Share News

Israel-Hamas War: ఇజ్రాయెల్ ప్రధాని సంచలన నిర్ణయం.. అనుకున్నదే జరిగిందిగా!

ABN , Publish Date - Feb 24 , 2024 | 03:13 PM

అక్టోబర్ 7వ తేదీ నుంచి హమాస్, ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న విషయం అందరికీ తెలుసు. ఉగ్రవాద సంస్థ అయిన హమాస్‌ను అంతం చేయడమే లక్ష్యంగా.. గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలోనే.. ఈ యుద్ధం తర్వాత గాజా పరిస్థితి ఏంటి? ఇన్నాళ్లూ హమాస్ పాలించిన ఆ ప్రాంతాన్ని యుద్ధం అనంతరం ఎవరు పాలిస్తారు? అనే ప్రశ్నలు తలెత్తాయి.

Israel-Hamas War: ఇజ్రాయెల్ ప్రధాని సంచలన నిర్ణయం.. అనుకున్నదే జరిగిందిగా!

అక్టోబర్ 7వ తేదీ నుంచి హమాస్ (Hamas), ఇజ్రాయెల్ (Israel) మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న విషయం అందరికీ తెలుసు. ఉగ్రవాద సంస్థ అయిన హమాస్‌ను అంతం చేయడమే లక్ష్యంగా.. గాజాపై (Gaza Strip) ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలోనే.. ఈ యుద్ధం తర్వాత గాజా పరిస్థితి ఏంటి? ఇన్నాళ్లూ హమాస్ పాలించిన ఆ ప్రాంతాన్ని యుద్ధం అనంతరం ఎవరు పాలిస్తారు? అనే ప్రశ్నలు తలెత్తాయి. మొదట్లో ఇజ్రాయెల్ తీరు చూసి, ఆ దేశమే గాజాని తన అధీనంలోకి తీసుకోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు అదే నిజమైంది. యుద్ధం ముగిశాక గాజాను ఎలా నియంత్రించాలన్న ప్రణాళికకు సంబంధించి.. ఓ కీలక పత్రాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) ‘వార్ కేబినెట్’ ముందు ఉంచారు.


ఆ పత్రంలో.. గాజాను డీమిలిటరైజేషన్ (Demilitarisation) చేస్తామని బెంజిమన్ కుండబద్దలు కొట్టారు. అంతేకాదు.. భద్రతతో పాటు పాలనా వ్యవహారాలను పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకుంటామని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌తో (West Bank) పాటు గాజా, జోర్డాన్‌ (Jordan) పశ్చిమాన ఉన్న భూభాగాలపై భద్రతా నియంత్రణను ఇజ్రాయెల్ నిర్వహిస్తుందని చెప్పారు. అలాగే.. పాలస్తీనాను (Palestine) ప్రత్యేక ప్రాంతంగా గుర్తించడాన్ని ఆయన తిస్కరించారు. గాజాలో శాంతిభద్రతలను కాపాడుతూ హమాస్‌ పాలనను భర్తీ చేసేందుకు స్థానిక ప్రతినిధులతో కలిసి చేస్తామని తెలిపిన ఆయన.. ఉగ్రవాద గ్రూపులతో సంబంధం లేనివారితోనే కలిసి నడుస్తామని స్పష్టం చేశారు. గాజా-ఈజిప్ట్ సరిహద్దులో ఇజ్రాయెల్ తన ఉనికిని కలిగి ఉందని.. రాఫా క్రాసింగ్‌తో (Rafah Border Crossing) పాటు స్థానికంగా స్మగ్లింగ్ ప్రయత్నాలను నిరోధించేందుకు తాము ఈజిప్ట్, అమెరికా దేశాలకు సహకరిస్తామని వెల్లడించారు. ఐక్యరాజ్య సమితి (United Nations) నేతృత్వంలోని పాలస్తీనా శరణార్థి ఏజెన్సీని మూసివేయాలని ప్రతిపాదించారు. దాని స్థానంలో ఇతర అంతర్జాతీయ సహాయ బృందాలను కొనసాగించాలని చెప్పుకొచ్చారు.

ఇదిలావుండగా.. అక్టోబర్ 7వ తేదీన హమాస్ చేసిన మెరుపుదాడుల కారణంగా ఈ యుద్ధం ప్రారంభమైంది. తమపై ఉగ్రవాద చర్యలకు పాల్పడినందుకు గాను హమాస్‌ని పూర్తిగా సర్వనాశనం చేస్తామని ఇజ్రాయెల్ ప్రతిజ్ఞ చేసింది. అందుకు తగినట్టుగానే.. గాజాలో వైమానిక, భూతల దాడుల్ని నిర్వహిస్తోంది. అయితే.. ఈ దాడుల్లో ఇప్పటికే వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా.. మహిళలు, చిన్న పిల్లలు ఎక్కువ సంఖ్యలో మృతి చెందారు. దీంతో.. కాల్పుల విరమణ (Ceasefire) కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం పారిస్‌లో (Paris) ఇందుకు సంబంధించిన చర్చలు సాగుతున్నాయి. ఈ చర్చల్లో అమెరికా, ఈజిప్టు, ఖతార్‌ కీలక పాత్ర పోషిస్తున్నాయి. రంజాన్‌లోపు ఈ ఒప్పందాన్ని ఒక కొలిక్కి తీసుకురావాలని కసరత్తు చేస్తున్నాయి.

Updated Date - Feb 24 , 2024 | 03:13 PM