Share News

Islamabad : ఇమ్రాన్‌ఖాన్‌ అరెస్టు.. పార్టీపై నిషేధం!

ABN , Publish Date - Jul 16 , 2024 | 02:55 AM

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు కోర్టుల్లో ఉపశమనం లభిస్తున్నప్పటికీ, ఆయనకు జైలు కష్టాలు తొలగడం లేదు. కార్ప్స్‌ కమాండర్‌ హౌస్‌పై దాడి, మే 9 అల్లర్లు సహా మొత్తం 12 కేసుల్లో తాజాగా ఆయనను లాహోర్‌ పోలీసులు అరెస్టు చేశారు.

Islamabad : ఇమ్రాన్‌ఖాన్‌ అరెస్టు..  పార్టీపై నిషేధం!

  • దేశద్రోహం కేసూ నమోదు

  • చేయనున్న పాక్‌ సర్కారు

ఇస్లామాబాద్‌, జూలై 15: పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు కోర్టుల్లో ఉపశమనం లభిస్తున్నప్పటికీ, ఆయనకు జైలు కష్టాలు తొలగడం లేదు. కార్ప్స్‌ కమాండర్‌ హౌస్‌పై దాడి, మే 9 అల్లర్లు సహా మొత్తం 12 కేసుల్లో తాజాగా ఆయనను లాహోర్‌ పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఇమ్రాన్‌ నేతృత్వంలోని పీటీఐ(పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఎ-ఇన్సాఫ్‌) పార్టీని నిషేధించనున్నట్టు పాక్‌ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. అలాగే, దేశద్రోహానికి పాల్పడినందుకు ఇమ్రాన్‌తోపాటు, ఇద్దరు పీటీఐ సీనియర్‌ నేతలపై కేసులు నమోదు చేయనున్నట్టు వివరించింది.

పాక్‌ సమాచారశాఖ మంత్రి అతావుల్లా తరర్‌ సోమవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. పీటీఐని నిషేధించేందుకు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేయనున్నట్టు చెప్పారు. అక్రమ పెళ్లి కేసులో ఇమ్రాన్‌ను నిర్దోషిగా జిల్లా కోర్టు ప్రకటించడం, జాతీయ అసెంబ్లీలో రిజర్వు సీట్లు పొందడానికి పీటీఐకి అర్హత ఉందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

పీటీఐకి రిజర్వు సీట్లు కేటాయిస్తే ఆ పార్టీ బలం 109కి చేరి, జాతీయ అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా మారే అవకాశం ఉంది. 71 సంవత్సరాల వయసున్న ఇమ్రాన్‌ఖాన్‌ ప్రస్తుతం రావల్పిండిలోని అదియాలా జైల్లో ఉన్నారు. 2022 ఏప్రిల్‌లో ప్రధాని పదవి కోల్పోయినప్పటి నుంచి ఆయనపై అనేక కేసులు నమోదవుతూనే ఉన్నాయి.

Updated Date - Jul 16 , 2024 | 02:56 AM