసినది. అప్పుడు దిద్దుబాటు కోసం అన్వేషించాలి. అయితే, తప్పులను గుర్తించి దారి సరిచేసుకోవాలి లేదా, కొత్తదారులను వెదుకుతూ ప్రజల సమ్మతిని గెలుచుకోవాలి. ఈ రెండూ చేతకాక, తనకు తెలిసింది ఒకే విద్య, దాన్ని మాత్రమే పదే పదే ప్రయోగిస్తాను, మరింత బలంగా, మరింత తీవ్రంగా ఉపయోగిస్తాను అనుకునే శక్తులు, బహుశా, తమ శూన్యబుద్ధుల కారణంగానే పతనాన్ని చవిచూస్తారు.
హర్యానా, మహారాష్ట్ర రెండూ త్వరలో ఎన్నికలకు వెడుతున్న రాష్ట్రాలు. ద్వేషాలను మరింతగా పెంచి లాభపడదామనుకునే రాజకీయాలు గెలుస్తాయా, విసిగి వేసారి లోగుట్టు అర్థం చేసుకున్న ప్రజలు గెలుస్తారా అన్నది చూడాలి.
కె. శ్రీనివాస్