Share News

UNGA: ఫోన్లతో 80 కోట్ల మంది పేదరికం నుంచి బయటకు.. భారత్‌లో డిజిటలైజేషన్ భేష్: ఐరాస

ABN , Publish Date - Aug 02 , 2024 | 09:33 PM

స్మార్ట్ ఫోన్లతో భారత్‌లో గత ఆరేళ్లలో 80 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని యూఎన్ జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు డెన్నిస్ ఫ్రాన్సిస్ తెలిపారు. డిజిటలైజేషన్‌లో భారత్ వేగాన్ని ఆయన ప్రశంసించారు.

UNGA: ఫోన్లతో 80 కోట్ల మంది పేదరికం నుంచి బయటకు.. భారత్‌లో డిజిటలైజేషన్ భేష్: ఐరాస

న్యూయార్క్: స్మార్ట్ ఫోన్లతో భారత్‌లో గత ఆరేళ్లలో 80 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని యూఎన్ జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు డెన్నిస్ ఫ్రాన్సిస్ తెలిపారు. డిజిటలైజేషన్‌లో భారత్ వేగాన్ని ఆయన ప్రశంసించారు. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు స్మార్ట్‌ఫోన్‌తో నగదు, బిల్లులను చెల్లిస్తున్న విధానాన్ని కొనియాడారు. ఫ్రాన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO) నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భారత దేశంలోని గ్రామీణ ప్రాంతాలకు బ్యాకింగ్‌ సేవలను విస్తరించడంపై ఆనందం వ్యక్తం చేశారు.


"ఒకప్పుడు భారత్‌లోని గ్రామీణ ప్రాంతాలకు బ్యాంకింగ్, ఆన్‌లైన్‌ చెల్లింపుల వ్యవస్థలు అందుబాటులో ఉండేవి కావు. బ్యాంకులతో సంబంధమే లేని రైతులు ఇప్పుడు వారి వ్యాపారాలకు సంబంధించిన అన్నిరకాల లావాదేవీలను స్మార్ట్‌ఫోన్‌లోనే చేసుకోగలుగుతున్నారు. ఈ సేవలను సులభతరం చేసి, దేశ ప్రజలు ప్రయోజనం పొందడానికి ఇంటర్‌నెట్‌ వ్యాప్తి తోడ్పడింది. ప్రపంచవ్యాప్తంగా మిగతా దేశాలు కూడా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం ఇలాంటి చర్యలు తీసుకోవాలి. భారత్‌లో అత్యధిక స్థాయిలో ఇంటర్నెట్ వ్యాప్తి ఉంది. దాదాపు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ కనిపిస్తుంది. డిజిటలైజేషన్‌ని సాధించడానికి అన్ని దేశాలు సమష్టిగా కృషి చేయాలి" అని డెన్నిస్ ఫ్రాన్సిస్ పేర్కొన్నారు.


యూపీఐ చెల్లింపులు..

గత 10 ఏళ్లుగా ప్రధాని మోదీ ప్రభుత్వం డిజిటలైజేషన్‌పై దృష్టి పెట్టింది. 2016లో నోట్ల రద్దు అనంతరం యూపీఐ డిజిటల్ చెల్లింపు లావాదేవీల్లో మెరుగుదల వచ్చింది. జేఏఎం(JAM) చొరవతో జన్‌ధన్, ఆధార్, మొబైల్‌ల ద్వారా డిజిటలైజేషన్ వినియోగాన్ని మోదీ ప్రోత్సహించారు. దీని ద్వారా గ్రామీణ వాసులు కూడా బ్యాంకు ఖాతాలు తెరిచారు. ప్రతి ఖాతాను ఆధార్‌తో అనుసంధానించారు. బ్యాంకు ఖాతాలను ఆధార్‌, మొబైల్‌ నంబర్లతో లింక్‌ చేయడం వల్ల వివిధ పథకాలు, సొంత వ్యాపారాల ద్వారా వచ్చే చెల్లింపులు బ్యాంకు అకౌంట్లలో జమవుతున్నాయి.

Updated Date - Aug 02 , 2024 | 09:33 PM