Share News

US Elections 2024: మరో ట్విస్ట్.. అమెరికా అధ్యక్ష బరిలో మిషెల్ ఒబామా?

ABN , Publish Date - Jul 22 , 2024 | 12:17 PM

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా భార్య మిషెల్‌ ఒబామా(Michelle Obama)ను బరిలో నిలుపుతారనే ఊహాగానాలు బలపడుతున్నాయి. పోటీ నుంచి తాను తప్పుకుంటున్నట్లు బైడెన్ ప్రకటించిన తరువాత మిషెల్ ఒబామా పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా నిలిచింది.

US Elections 2024: మరో ట్విస్ట్.. అమెరికా అధ్యక్ష బరిలో మిషెల్ ఒబామా?

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా భార్య మిషెల్‌ ఒబామా(Michelle Obama)ను బరిలో నిలుపుతారనే ఊహాగానాలు బలపడుతున్నాయి. పోటీ నుంచి తాను తప్పుకుంటున్నట్లు బైడెన్ ప్రకటించిన తరువాత మిషెల్ ఒబామా పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా నిలిచింది. ఓ వైపు కమలా హ్యారిసే డెమొక్రటిక్ పార్టీ తరఫున పోటీలో ఉంటుందని అంతా అనుకుంటుండగా.. మిషెల్ ఒబామా పేరు బయటకి రావడం గమనార్హం.

ఆమె అభ్యర్థిత్వానికి పార్టీలోని చాలా మంది అనుకూలంగా ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మూడు నెలలు ముందు ఆగస్టులో జరిగే డెమోక్రాటిక్‌ నేషనల్‌ కన్వెన్షన్‌లో ఆ పార్టీ అభ్యర్థిగా మిషెల్‌ ఒబామాను ప్రకటించే అవకాశాలున్నాయని డెమోక్రాట్లు అభిప్రాయపడుతున్నారు.


మిషెలే ఎందుకు..

బైడెన్‌కి మెజారిటీ ప్రజల మద్దతు దక్కలేదని పలు సర్వే సంస్థలు తెలిపాయి. ది సెంటర్ స్క్వేర్ ఓటర్స్ వాయిస్ ఇటీవలే నిర్వహించిన సర్వే ప్రకారం.. అమెరికా ఓటర్లు తమ తదుపరి అధ్యక్ష అభ్యర్థిగా మిషెల్‌నే కోరుకుంటునట్లు తేలింది. ఈ సర్వేలో కమలా హారిస్ కంటే మిషెల్‌కే ఎక్కువ మద్దతు లభించింది.

కమలా హారిస్‌ అభ్యర్థిత్వానికి బైడెన్‌ మద్దతు ప్రకటించగా.. ఒబామా మాత్రం ఇప్పటివరకు ఆమెకు మద్దతు ప్రకటించకపోగా.. కొత్త నామినీ ఎంపిక కోసం సరైన ప్రక్రియతో ముందుకురావాలని పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఒబామాను హారిస్‌కు మెంటార్‌గా చెబుతుంటారు. డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన మరో కీలక నేత నాన్సీ పెలోసీ సైతం కమలా హారస్‌కు మద్దతు ప్రకటించకపోవడంతో పార్టీలో అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నాయనే అనుమానాలు కలుగుతున్నాయి.


అయితే ఒబామా లెక్కలు వేరేగా ఉన్నాయని.. తన భార్యను అధ్యక్ష బరిలోకి దింపడానికే కమలాకు మద్దతు ప్రకటించట్లేదని అంతర్గతంగా చర్చ నడుస్తోంది. సాధారణంగా అమెరికాకు ఒక్కరు గరిష్ఠంగా రెండుసార్లు అధ్యక్షులుగా వ్యవహరించొచ్చు. ఒబామా రెండు పర్యాయాలు అమెరికా అధ్యక్షుడిగా పని చేశారు. ఇదే సమయంలో మిషెల్ ఒబామాకు నెటిజన్ల నుంచి మద్దతు వస్తోంది. ట్రంప్‌ని ఓడించగల ఒకే ఒక్క వ్యక్తి మిషెల్‌ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. “దయచేసి మిషెల్ ఒబామాపై దృష్టి పెట్టండి. కమలా హారిస్‌‌ని పోటీలో నిలపకండి. ఆమెకు ప్రజా సమస్యలు పట్టవు. ట్రంప్‌ని ఓడించలేరు" అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

తరువాత ఏంటి..

డెమోక్రటిక్ నేషనల్ కమిటీ కన్వెన్షన్ ఆగస్టు 19న చికాగోలో ప్రారంభం కానుంది. నవంబర్‌లో జరిగే సాధారణ ఎన్నికలకు తమ అభ్యర్థిని ఎన్నుకునేందుకు దేశవ్యాప్తంగా దాదాపు 4 వేల మంది ప్రతినిధులు ఇక్కడ సమావేశమవుతారు. ఆ తరువాత అభ్యర్థులు అధ్యక్ష బరిలో నిలుస్తున్నట్లు నామినేషన్‌లు సమర్పిస్తారు. నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి.

US Elections 2024: బైడెన్ వైదొలిగిన వేళ.. డెమొక్రాట్లను అప్రమత్తం చేసిన బరాక్ ఒబామా

For Latest News and National News click here

Updated Date - Jul 22 , 2024 | 12:39 PM