Share News

‘ఎర్రగుర్తులు’ పెట్టడానికి ఎందుకు తొందర?

ABN , Publish Date - Oct 03 , 2024 | 05:10 AM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అత్యున్నత న్యాయస్థానం, తెలంగాణ సర్కారుకు రాష్ట్ర హైకోర్టు తగిన విధంగా వడ్డింపులు చేశాయి. రెండు చోట్లా జరిగినవి వేరు వేరు అయినా, వాటి మంచి చెడ్డలు ఏమయినా, న్యాయసందేశంలో...

‘ఎర్రగుర్తులు’ పెట్టడానికి ఎందుకు తొందర?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అత్యున్నత న్యాయస్థానం, తెలంగాణ సర్కారుకు రాష్ట్ర హైకోర్టు తగిన విధంగా వడ్డింపులు చేశాయి. రెండు చోట్లా జరిగినవి వేరు వేరు అయినా, వాటి మంచి చెడ్డలు ఏమయినా, న్యాయసందేశంలో ఉమ్మడి అంశం ఒకటే, ‘‘అత్యుత్సాహం మంచిది కాదు.’’ పాలకులు వాళ్ల రాజకీయ అవసరం కోసమో, ‘అభివృద్ధి’ పందెంలో భాగంగానో తూకం తప్పి దూకుడుగా పరుగులెత్తుతారు. స్పీడ్ బ్రేకర్లుండడం వారికి, ప్రజలకూ కూడా ఆరోగ్యకరం.

రాజకీయానుభవం, నాయకత్వ ప్రతిభ తప్ప పాలనానుభవం లేని రేవంత్‌రెడ్డి ఆలోచనలో కొంత అవగాహన లోపిస్తే అర్థం చేసుకోవచ్చు. మంచీచెడ్డా చెప్పవలసిన సచివులు, సహచరులు, సలహాదారులు వారి విధి నిర్వహణలో విఫలం కావడం ఏ మాత్రం క్షమించలేని విషయం. ఆక్రందనల, శాపనార్థాల విడియోలు వైరల్ కాకముందే, ఆత్మహత్యలు జరగక ముందే ‘గాలి మార్పు’ను వార్తాహరులు గమనించి, ఏలికల చెవిన వేసి ఉండవలసింది. వారం వారం రేటింగ్ ఇచ్చే అభిప్రాయసేకరణలు మన దేశంలో జరగవు కానీ, జరిగితే కనుక, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠ రెండు వారాల కిందటికి, ఇప్పటికీ చాలా మారి ఉంటుంది. బలమైన ప్రతిపక్షం, కాచుక్కూర్చున్న జాతీయపక్షమూ ఉన్నచోట, ఇంత అజాగ్రత్త పనికిరాదు.


చినుకు పడగానే చిరాకుగా తయారయ్యే హైదరాబాద్ ట్రాఫిక్‌కు కారణం, వర్షపునీరు ప్రవహించే దారులు మూసుకుపోవడమేనని, చిన్నాచితకా జలాశయాల చుట్టూ ఆక్రమణలూ, ఎవరికివారు మట్టి గుమ్మరించి పెంచుకునే ఎత్తులతో అష్టావక్రంగా తయారయిన వీధులూ వానాకాలం నగరజీవితాన్ని నానా ఛిద్రం చేస్తున్నాయని ప్రజలలో గుర్తింపు పెరిగింది. ప్రతి ఏటా, వర్షం కురియగానే పాతచెరువులు ప్రత్యక్షమై, ఆక్రమణలను బహిరంగపరుస్తున్నాయి. ప్రముఖ సినీనటుడి ఉల్లంఘన మీద బుల్‌డోజర్ నడిపిస్తే జనం ఓహో అనుకున్నారు. ఎడాపెడా బిల్డింగులు కూలుస్తుంటే, ఎంతటివారినైనా ఖాతరుచేయని బుల్‌డోజర్‌గా కళ్లు విప్పార్చి చూశారు. ఆ రెండు రోజుల సాహసం తెచ్చిన ప్రతిష్ఠ మీద హైదరాబాద్ ప్రజలు కొంతకాలం హైడ్రాను భరించారు. ఆ తరువాత కొంత ‘దృశ్యం’ మారుతూ వచ్చింది. పేదవాళ్లుగా, దిగువ మధ్యతరగతి జీవులుగా కనిపిస్తున్న మనుషులు బేలగా, దీనంగా ఆర్తనాదాలు చేస్తుంటే చూడడం కష్టం. ప్రభుత్వం చెబుతున్న ఆదర్శానికి వాస్తవానికీ పొంతన కుదరనప్పుడు, పెదవి విరుపు మొదలయింది. కోర్టును ఖాతరు చేయని కూల్చివేతలు సహజంగానే అహంకారాన్ని ధ్వనించాయి.


హైదరాబాద్‌లో ఉండిన జలమార్గాలు, జలాశయాలు అన్నీ మూసీ ప్రవాహ వ్యవస్థలోనివే. నగరానికి ఒక ఎత్తుపల్లాల, చెట్టూ చేమల నైసర్గికత ఉంటుంది. నీరు పల్లానికి ప్రవహిస్తుంది. మనుషులు తమ అవసరాల కోసం కొన్ని చోట్ల నీటిని నిలుపుకుంటారు. తక్కిన నీటిని జాగ్రత్తగా వెలుపలికి పంపాలి. ఇది కూడా నదేనా, అని వెక్కిరించేవాళ్లుంటారు కానీ, ఇది నాలుగువందలేళ్ల పైచిలుకు చరిత్రలో అనేకమార్లు తన ఉధృతరూపాన్ని ప్రదర్శించింది. 1908, మనకు తెలిసిన తాజా ‘ముచికుందానది జలప్రళయము’. ఆ తరువాత నగరానికి వరద నివారణ వ్యవస్థ ఒకటి ఏర్పడింది. అప్పటి జనాభాను, నగరభూభాగాన్ని దృష్టిలో పెట్టుకున్నది ఆ వ్యవస్థ ప్రణాళిక. నాలుగు దశాబ్దాలు గడిచేసరికి చాలనితనం ఎదురైంది. సంస్థాన కాలంలో ఉండిన పట్టింపు, విధాన వేగం, హైదరాబాద్‌కు స్వతంత్ర భారతంలో లభించలేదు. అందరూ ఈ నగరాన్ని ఆబగా అనుభవించాలనుకోవడమే తప్ప, దీని మీద పడిన ఒత్తిడిని, పెరుగుతున్న మంచినీటి కొరతను, మురుగునీటి తీవ్రతని తగ్గించాలని చూడలేదు. నగరాన్ని తాము గొప్పగా తీర్చిదిద్దామని చెప్పుకోవాలన్న ఆత్రుతే తప్ప, హైదరాబాద్ ఆత్మ కాంక్రీట్ అరణ్యంలో, సహజీవన రాహిత్యంలో అణగారిపోతున్నదన్న గుర్తింపు ఏలికలకు లేకపోయింది. ఈ అవకతవక బీభత్స గందరగోళ అభివృద్ధిలో, టౌన్ ప్లానింగ్ ఎగిరిపోయింది, నాలుగు గజాల నేలలో నిలబడడం నిరుపేదలకు ప్రాణావసరమైంది, వెంచర్లు వెంచర్లుగా కంచెలు కట్టి కబ్జాచేయడం పెద్దలకు దర్జా అయిపోయింది. దళారులు, అవినీతి ఉద్యోగులు, రాజకీయ నాయకులు, అసాంఘిక శక్తులు హైదరాబాద్‌ను అంగుళం అంగుళంగా ఆరగించారు. ఎత్తుపల్లాలు తారుమారయ్యాయి, వాననీటికి దారులు మూసుకుపోయాయి, చెరువులు కుంచించుకుపోయాయి, మూసీ ఒక పాయ అయిపోయింది. దాని కడుపు బస్టాండ్ అయింది.


చేయాలి. మూసీని బాగుచేయాలి. ముక్కులు తెరుచుకునే లాగా, కళ్లకు పండగలాగా చేయాలి. దాని దారి నిండా నీళ్లు పరవళ్లు తొక్కాలి. రెండు పక్కలా చెట్లు బారులు తీరాలి. పడవల మీద విహరించాలి. అలసిన మనసుల సాయంత్రాలన్నీ అక్కడ సేదతీరాలి. ఇటువంటి కలలన్నీ కేసీఆర్‌కూ, రేవంత్‌రెడ్డికి మాత్రమే ఉండవు. హైదరాబాద్ ఇల్లైనవారందరికీ, ఇష్టపడేవారందరికీ అవే కలలు. కానీ, ఈ కలల్ని ఝళిపించి, జీవితాలను కకావికలం చేయబోయేముందు అధికారపక్షాలు, ప్రతిపక్షాలు అన్నీ కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి!

ఈ నగరాన్ని వికృతపరచిందెవరు? నిందలు వేస్తున్నది ఎవరిమీద? నట్టింట్లో చెరువు తిష్ఠ వేయాలని ఎవరికి ఉంటుంది? ఒకనాటి వేల చెరువులు ఏమయ్యాయి? దయలేని వ్యవస్థ, మెతుకు కోసం అవస్థ కాకపోతే, మురికిగుంటగా మారిన ముచికుంద కడుపులో ఎవరు మాత్రం ఎందుకు తలదాచుకుంటారు? ప్రియురాలిని చూడడానికి వెళ్లే రాకుమారుడిని ఉక్కిరిబిక్కిరి చేసి వంతెన కట్టించిన అలనాటి మూసీ ప్రవాహం ఏది? నదిని చేపల్లాగా, ఈ నగరాన్ని మనుషులతో నింపమని కులీ కుతుబ్ షా దేవుణ్ణి ప్రార్థించాడు కదా, మరి నదిని కొరుక్కుతింటున్న ఈ తిమింగలాలు ఎక్కడివి? వాటిని ఎవరు కాపాడుతున్నారు?


మూసీ కేవలం హైదరాబాద్‌దే కాదు. ఇప్పుడు దామగుండం నేవీ రాడార్‌తో పచ్చదనాన్ని రాల్చుకోబోతున్న అనంతగిరి కొండల్లో పుట్టి, తెలంగాణ సరిహద్దులో వాడపల్లి దగ్గర కలిసే కృష్ణ దాకా దీనిది చాలా పెద్ద ప్రయాణం. నగరంలోకి అమాయకంగా, స్వచ్ఛంగా వచ్చిన మూసీ, విషతుల్యమై, పాషాణప్రాయమై, రంగారెడ్డి, ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లోకి ప్రవహిస్తుంది. మూసీ నీటితో ఆ జిల్లాల్లో 64 చెరువులు నిండుతాయట. ఈ నదీ ప్రక్షాళన నగరవాసులకే కాదు, ఆ జిల్లాల్లోని రైతాంగానికి చాలా అవసరం. కానీ ఈ మంచి పనిని మనుషులను వెళ్లగొట్టడంతో, ఇళ్లు కూలగొట్టడంతో ఎందుకు ప్రారంభిస్తున్నారు? అలీబాబా నలభై దొంగలలాగా, ఇళ్ల మీద ఎర్ర గుర్తులెందుకు పెడుతున్నారు? మురికి మూలం ఎక్కడో గుర్తించడంతో మొదలు పెట్టాలి కదా, మనుషులతో మాట్లాడడంతో మొదలు పెట్టాలి కదా?

మూసీ మీద జరిగిన అఘాయిత్యాలలో ముఖ్యమైనది దాని ప్రారంభ కేచ్‌మెంట్ ఏరియాలో నియంత్రణ లేని నిర్మాణాలు. న్యాయస్థానం కల్పించుకుని 111 జీవో ద్వారా రక్షణ కల్పించినప్పటినుంచి, దాన్ని ఎట్లా ఎత్తివేద్దామా అని ఆలోచిస్తూ వస్తున్న నేతలు. అసలు మూసీకి క్యాచ్‌మెంట్ ఎందుకు, ఆ అవసరాన్ని తీసేస్తే, 111 కూడా తీసేయవచ్చును కదా అన్న ఆలోచన బీఆర్ఎస్ ప్రభుత్వానికి వచ్చింది. మూసీ పునరుద్ధరణ, ప్రక్షాళన ఆలోచన ఆ ప్రభుత్వానిదే. కానీ, తరువాత దాన్ని కాళేశ్వరం గొలుసు జలాశయాలతో ముడిపెట్టారు. కేశవాపూర్ చెరువు నుంచి ఉస్మాన్, హిమాయత్ సాగర్‌లకు నీరు తరలిస్తే, ఈ క్యాచ్‌మెంట్ గొడవ ఉండదని, 111 పీడ విరగడ అవుతుందని ఆలోచన. నోబెల్ బహుమతి ఇవ్వదగ్గ గొప్ప ఆలోచన! మూసీని నలువైపులా మూసేసి, కేశవాపూర్ పైపులతో నీరు నింపవచ్చు, క్యాచ్‌మెంట్ ఏరియా అంతటా యథేచ్ఛగా రియలెస్టేట్‌ను వర్థిల్లచేస్తే, హైదరాబాద్ జంట జలాశయాలు నియంత్రిత వ్యవస్థలు అవుతాయి, సమస్యలు ఏవీ ఉండవు అన్నది ఆ ఆలోచనకు వివరణ. కానీ, నీటికి జ్ఞాపకశక్తి అమోఘం. దారులు మూసేసినప్పుడే కదా అది వెల్లువయ్యేది. క్యాచ్‌మెంట్ ఏరియా అంతటా అరాచకంగా భవనాలు నిర్మిస్తే, కొండల్లో పుట్టిన నీరు ఎక్కడికి పోతుంది? ఏ దారీ లేకపోతే ఫోర్త్ సిటీకి పోతుంది. ప్రమాదం బదిలీ అవుతుంది.


ప్రభుత్వం వారూ, ముందు కాస్త ఆగి, ఊపిరి పీల్చుకోండి. ఏదో మునిగిపోతున్నట్టు కొంపలు కూల్చే కార్యక్రమం చేయడం కాకుండా, మొత్తం విషయాన్ని స్థిమితంగా ఆలోచించడంతో పని మొదలుపెట్టాలి. రివర్ బెడ్ అని మీరు సక్రమంగా గుర్తించిన ప్రాంతంలో ఉన్నవారి విషయంలో ఏ చర్యా తీసుకోకుండా నిలిపివేయండి. మీరు తక్కిన అన్ని పనులూ చేసి, మూసీలో మంచినీరు ప్రవహించే రోజున వారిని, అవసరమైతే మాత్రమే, తగిన న్యాయపరిహారంతో తరలించండి. ఎన్నికల సమయంలో ఏడో గ్యారంటీగా ప్రజాస్వామ్యాన్ని వాగ్దానం చేశారు కదా, ఆ విలువలో భాగంగా, అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయండి. నిపుణులతో, ప్రజాకార్యకర్తలతో, మేధావులతో మాట్లాడండి. నది వెంట ఉన్నవారు, నదితో ముడిపడినవారు, నగరానికి వెలుపల నది లబ్ధిదారులు అందరితో విస్తృత స్థాయిలో సంప్రదింపుల ప్రక్రియ చేపట్టండి. నిర్వాసితులయ్యేవారు కానీ, ఏదో రకంగా ఎంతో కొంత కోల్పోయేవారిని గుర్తించి, వారి సామాజికార్థిక సమాచారాన్ని సేకరించి, క్రోడీకరించండి. వృత్తి ఆక్రమణదారులతో కఠినంగా ఉండండి. పలుకుబడి, ధనమదంతో ఉల్లంఘనలకు పాల్పడేవారితో నిర్దాక్షిణ్యంగా వ్యవహరించండి. మూసీ నదీగర్భం, బఫర్ జోన్‌కు సంబంధించిన పటాలను, ప్రాజెక్టు పూర్తి నివేదికను, ప్రభుత్వం వారి ఇతర ఆలోచనలను బహిరంగపరచి, చర్చకు ఆహ్వానించండి. ఏదీ దాపరికంతో చేయకండి. ఏదైనా అంతర్జాతీయ లేదా విదేశీ ఆర్థిక సంస్థ గనుక ప్రభుత్వం మీద కూల్చివేతలకు ఒత్తిడి చేస్తుంటే ఆ విషయం కూడా ప్రజలకు చెప్పండి, అనుమానాలకు, ఆరోపణలకు ఆస్కారం ఇవ్వకండి. ఈ సుందరీకరణ ప్రాజెక్టుకు ఖర్చు ఎంత పెట్టగలరో ముందే ఒక అవగాహన ఏర్పరచుకుని, ఆ తరువాత పరిహార, పునరావాస కల్పనల గురించి ఆలోచించండి. మీరు చెబుతున్న ప్రకారం మూసీకి ఇరుపక్కలా ఉన్న నివాసభవనాలను భూసేకరణ పరిధిలోకి తీసుకువస్తే, లక్షా యాభైవేల కోట్లు ఏ మూలకూ సరిపోవు. గణితం బాగా తెలిసిన అధికారులను, కన్సల్టెంట్‌లను నియమించుకోండి.


అన్నిటికంటె ముందు ప్రభుత్వం గ్రహించవలసింది, ప్రజలు ఈ ప్రాజెక్టుకు శత్రువులు కాదు. మీరు పొరుగు దేశంతో యుద్ధం చేయబోవడం లేదు. ప్రజలను భాగస్వాములను చేసుకోండి. ఇందులో వారికి కూడా ప్రయోజనం ఉంటుందని చెప్పండి, ప్రయోజనం ఉండేట్టు చూడండి. అధికారులను ఇళ్లపైకి తోలి భయపెట్టకండి. ఆత్మహత్యలకు, గుండెపోట్లకు ఆస్కారం ఇవ్వకండి. మూసీ లాంటివారే జనం కూడా. దారులు మూస్తే, ముంచేస్తారు!

కె. శ్రీనివాస్

Updated Date - Oct 03 , 2024 | 05:10 AM