వీళ్లు నీతులు మాట్లాడినప్పుడు నవ్వులే నవ్వులు!
ABN , Publish Date - Sep 12 , 2024 | 01:06 AM
నిజమో కాదో కానీ, శ్రీనాథుడికి ఆపాదించి చెబుతారీ కథ. ఒక రాజుని కలవడానికి వెళ్లినప్పుడు, అసూయపడిన ఆస్థానపండితులు అతన్ని దెబ్బతీయాలని ఒక సమస్య ఇచ్చి పద్యంలో పూరించమన్నారట. ‘‘అందఱు నందఱే మఱియు నందఱు నందఱె యంద ఱందఱే’’...
నిజమో కాదో కానీ, శ్రీనాథుడికి ఆపాదించి చెబుతారీ కథ. ఒక రాజుని కలవడానికి వెళ్లినప్పుడు, అసూయపడిన ఆస్థానపండితులు అతన్ని దెబ్బతీయాలని ఒక సమస్య ఇచ్చి పద్యంలో పూరించమన్నారట. ‘‘అందఱు నందఱే మఱియు నందఱు నందఱె యంద ఱందఱే’’ అన్నది సమస్య, ఆ సభికుల మీదనే పద్యం చెప్పాలి. అప్పుడా కవిగారు ‘‘కొందఱు భైరవాశ్వములు, కొందఱు పార్థుని తేరి టెక్కెముల్, కొందఱు ప్రాక్కిటీశ్వరులు, కొందఱు కాలుని యెక్కిరింతలున్, కొందఱు కృష్ణ జన్మమునం గూసిన ధన్యులు నీ సదస్సులో నందరు నందరే మరియు...’’ అని పద్యం చెప్పారట. దానితో చిన్నబుచ్చాలనుకున్నవారే చిన్నబోయారట. ఇంతకీ, అందరూ అందరే అయిన ఆ సభికులను ఏమని వర్ణించాడు శ్రీనాథుడు? ‘‘కొందరు కుక్కలు, కొందరు కోతులు, కొందరు పందులు, కొందరు దున్నపోతులు, కొందరు గాడిదలు, ఎవరు మాత్రం తక్కువ? అందరూ అందరే, అందరందరే..’’ అని పద్యం కట్టాడు. కాకపోతే, ఆ జంతుజాలం పేర్లను పచ్చిగా కాకుండా, వాటి వాటి పౌరాణిక పాత్రలను, అందమైన మాటల పొట్లంలో చుట్టి చెప్పాడు. స్తుతినింద అన్నమాట.
మంచి అయినా, చెడు అయినా, ఎక్కువా తక్కువా కాకుండా, గుంపులోని అందరికీ; ఒకే రకమైన లక్షణాలుంటే అప్పుడు ‘‘అందరూ అందరే’’ అంటాం. మంచితనం కలిగిన అనేకమందిని ఒకేచోట చూడగలిగే అవకాశాలు అతి తక్కువ. ప్రస్తుత రాజకీయ రంగస్థలాన్ని చూసినప్పుడు మాత్రం, అందరూ అందరే అనిపిస్తే అందుకు బాధ్యత మనది కాదు. శ్రీనాథుడిలాగా కష్టపడి, మభ్యపెట్టే అవసరం కూడా లేదు. అట్లాగని, నేరుగా పోలిస్తే, భైరవుడి గుర్రాలకు, యమధర్మరాజు వాహనాలకు మనోభావాలు దెబ్బతింటాయి.
చిట్టచివరకు పిల్లి మెడలో న్యాయరంగం గంట కట్టింది. పిల్లి ఎవరు అన్న విచికిత్స మంచిది కాదు కానీ, ఫిరాయింపుల చెలామణీకి, అధికార పార్టీలకు అందుతున్న సహకారానికి ఇప్పుడు ఇబ్బంది ఏర్పడింది. రాజ్యాంగ విహిత కర్తవ్యాలను నెరవేర్చడానికి అన్ని రాజ్యాంగ వ్యవస్థలు లోబడి ఉండాలని, సభాపతులు ఫిరాయింపుల ఫిర్యాదుల మీద నిర్ణయం తీసుకోవడానికి నిరవధికమైన గడువు ఉండకూడదని తెలంగాణ హైకోర్టు అభిప్రాయపడింది. ఈ కీలకమయిన తీర్పు ఇవ్వడానికి ముందు మునుపు సుప్రీంకోర్టు రెండు సందర్భాలలో చెప్పిన తీర్పులు నేపథ్యంగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ముగ్గురు ప్రతిపక్ష సభ్యుల ఫిరాయింపు ఈ వ్యాజ్యానికి సందర్భం.
ఈ తీర్పు చాలా కీలకమైనది. సభాపతికి ఉన్న ప్రత్యేక ప్రతిపత్తి, నియమాలలో ఉన్న కొంత అస్పష్టత కారణంగా ఫిరాయింపులకు ఏర్పడుతున్న సానుకూలతను తొలగించే న్యాయనిర్ణయం ఇది. ఫిరాయింపుల చట్టానికి ప్రాతిపదికలుగా ఉన్న రాజ్యాంగ, ప్రజాస్వామిక విలువలను బలపరచే తీర్పు ఇది. అయితే, ఒక కీలకమైన ప్రశ్న!
ఎవరికి కావాలి ఈ తీర్పు? ఫిరాయింపులకు శాశ్వతంగా నిరోధం ఏర్పడాలని ఎవరు కోరుకుంటున్నారు? ప్రజాస్వామ్యం మీద అంతటి ప్రేమ ఎవరికి వెల్లువెత్తుతున్నది?
ప్రస్తుత కేసులో అయితే కాంగ్రెస్ పార్టీయే ముద్దాయి. ఈ కేసులో నిర్ణయం ఆ పార్టీకి వ్యతిరేకంగా వచ్చిందనే భావించాలి. పిటిషన్‌దారులు బీఆర్ఎస్‌కు చెందినవారు. ఆ పార్టీ ఈ వ్యాజ్యంలో బాధితురాలు. ప్రస్తుత తీర్పు ఆ పార్టీకి విజయం. ఈ రాజకీయ జయాపజయాలు, ఇప్పటికి, ఈ సందర్భానికి మాత్రమే పరిమితం. నిన్న లేవు. రేపు ఉండవు.
తాము ఫిరాయింపులను ఆహ్వానించకుంటే, ప్రతిపక్షమే తమ నుంచి సభ్యులను లాగికొని, ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రమాదం ఉన్నదని కాంగ్రెస్ చెబుతుంది. తన ప్రభుత్వాన్ని, విధానాలను స్థిరపరచుకోవడానికి తనకు నాలుగు అదనపు సీట్లు దొరికితే బాగుంటుందని ఆ పార్టీ అనుకుంటుంది. కాంగ్రెస్ కారణాలతో తెలంగాణ సమాజానికి ఏమి నిమిత్తం? రాజ్యాంగ వ్యవస్థల దృష్టిలో ఆ కారణాలకేమి విలువ ఉంది? కాంగ్రెస్‌కు తెలంగాణ సమాజం 64 సీట్లే ఇచ్చింది. ఆ సీట్లతోనే తనకు అధికారమూ వచ్చింది. అది బొటాబొటి మెజారిటీ కదా అంటే, ప్రజలు అంతవరకే ప్రసాదించారు. బీఆర్ఎస్‌కు 38 సీట్లు ఇచ్చి ప్రతిపక్షంగా వ్యవహరించమన్నారు. ప్రతిపక్షబాధ్యత నిర్వహించవలసిన శాసనసభ్యులు అధికారపక్షానికి మారడం కానీ, అధికారపక్షం దాన్ని ప్రోత్సహించడం కానీ, ప్రజాస్వామ్యం రూల్‌బుక్‌లో లేవు. బీజేపీ తాను ఫిరాయింపులకు వ్యతిరేకమని, రాజీనామాలు చేసి రావాలని చెబుతుంది కానీ, సాంకేతికమైన నియమాలను పాటించి, సారాంశంలో పెద్ద అభ్యంతరం లేనట్టే వ్యవహరిస్తుంది. అనధికార పార్టీ సభ్యులుగా ఎందరినో చేర్చుకున్న ఉదంతాలున్నాయి.
సభాపతుల సహకారం అధికారపార్టీలకు విశ్వాసపరీక్షల వంటి కీలకసమయాల్లో మాత్రమే అవసరం ఉండేది. గత రెండు దశాబ్దాలుగా, ఫిరాయింపుల నిర్వహణలో కూడా వారి చేదోడు కావలసివస్తోంది. ఫిరాయింపు ఫిర్యాదుల మీద కానీ, ఫిరాయింపు సభ్యుడి రాజీనామా మీద నిర్ణయం తీసుకోవడానికి గానీ ఇదమిత్థమైన గడువు అంటూ ఏదీ లేకపోవడం వల్ల, సభాకాలమంతా ఫిరాయింపుదారుడు సభ్యుడిగా కొనసాగే అవకాశం ఏర్పడుతున్నది. ఆ అవకాశాన్ని వినియోగించుకోని అధికారపార్టీ లేదు. ఇప్పుడు ఈ కేసులో కోర్టుకు వెళ్లిన బీఆర్ఎస్ కూడా ఈ ఫిరాయింపు శాస్త్రంలో పిహెచ్‌డి చేసింది.
తెలంగాణ హైకోర్టు తీర్పు మీద బీఆర్ఎస్ చేస్తున్న హంగామా, విలువల ఉద్ఘాటనలు చూస్తుంటే, ‘ఔరా, కలికాలము!’ అనిపిస్తుంది. వేదాలు, దెయ్యాలు వంటి పోలికలన్నీ పాతపడిపోయాయి కానీ, నైతికధనార్జన గురించి అదానీ, నిరాడంబరత గురించి అంబానీ మాట్లాడినట్టు ఉంటోంది. ఫిరాయింపు సభ్యుడిని మంత్రిని చేసి, సభాకాలం ముగిసేదాకా నడిపించిన చరిత్ర కదా బీఆర్ఎస్‌ది! నిజానికి, కేసీఆర్‌ని, ఆయన పార్టీని రాజకీయ నైతికత విషయంలో తప్పుపట్టవలసింది ఇటీవలి పదవీకాలంలో చేసిన పనుల గురించి కాదు! తెలంగాణ ఉద్యమంలో నిబద్ధత లేని వృత్తిరాజకీయవాదులకు ప్రవేశం కల్పించినందుకు ఆయనను, ఆయన పార్టీని చరిత్ర బోనులో నిలబెట్టాలి! ఎంతో చిత్తశుద్ధి, త్యాగసాహసాలు అవసరమైన ఒక ప్రజా ఉద్యమానికి నాయకత్వం వహించే రాజకీయపార్టీ తన సభ్యులను నిప్పులా నిలుపుకోవాలి! రాజశేఖరరెడ్డి ఫిరాయింపు యాగం మొదలుపెట్టగానే వంగిపోయి అమ్ముడుపోయినవారు నాటి కొందరు టీఆర్ఎస్ శాసనసభ్యులు! చేర్చుకోవడంలోనూ నీతికి ఏ మాత్రం ప్రాధాన్యం ఇవ్వనిది కేసీఆరే! ఒకవైపున నిలువునా కాల్చుకుని, ప్రాణాలు ఇచ్చిన ఉద్యమకారులు సాధించిన తెలంగాణను, ఏ అగ్నిపరీక్షలూ లేకుండా అవకాశవాదులకు అందుబాటులోకి తెచ్చారు! అమ్ముడుపోయే, కొనుక్కోగలిగే సరుకును తెలంగాణ రాజకీయ సమాజంలో ప్రోత్సహించిన వారికి, ఇప్పుడు తమ మందలో నుంచి దొంగిలిస్తున్నారని ఆక్రోశించే హక్కు ఉన్నదా?
సభాపతులు సకాలంలో నిర్ణయం తీసుకోవాలని తీర్పు చెబుతున్నది కదా? అంటే, స్పీకర్లు రాజకీయ అనుబంధాలను పక్కనబెట్టి న్యాయనిర్ణయం చేయాలన్న సూచనా ఉన్నట్టే కదా? అంటే సభాపతులు తమ వెన్నెముకలను సవరించుకోవలసిన అవసరం వచ్చింది కదా? కొత్త లోక్‌సభ సభ్యుల ప్రమాణాల సందర్భంగా, కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ స్పీకర్ ఓంబిర్లాను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలేమిటి? నరేంద్రమోదీ ప్రమాణం చేసిన తరువాత, తనను కలిసినప్పుడు ఓంబిర్లా ఆయన ఎదుట తలవంచారని కదా, రాహుల్ అన్నది? లోక్‌సభ సభాపతి ఎవరి ఎదుట అయినా నిటారుగా ఉండవలసిందేనని కదా ఆయన అభిప్రాయం? మరి తాము పాలించే రాష్ట్రాలలో స్పీకర్లు, ముఖ్యమంత్రుల ఎదుట అమిత విధేయతతో వ్యవహరించకుండా రాహుల్ కానీ, ఆయన పార్టీ కానీ ఏమైనా సూచనలు చేశారా? ఫిరాయింపులతో సహా ఏ వివాదంలో అయినా పార్టీరహితంగా స్వతంత్రంగా వ్యవహరించాలని కాంగ్రెస్ ఒక విలువగా ప్రచారం చేసి, అమలుచేస్తోందా? ఈ ప్రశ్నలు అవసరమైనవి. వీటికి అవును అన్న సమాధానం వస్తే, ఫిరాయింపుల విషయంలో తెలంగాణ స్పీకర్ మరో రకంగా నిర్ణయం తీసుకుంటారన్న ఊహకే ఆస్కారం ఉండేది కాదు. కానీ, దురదృష్టవశాత్తూ, కాంగ్రెస్ పార్టీ జాతీయస్థాయిలో చెబుతున్న సిద్ధాంతాలకు, విలువలకు, క్షేత్రస్థాయి దాకా పాటింపు జరగడం లేదు. జరగాలన్న పట్టింపూ ఆ పార్టీకి ఉండడం లేదు. అదేమంటే, పెద్ద ప్రత్యర్థిని ఎదుర్కొంటున్న అత్యవసర కాలంలో, ‘‘చిన్నచిన్న’’ విషయాలకు మినహాయింపు ఇవ్వాలి కాబట్టి!
ఎవరికీ అక్కరలేని ఒక ప్రజాస్వామిక, రాజ్యాంగ విలువ కోసం న్యాయస్థానం చొరవ చూపింది. తక్షణ రాజకీయ ప్రయోజనం కోసం ఆ చొరవను శ్లాఘించేవారే తప్ప, దాన్ని మనసా వాచా ఇష్టపడేవారు లేరు. నువ్వు అధికారంలో ఉన్న కాలంలో ఏమిచేశావు అని ఎదురు ప్రశ్నించడమే తప్ప, కాంగ్రెస్ పార్టీ వద్ద మరో సమాధానం లేదు. పైగా, కోర్టు తీర్పులో దాగిన ఒక ప్రజాస్వామిక సూత్రం మీద కనీస గౌరవం కూడా ఆ పార్టీ చూపించలేదు. చూపించి ఉంటే, కోర్టు నిర్ణయం చెప్పిన రోజునే, పీఏసీ చైర్మన్‌గా ఒక ఫిరాయింపు శాసనసభ్యుడిని నియమిస్తుందా? పైకి, ఇది ప్రతిపక్ష పార్టీకి విసిరిన సవాల్‌గా కనిపిస్తుంది కానీ, వాస్తవంలో అది ఒకరకమైన కోర్టు ధిక్కారమే కదా? ఫిరాయింపు ఎమ్మెల్యేకు తన పార్టీ ఎంపీ టికెట్ ఇచ్చి నిలబెట్టినప్పుడు చూపిన బోరవిరుపునే కాంగ్రెస్ ఇప్పుడూ చూపింది!
వాళ్లూ కాని, వీళ్లూ కాని తెలంగాణ పౌరసమాజం అంటూ ఒకటి ఉంటే, అది ఫిరాయింపుల మీద మాట్లాడాలి. ప్రజలు మాట్లాడితే, నిజానికి, ఏ కోర్టూ నిర్దేశించనక్కరలేదు, రాజకీయంగా నష్టంజరిగే అవకాశం ఉంటే, ఏ పార్టీ కూడా ప్రజాకాంక్షను అతిక్రమించదు. బాధాకరమేమిటంటే, ప్రజలు కూడా అత్యధికులు రాజకీయ పాక్షికులుగా మారిపోయారు. విలువల ఆధారంగా కాక, ఇతర ప్రాతిపదికల మీద రాజకీయపార్టీల వెనుక సమీకృతులవుతున్నారు. వెధవాయను నేను నీకంటె పెద్ద వెధవాయను నేను, అంటూ నాయకులు పోటీపడి అల్పత్వాన్ని ప్రకటించుకుంటుంటే, చప్పట్లు కొడుతూ వినోదం చూస్తున్నారు. మంచీచెడూ తెలిసినవారు, ఏ గొంగట్లో తింటే ఏమిటి అంటూ నిర్లిప్తంగా ఉంటున్నారు.
కె. శ్రీనివాస్