Share News

అంతం అయిపోతారు, ఆ తరువాత?

ABN , Publish Date - Oct 10 , 2024 | 04:55 AM

సుప్రసిద్ధ ఉర్దూ కథారచయిత ఖ్వాజా అహ్మద్ అబ్బాస్ 1980లో నక్సలైట్స్ అని ఒక సినిమా తీశారు. సినిమా చివర్లో పెద్ద కాల్పుల సంఘటన తరువాత, పోలీసు అధికారి మెగాఫోన్ పట్టుకుని ‘నక్సలైట్లు ఇంకా ఎవరైనా...

అంతం అయిపోతారు, ఆ తరువాత?

సుప్రసిద్ధ ఉర్దూ కథారచయిత ఖ్వాజా అహ్మద్ అబ్బాస్ 1980లో నక్సలైట్స్ అని ఒక సినిమా తీశారు. సినిమా చివర్లో పెద్ద కాల్పుల సంఘటన తరువాత, పోలీసు అధికారి మెగాఫోన్ పట్టుకుని ‘నక్సలైట్లు ఇంకా ఎవరైనా మిగిలిపోయారా’ అని గొంతు చించుకుంటూ అడుగుతాడు. నిశ్శబ్దమే సమాధానం. కానీ, అక్కడికి దూరంగా ఒక ఆదివాసీ గూడెంలో చొక్కా కూడా లేని ఒక చిన్న పిల్లవాడు, రెండు చేతులూ ఎత్తుతాడు, తానున్నానన్నట్టు.

అబ్బాస్ ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ అభ్యుదయ ఉద్యమం కాలానికి చెందిన రచయిత. ఆయనకు నక్సలైట్ ఉద్యమంతో పూర్తి ఏకీభావమేమీ లేదు. అవగాహనా లేదు. సినిమాలు తీయడం కూడా ఆయనకు రాదు. అయినా ముగింపు అట్లా ఎందుకు చేసినట్టు? ఉద్యమాలు బలప్రయోగంతో అణగారిపోవు అన్న విశ్వాసం, కొనసాగింపు ఉండి తీరుతుందనే ఆశాభావం, ఆయనకు ఉండవచ్చు.

భారతదేశ గృహమంత్రి అమిత్ షా ఈ మధ్య తరచు మావోయిస్టుల అంతం గురించి చెబుతున్నారు. 2026 అన్న గడువును పదే పదే వక్కాణిస్తున్నారు. ఆయన చెబుతున్నట్టుగానే, ఛత్తీస్‌గఢ్ గహనారణ్యం అబూజ్ మడ్‌లో దళాలు దళాలుగా, గూడేలు గూడేలుగా మనుషులు చచ్చిపోతున్నారు. ఆ చనిపోవడంలో ప్రభుత్వం విజయం చూస్తోంది. తెగిపడిన తలలను, తెగవలసిన తలలను లెక్కపెట్టి మరీ చెబుతోంది. త్వరలోనే అంతా ముగిసిపోతుంది అన్న భరోసాను ప్రకటిస్తోంది. నాలుగువేల చదరపు కిలోమీటర్ల అరణ్యంలో కొత్త అభివృద్ధిని కలగంటోంది.


కొత్త సమాజాన్ని నిర్మిస్తామని తుపాకులు పట్టుకుని పోరాటం చేస్తున్నవాళ్లు మన మధ్య ఆరున్నర దశాబ్దాలుగా కనిపిస్తున్నారు. వాళ్లంతా, ఈ సమాజం కడుపులో నుంచి పుట్టినవాళ్లే. ఈ ప్రజల కన్నబిడ్డలే. పెద్ద ఎత్తున జనాన్ని కూడగట్టి, ఉద్యమాలు చేసి, అంతిమంగా భారత రాజ్యాన్నే పట్టుకోవాలన్నది వాళ్ల వ్యూహం. సహజంగానే ప్రభుత్వాలూ, వ్యవస్థా దాన్ని సహించవు. సాయుధంగా ఉన్నారన్న కారణం ఉంటుంది కనుక, చాటుమాటుగా తిరుగుతుంటారు కనుక వాళ్లను చంపేయడానికి ప్రభుత్వ భటులకు చాలా సులువులు ఉంటాయి. చట్టప్రకారం వెళ్లడం, విచారణ తతంగాలూ ఇటువంటివాళ్ల విషయంలో అనవసరమని భద్రతావ్యవస్థలు నమ్ముతాయి. ఫలితంగా, వేలాదిమంది నక్సలైట్లు నిర్మూలన అయ్యారు. అదే సమయంలో వేలాదిమంది కొత్తగా పుట్టుకువచ్చారు. ఇప్పుడు ఈ పునరావృత చట్రంలో నిర్మూలనదే పైచేయి అయిందని, ఇక అంతా చదును కాబోతోందని ప్రభుత్వం ఆనందిస్తోంది.

నిజానికి, నక్సలైట్లతోనే మొదలు కాదు. అంతకు ముందు కమ్యూనిస్టులు ఉన్నారు. తెలంగాణతో సహా దేశంలోని అనేక భాగాల్లో తుపాకుల పోరాటం వాళ్లు చేశారు. అంతకు ముందు భగత్ సింగ్, అల్లూరి వంటి విప్లవవాదులు ఆయుధాలు పట్టుకుని బ్రిటిష్ వారి మీద పోరాడారు. 1857లో భారత రైతాంగం, సైనికులు తిరుగుబాటు చేసి, పోరాడి అణగారిపోయారు. అయినా, ఆ తరువాత పోరాటాలు పుడుతూనే వచ్చాయి. స్వతంత్రం వచ్చిన సమయంలోను, ఆ తరువాత, కమ్యూనిస్టులు, నక్సలైట్లు కాని వారు కూడా చాలా చోట్ల సాయుధ పోరాటాలు చేశారు, చేస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో అనేక సాయుధ సంస్థలు క్రియాశీలంగా ఉన్నాయి. కొన్నిటితో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది, ఒప్పందాలు కూడా చేసుకుంది. ఒప్పందాలు చేసుకున్న చోట కూడా కొందరు తిరుగుబాటు దారులు వాటిని ఒప్పుకోక, పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు. సంస్థలు అంతమైపోవచ్చు, కొన్నిచోట్ల పోరాటాలు మౌనంలోకి పోవచ్చు, ముగిసిపోతాయని చెప్పలేము.


కొలంబియాలో గెరిల్లా ఉద్యమం మాఫియాగా మారి, చివరకు లొంగిపోయింది కదా, శ్రీలంకలో టైగర్లను తుడిచిపెట్టారు కదా, మన దేశంలోనూ ఖలిస్తాన్ ఉద్యమం ఉపశమించింది కదా, నేపాల్‌లో మావోయిస్టులు అణగారిపోయారు కదా అని వాదనలు వింటుంటాము. పై ఉదాహరణల్లో ఎక్కడా సమస్య శేషం లేకుండా పోలేదు. కొత్తరూపాల్లో అశాంతి వ్యక్తమవుతోంది. ఒక చారిత్రక జ్ఞాపకంగా కూడా ఆయా ఉద్యమాలు వర్తమాన రాజకీయాల్లో కీలకపాత్ర వహిస్తున్నాయి. ఎందుకంటే, ఎందువల్ల అక్కడ సాయుధ రాజకీయాలు వచ్చాయో, ఆ మూలకారణాలు సమసిపోలేదు. ఎక్కడైనా సమస్య లేకుండా పోయి ఉంటే గనుక, అక్కడ ఉభయపక్షాల అంగీకారంతో, పోరాటవాదుల డిమాండ్లను గణనీయంగా నెరవేర్చడంతో మాత్రమే జరిగింది.

1990 దశకం మొదట్లో, సోవియట్ యూనియన్ కకావికలు అయిపోయినప్పుడు, పెట్టుబడిదారీ ప్రపంచం బహిరంగంగా సంబరపడింది. మేధావులు అయితే, చరిత్ర ఇక ముగిసిపోయింది అన్నారు. అప్పుడు ఒక అంతర్జాతీయ జర్నలిస్టు తన కాలమ్‌లో కొన్ని ప్రశ్నలు వేశారు. ‘‘అయితే ఏమిటి? లోకంలో మనుషులు ఉన్నదానితో సంతృప్తిపడతారా? పెట్టుబడిదారీ విధానమే పరమపదమని, ఇంతకు మించిన గొప్ప వ్యవస్థ లేదని సమాధానపడతారా? ఆఫ్రికా ఖండంలోను, ఆసియాలోనూ, దక్షిణ అమెరికా ఖండంలోనూ వారి ప్రభుత్వాలను, ప్రభుత్వాలను శాసిస్తున్న అగ్రరాజ్యాలను వ్యతిరేకించడం విరమించి హ్యాపీలీ లివ్‌డ్ ఎవరాఫ్టర్ అయిపోతారా?’’ అని ఆ పాత్రికేయుడు హేళనాత్మకంగా అబ్బురపడ్డారు.

ఈ శతాబ్దం మొదటి దశాబ్దంలో, సెప్టెంబర్ 11, 2001 నాటి కీలక పరిణామం కూడా జరిగిపోయాక, ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రయాణాలను కట్టుదిట్టం చేశారు. విమానాశ్రయాలను కంచుకోటలుగా మార్చారు. ఆ తరువాత, లండన్‌లో సబ్ వేలో ఒక టెర్రరిస్టు పేలుడు జరిగింది. దాని మీద వ్యాఖ్యానిస్తూ మరో జర్నలిస్టు ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద జరిగిన విమానదాడుల నేపథ్య కారణాల మీద దృష్టి పెట్టకుండా, మరింత మందిని టెర్రరిస్టు మార్గంలోకి వెళ్లడానికి ప్రేరేపించే ప్రతీకార చర్యలు తీసుకుంటే, భద్రత ఎట్లా సాధ్యం? మీరు విమానాలను అష్టదిగ్బంధం చేస్తే, ఆత్మాహుతి ఆకాశదాడులు ఆగిపోతాయి. కానీ, మరోచోట పేలుళ్లు మొదలవుతాయి. భద్రతాచర్యల పరిష్కారం ఎప్పుడైనా విద్రోహచర్యల స్థలాన్ని, పద్ధతిని మార్చవచ్చును కానీ, విద్రోహాన్ని నివారించలేదు, అన్నది ఆ విశ్లేషణ సారాంశం. అశాంతి ఉన్నప్పుడు, దాని ప్రతిఫలనాలు వ్యక్తం అవుతూనే ఉంటాయి. ఒక రూపాన్ని తుడిచిపెడితే, అది మరో చోట, మరో రూపంలో తలెత్తుతూనే ఉంటుంది. దేన్నైనా సమూలంగా పెకిలించివేయాలంటే, విత్తనం ఎక్కడిదో, నేల ఎందుకు మొలకలను అనుమతిస్తోందో, వేళ్లు ఎక్కడెక్కడ విస్తరించి ఊడలు దిగాయో ముందు తెలుసుకోవాలి. మట్టిలోని ఏ జీవరసాయన చర్య ఆ మొక్కలను సజీవంగా నిలుపుతోందో అవగాహన చేసుకోవాలి.


ఇప్పుడు అమిత్ షా చెప్పినట్టు, అందరూ పట్టుబడి, లొంగిపోయి, చచ్చిపోతారనుకుందాం. తరువాత ఏమి జరుగుతుంది? 370 రద్దుకోసమే పరితపించిన కశ్మీరీలు, అది జరగగానే జన్మధన్యమైందని భావించారని మోదీ అనుకున్నట్టుగా, దేశంలోని ఆదివాసులందరూ ఆనంద పారవశ్యంలో మునిగితేలతారా? తమకూ అభివృద్ధికీ మధ్య అడ్డుగోడలా నిలబడిన విప్లవకారుల పీడ విరగడయిందని పండగ చేసుకుంటారా? వనవాసీ కళ్యాణం జరిగింది లెమ్మని అదానీ అంబానీలతో చెట్టపట్టాలు వేసుకుని జీవిస్తారా? బ్రిటిష్ వాడు కూడా దూరని భీకరారణ్యం మధ్య నుంచి పలువరసల మహారహదారులు దూసుకుపోతుంటే అభివృద్ధి తమను ఇంత నాగరికంగా కనికరిస్తున్నందుకు ఉప్పొంగిపోతారా? మావోయిస్టుల తుపాకీచప్పుళ్లు చల్లారి, యుద్ధవిన్యాస శిక్షణల కుహూరుతాలతో దండకారణ్యం కొత్తవసంతాన్ని చవిచూస్తుందా?

అడవుల్లోని ఆదివాసులు మాత్రమే కాదు, అలనాటి అన్నలను గుర్తుచేసుకునే పల్లె ప్రజలూ, హక్కులూ న్యాయమూ అంటూ కాలం చెల్లిన మాటలు మాట్లాడే బహిరంగ ఉద్యమకారులూ, అంగీకారం లేకపోయినా గౌరవం తగ్గించుకోని మేధావులూ, వీళ్లందరూ ‘ఆ’ తరువాత ఏమవుతారు? తెలంగాణ సాయుధ పోరాటంతో మొదలుపెట్టి, సుమారు ఏడుదశాబ్దాల పాటు తిరుగుబాటుదారులను అంతం చేస్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీకి కూడా ఇప్పుడు అర్బన్ నక్సల్ ముద్ర తప్పనప్పుడు, దేశంలో మావోయిస్టు నిందపడని వారెవరు మిగులుతారు? వీరందరూ మిగిలే ఉండగా, అంతం ఎట్లా కుదురుతుంది అమిత్ షా? అబూజ్ మడ్ తరువాత, అనేక యుద్ధరంగాలు! నిర్మూలించవలసినవారెవరూ లేని స్థితిలో అసలు పాలన ఎట్లా సాగుతుంది? ఎప్పుడూ ఎక్కడో ఒక చోట యుద్ధం చేయనిదే అగ్రరాజ్యాలకు, ఎప్పుడూ ఎవరినో నిర్మూలిస్తూ పోనిదే రేపటి అగ్రరాజ్యాలకు కాలం ఎట్లా గడుస్తుంది?


బహుశా, భౌతికంగా అబూజ్‌మడ్ ‘విముక్తం’ అయిపోతుంది. జనతన సర్కార్ ఒక జ్ఞాపకం అయిపోతుంది. దేశంలో అక్కడా ఇక్కడా ఉన్న మావోయిస్టు ఉద్యమస్థావరాలు కూడా తీవ్రమయిన ఒత్తిడిలో అణగారిపోతాయి. అంతాన్ని ప్రకటించి అమలుచేస్తున్నప్పుడు, నిస్సహాయంగా ముగిసిపోవడం వీరోచితం కావచ్చును కానీ, సరైనది కాకపోవచ్చును. కాలం ఉధృతంగానో ఉత్సాహంగానో ఉన్నప్పుడు, విమర్శను ఆహ్వానించే వినయం, సమీక్ష చేసుకోవలసిన అగత్యం లేకపోవచ్చును. నిర్బంధం, నిర్మూలన ఎదురయినప్పుడు విమర్శ, సమీక్ష అనౌచిత్యం, భీరుత్వం అనిపించవచ్చును. మరి ఎట్లా? తమను తాము కాపాడుకోవడానికి, ప్రజాస్వామిక వ్యవస్థల రాజకీయ వైఫల్యంతో బాధితులవుతున్న ప్రజలకు ఆదరువుగా ఉండడానికి ఎవరు మిగులుతారు? జనజీవనంలో వెలి‍సే అనేక యుద్ధరంగాలను నిర్వహించగలవారెవరు? నిర్బంధంతో నిర్మూలన సాధ్యం కాదని పాలకులకు చెప్పినట్టే, వివేచన, విమర్శ కొరవడితే ఉనికీ సాధ్యం కాదని మావోయిస్టులకు చెప్పాలని ప్రజలు కోరుకుంటారు కదా?

నిర్మూలనే ధ్యేయంగా సాగుతున్న చర్యలను నిలిపివేయమన్న విజ్ఞప్తులను వినే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. నిజానికి ఆ విజ్ఞప్తిని గట్టిగా చేయగలిగే స్థితిలో కూడా భారతీయ పౌరసమాజం, ప్రజా ఉద్యమశ్రేణులు లేవు. ప్రధానస్రవంతి పార్టీలు మౌనంతో అర్ధాంగీకారాన్ని అందిస్తున్నాయి. చెప్పగలిగిందీ, చెబితే వినే ఆస్కారమున్నదీ మావోయిస్టులే. అస్త్రసన్యాసం చేయమని ఎవరూ చెప్పరు. అన్యాయంగా అంతరించిపోవద్దని మాత్రమే ఎవరైనా అడగగలరు.

కె. శ్రీనివాస్

Updated Date - Oct 10 , 2024 | 04:55 AM