Share News

Burkina Faso: ఘోరం.. 600 మందిని నిలువునా కాల్చేశారు

ABN , Publish Date - Oct 05 , 2024 | 10:11 AM

పశ్చిమ ఆఫ్రికా దేశం బుర్కినా ఫాసో (Burkina Faso)లో అత్యంత పాశవిక ఘటన జరిగింది. బర్సాలోగో పట్టణంలో ఉగ్రవాదులు కిరాతకానికి పాల్పడ్డారు. గంటల వ్యవధిలోనే 600 మందికిపైగా పొట్టనపెట్టుకున్నారు.

Burkina Faso: ఘోరం.. 600 మందిని నిలువునా కాల్చేశారు

ఇంటర్నెట్‌ డెస్క్‌: పశ్చిమ ఆఫ్రికా దేశం బుర్కినా ఫాసో (Burkina Faso)లో అత్యంత పాశవిక ఘటన జరిగింది. బర్సాలోగో పట్టణంలో ఉగ్రవాదులు కిరాతకానికి పాల్పడ్డారు. గంటల వ్యవధిలోనే 600 మందికిపైగా పొట్టనపెట్టుకున్నారు. ఆగస్టులో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని ఓ అంతర్జాతీయ మీడియా కథనం తెలిపింది. ఆగస్టు 24న బర్సాలోగో పట్టణంపై బైక్‌లపై దూసుకొచ్చిన ఉగ్రవాదులు కన్పించినవారిని కాల్చేశారు. మృతుల్లో అత్యధికులు మహిళలు, చిన్నారులే కావడం తీవ్ర విషాదాన్ని నింపింది. అల్‌ఖైదా, ఇస్లామిక్‌ స్టేట్‌ అనుబంధ రెబల్స్‌ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


అక్కడ జమాత్ నుస్రత్ అల్-ఇస్లాం వాల్-ముస్లిమిన్ (JNIM), మాలిలో ఉన్న అల్-ఖైదా అనుబంధ సంస్థ, బుర్కినా ఫాసోలో ఉగ్రవాద సంస్థలు ఆ దేశంలో క్రియాశీలకంగా పని చేస్తున్నాయి. ఉగ్రవాదులను గమనించి బాధితులంతా బర్సాలోగో శివార్లలోకి పారిపోతుండగా దొరికిన వారిని దొరికినట్లు ఊచకోత కోశారు. ఈ ఘటనలో.. ఐక్యరాజ్యసమితి దాదాపు 200 మంది మరణించినట్లు అంచనా వేయగా, ఉగ్రవాద సంస్థ JNIM దాదాపు 300 మందిని చంపినట్లు ప్రకటించింది. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. 600 మంది వరకు చనిపోయినట్లు తెలుస్తోంది.


ఎటు చూసిన రక్తపాతమే..

ఉగ్రవాదుల దాడుల శబ్ధాలు విన్న ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడుకోవడానికి బర్సాలోగో పట్టణానికి 4 కి.మీ. దూరంలో ఉన్న ఒక లోయలో దాక్కున్నాడు. ఘటనతాలూకు వివరాలను ఆయన మీడియాతో వెల్లడించాడు. "నేను తప్పించుకోవడానికి లోయలోకి వెళ్లాను. కానీ దాడి చేసినవారు నన్నే అనుసరించినట్లు అనిపించింది. ఉగ్రవాదులు అక్కడి నుంచి వెళ్లిపోయాక రక్తపు మడుగులో పడి ఉన్న ఓ వ్యక్తిని చూశా. అలా మధ్యాహ్నం వరకు ఆ లోయలోనే ఉండిపోయా. జేఎన్ఐఎం ఊచకోతను రోజంతా కొనసాగించింది. బయటకి వచ్చి చూశాక మృతదేహాలన్ని చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. భయం నా గుండెల్లో పరుగులు తీసింది. అంత మంది శవాలను ఖననం చేయడం అధికారులకు కష్టంగా మారింది”అని బాధితుడు చెప్పాడు. తిరుగుబాటుకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో సైన్యానికి మద్దతు ఇవ్వకూడదని JNIM పౌరులను హెచ్చరించడం గమనార్హం.

Hyderabad: రాజేంద్రప్రసాద్ ఇంట విషాదం.. గుండెపోటుతో..

For Latest news and National News click here

Updated Date - Oct 05 , 2024 | 10:38 AM