Share News

AP Election 2024: ఆ నియోజకవర్గాల్లో ఓటెత్తిన పల్లెలు.. పార్టీల్లో వణుకు!

ABN , Publish Date - May 24 , 2024 | 08:23 PM

చిత్తూరు జిల్లాలోని పలు నియోజకవర్గాల పరిధిలోని పల్లెలు పోటెత్తాయి. జన చైతన్యంతో ఓటర్లు పోటెత్తారు. 95 శాతానికిపైగా ఓటింగ్‌ నమోదు చేసి ఓటర్లు ఆదర్శంగా నిలిచారు. ముఖ్యంగా ఒక గ్రామంలోనైతా ఏకంగా 100 శాతం పోలింగ్ నమోదయింది. దీంతో ఈ పల్లెలు ఏ పార్టీ వైపు మొగ్గుచూపాయి?. ఏ పార్టీని గెలిపించబోతున్నాయి? అంటూ పార్టీలు వణికిపోతున్నాయి. మరి ఏయే నియోజకవర్గాల పరిధిలో గ్రామాల్లో భారీ ఓటింగ్ నమోదయిందో గమనిద్దాం..

AP Election 2024: ఆ నియోజకవర్గాల్లో ఓటెత్తిన పల్లెలు.. పార్టీల్లో వణుకు!

ఈ నెల 13 ఏపీ అసెంబ్లీ ఎన్నికలు-2024లో భాగంగా చిత్తూరు జిల్లాలోని పలు నియోజకవర్గాల పరిధిలోని పల్లెలు పోటెత్తాయి. జన చైతన్యంతో ఓటర్లు పోటెత్తారు. 95 శాతానికిపైగా ఓటింగ్‌ నమోదు చేసి ఓటర్లు ఆదర్శంగా నిలిచారు. ముఖ్యంగా ఒక గ్రామంలోనైతా ఏకంగా 100 శాతం పోలింగ్ నమోదయింది. దీంతో ఈ పల్లెలు ఏ పార్టీ వైపు మొగ్గుచూపాయి?. ఏ పార్టీని గెలిపించబోతున్నాయి? అంటూ పార్టీలు వణికిపోతున్నాయి. మరి ఏయే నియోజకవర్గాల పరిధిలో గ్రామాల్లో భారీ ఓటింగ్ నమోదయిందో గమనిద్దాం..

పల్లెల్లో ఓటు చైతన్యం పెరిగింది. ‘ నా ఓటు.. నా హక్కు’ అని ఓటర్లు భావించారు. ఆ హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ రోజున పోటెత్తారు. గంటలకొద్దీ ఆలస్యమైనా క్యూలలో నిలబడ్డారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో తెల్లవారుజాము వరకూ నిరీక్షించి.. ఓటేశారు. అందుకే అత్యధిక పోలింగ్ కేంద్రాల్లో 95 శాతానికి పైగా ఓటింగ్ నమోదయింది.


సమర్థులు ఇంట్లో ఉంటే అసమర్థలు రాజ్యమేలుతారని ఓ సినీ పాటల రచయిత అన్న మాటల్ని జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల ప్రజలు తమకు అన్వయించుకుంటున్నారు.తమను ఎవరు పరిపాలించాలో.. ఐదేళ్లకోసారి ఓటు ద్వారా ఎన్నుకునే సదవకాశాన్ని కాదనుకుంటే ఏం జరుగుతుందో గ్రహించారు. కాబట్టే ఈసారి కనీవినీ ఎరుగని రీతిలో పోలింగ్ శాతం నమోదయింది. విదేశాలు, ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన వాళ్లూ సొంత గ్రామాలకు వచ్చి ఓటేశారు. ఇక గ్రామీణ ఓటర్లలోనూ ఓటుపై అవగాహన పెరిగింది. యువత, మహిళలు, వర్గాల ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివచ్చారు. దీంతో ఆయా గ్రామాల్లో 95 శాతానికి మించి పోలింగ్ నమోదయింది. ఇలా 95 శాతం పోలింగ్ దాటిన కంద్రాలు.. కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో అధికంగా ఉన్నాయి. నగరి మండలంలోని కీలపట్టు దళితవాడలో ఏకంగా 100 శాతం పోలింగ్ నమోదయింది. పుంగనూరు, జీడీనెల్లూరు నియోజకవర్గాల్లో అలాంటి కేంద్రాలు తక్కువగా ఉన్నాయి. చిత్తూరు పట్టణంలో 95 శాతం దాటిన పోలింగ్ కేంద్రం ఒక్కటీ లేదు. చిత్తరూ రూరల్‌లో మాత్రం ఒకటుంది. 2019లో అత్యధిక ఓటింగ్ అనుకుంటే ఈసారి పోలింగ్ అంతకుమించింది. జిల్లాలో 95 శాతానికి మించి పోలింగ్ నమోదైన కేంద్రాల వివరాలను పరిశీలిస్తే..


పలమనేరు నియోజకవర్గం..

  • పలమనేరు నియోజకవర్గంలోని 19 కేంద్రాల్లో 95 శాతానికి మించి పోలింగ్ నమోదయింది. గంగవరంలోని 8, పలమనేరులో 5, బైరెడ్డిపల్లెలో 4, వి.కోట, పెద్దపంజానీలో ఒక్కోటి చొప్పున అత్యధికంగా పోలింగ్ నమోదైన కేంద్రాలున్నాయి.

  • పలమనేరు మండలంలోని శ్రీరంగరాజపురం కేంద్రంలో 639 మందికి 617 మంది (96 శాతం) ఓట్లేశారు. జగమర్లలో 541 మంది ఓటర్లకు 521 మంది (96 శాతం) ఓటు హక్కుని ఉపయోగించుకున్నారు. ఇక కండమడుగులో 475కి 456 మంది (96 శాతం).. నలగాంపల్లెలో 949కి 906 మంది (95శాతం).. చెత్తపెంటలో 554 మందికి 542 మంది (97శాతం) ఓట్లు వేసి ఆదర్శంగా నిలిచారు.

  • బైరెడ్డిపల్లె మండలంలోని రామాపురం కేంద్రంలో 619కి 592 ఓట్లు (95 శాతం).. లక్కనపల్లెలో 904 మందికి 862 ఓట్లు (96 శాతం).. బైరెడ్డి పల్లె కేంద్రంలో 1168 ఓటర్లకు 1122 మంది (96 శాతం).. చప్పిడిపల్లెలో 1068 మందికి 1017 మంది (95శాతం) ఓటు హక్కుని వినియోగించుకున్నారు.

  • గంగవరం మండలంలో పొన్నమాకులపల్లెలో 712 మందిలో 683(96 శాతం), దండపల్లెలో 616 మందిలో 591 మంది (95శాతం), తాళ్లపల్లిలో 883 మందిలో 841 మంది (95 శాతం), కలగటూరులో 463 మందిలో 452 మంది (98 శాతం), జీఎల్ఎస్ ఫారంలో 922 మందికి 883 మంది (96 శాతం), మామడుగలో 828 మంది (95 శాతం), పసుపత్తూరులో 869కు 827 ఓట్లు (95) పోలయ్యాయి.

  • పెద్దపంజాణి మండలంలోని చలమంగలం కేంద్రంలో 679 ఓట్లు ఉండగా 652 మంది (96 శాతం) ఓటు వేసి ఆదర్శంగా నిలిచారు.

  • వి.కోట మండలంలోని పెద్దబర్నేపల్లె కేంద్రంలో 939 ఓట్లకు 894 ఓట్లు (95.5 శాతం) పోలయ్యాయి.


కుప్పం నియోజకవర్గంలో ఇలా..

  • కుప్పం నియోజకవర్గంలోని 23 కేంద్రాల్లో 95 శాతానికి మించిన పోలింగ్ నమోదయింది. గుడుపల్లెలో 9, కుప్పం, శాంతిపురంలో 7 చొప్పున కేంద్రాలున్నాయి.

  • కుప్పం మండలంలోని దేవరాజపురంలో 882 మందికిగానూ 852 మంది (96.5 శాతం), బీడీచేన్లులో 758 మందికిగానూ 697 మంది (95.5 శాతం), ఏకార్లపల్లెలో 498కి 483 మంది (97శాతం), కొత్త ఇండ్లులో 860కి 819 మంది (95 శాతం), ఏకార్లపల్లెలో 498కి 483 మంది (97 శాతం), కొత్త ఇండ్లులో 860కి 819 మంది (95శాతం), సజ్జలపల్లెలో 455కిగానూ 437 మంది (96శాతం), మంకలదొడ్డిలో 1333కి 1287 మంది (97 శాతం ఓట్లు వేసి) ఆదర్శంగా నిలిచారు.

  • శాంతిపురం మండలంలోని వడగండ్లపల్లెలో 721కిగానూ 688 మంది (96.7 శాతం), కేపీమిట్టలో 763కిగానూ 727 మంది (95 శాతం), చౌడేపల్లెలో 721కిగానూ 690 మంది (96 శాతం), గొల్లపల్లెలో 982కిగానూ 933 మంది (95 శాతం), శివరామపురంలో 1309కిగానూ 1249 మంది (95.5 శాతం) మంది ఓట్లు వేశారు.

  • గుడుపల్లె మండలంలోని చీకటిపల్లె, కాకినాయని చిగర్లపల్లె, మల్లదేపల్లె, దాసిమనిపల్లె, కుప్పిగాని పల్లె, అగరం, కనమనపల్లె, సంగనపల్లె 139, సంగనపల్లె 140.. కేంద్రాల్లోనూ 95 శాతానికిపైగా పోలింగ్ నమోదయింది. అయితే రామకుప్పం మండలంలో 95 శాతం దాటిన కేంద్రాలు లేవు.


మిగతా నియోజకవర్గాల్లో ఇలా

  • గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో మూడు కేంద్రాల్లో మాత్రమే 95 శాతం పోలింగ్ దాటింది. మోపిరెడ్డిపల్లె కేంద్రంలో 507కుగానూ 484 మంది (95.5 శాతం), పెనుమూరు మండలంలోని సీఎస్ అగ్రహారం కేంద్రంలో 269కిగానూ 257 మంది (95.5శాతం), గోపిశెట్టిపల్లెలో 699కిగానూ 666 మంది (95 శాతం) ఓట్లేశారు.

  • పుంగనూరు మండలం ఏటవాకలిలో 556 మందికిగానూ 531 మంది (95.5 శాతం), చౌడేపల్లె మండలం చారాలలో 525 ఓటర్లకుగానూ 500 మంది (95 శాతం) ఓటు హక్కు వినియోగించుకున్నారు.

  • చిత్తూరు రూరల్ మండలంలోని ఏనుగుంటపల్లెలో 723 మందికిగానూ 690 మంది (95.5 శాతం) ఓట్లు వేశారు. ఐరాల మండలంలోని నెల్లమందలపల్లె కేంద్రంలో పోలింగ్ శాతం 95 శాతం దాటింది.


అందరికీ ఆదర్శం ‘కీలపట్టు దళితవాడ’

నగరి నియోజకవర్గంలోని సుమారు పది కేంద్రాల్లో 95 శాతం పోలింగ్ దాటింది. ఇదిలావుండగా నగరి మండలంలోని కీలపట్టు, కాకవేడు, మంగాడు దళితవాడల్లో అత్యధికంగా పోలింగ్ జరిగింది. ఈ ప్రాంతాల్లోని దళితులు ఆదర్శంగా నిలిచారు. కీలపట్టు దళితవాడలో ఏకంగా వందశాతం పోలింగ్ జరిగింది. ఇక్కడ 650 ఓట్లు ఉండగా అన్నీ పోలయ్యాయి. కాకవేడు దళితవాడలో 443 ఓట్లకుగానూ 431 ఓట్లు (94 శాతం) పోలయ్యాయి. ఇదే మండలంలోని తెరణి కేంద్రంలో 889కిగానూ 846 ఓట్లు (95శాతం), నాగరాజకుప్పంలో 874కిగానూ 831 ఓట్లు (95శాతం), కావేటిపురంలో 444కిగానూ 427 ఓట్లు (96 శాతం) ఓట్లు పడ్డాయి.

  • విజయపురం మండలంలోని ఆలపాక కండ్రిగలో 501 ఓట్లకుగానూ 480 ఓట్లు (96 శాతం), ఇళ్లత్తూరు హరిజనవాడలో 861కిగా నూ 818 ఓట్లు (95 శాతం) పోలయ్యాయి.

  • నిండ్ర మండలంలోని 183 కేంద్రంలో 402కిగానూ 390 ఓట్లు, 193 కేంద్రంలో 423కిగానూ 402 ఓట్లు పోలయ్యాయి.

For Election News and Telugu News

Updated Date - May 24 , 2024 | 08:25 PM