Share News

Israel-Gaza War: గాజాలో ఇజ్రాయెల్ బాంబుల వర్షం.. ఇదే అతిపెద్ద దాడి.. భారీ స్థాయిలో మరణాలు

ABN , Publish Date - Jul 08 , 2024 | 06:36 PM

ఇప్పటికే యుద్ధం కారణంగా భయానక పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న గాజాలో ఇజ్రాయెల్ దళాలు మరోసారి విరుచుకుపడ్డాయి. బాంబులు, క్షిపణులతో మూకుమ్మడి దాడులు జరిపాయి. ఈ దెబ్బకు అక్కడ చాలా..

Israel-Gaza War: గాజాలో ఇజ్రాయెల్ బాంబుల వర్షం.. ఇదే అతిపెద్ద దాడి.. భారీ స్థాయిలో మరణాలు
Israel-Gaza War

ఇప్పటికే యుద్ధం (Israel-Gaza War) కారణంగా భయానక పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న గాజాలో ఇజ్రాయెల్ దళాలు మరోసారి విరుచుకుపడ్డాయి. బాంబులు, క్షిపణులతో మూకుమ్మడి దాడులు జరిపాయి. ఈ దెబ్బకు అక్కడ చాలా భవనాలు నేలమట్టమయ్యాయి, పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. అక్టోబర్ 7వ తేదీ తర్వాత ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇది అతిపెద్దదని చెప్తున్నారు. ఈ దాడుల కారణంగా ప్రజలు ప్రాణభయంతో రోడ్లపైకి వచ్చేశారు. ఎటు వెళ్లాలో తెలియక.. రోడ్లపైనే పడుకోవాల్సిన దుస్థితి నెలకొంది.


ఇజ్రాయెల్ జరిపిన తాజా దాడులపై ‘గాజా సివిల్‌ ఎమర్జెన్సీ సర్వీస్‌’ స్పందిస్తూ.. ఈ దాడుల్లో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. తూర్పు గాజాలోని దరాజ్‌, టఫాతో పాటు పశ్చిమాన ఉన్న మరికొన్ని ప్రాంతాల్లో కాల్పుల తీవ్రత ఎక్కువ ఉందని స్పష్టం చేసింది. పక్కా ప్లాన్ ప్రకారమే ఇజ్రాయెల్ ఈ భీకరమైన దాడి చేసిందని వెల్లడించింది. యుద్ధ ట్యాంక్‌లతో పాటు ఫైటర్ జెట్‌లను సిద్ధం చేసుకొని.. ఆదివారం అర్థరాత్రి తర్వాత బాంబుల వర్షం కురిపించింది. తెల్లవారుజాము వరకు ఈ కాల్పులు కొనసాగాయి. ఈ దాడులకు భయపడి.. తమ ప్రాణాలు కాపాడుకోవడం కోసం ప్రజలు మధ్యధరా సముద్రతీరం వైపు పరుగులు తీశారు.


ఈ దాడులపై స్థానికులు మాట్లాడుతూ.. ఇజ్రాయెల్ దళాలు కురిపించిన బాంబుల వర్షంలో పలు భవనాలు ధ్వంసమయ్యాయని అన్నారు. మూడువైపులా నుంచి శత్రువులు చుట్టుముట్టారని, మరోవైపు సముద్రం ఉందని.. ఎటు వెళ్లినా ప్రమాదమేనంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ట్యాంకర్ల నుంచి బాంబులు, విమానాల నుంచి క్షిపణులు.. పిడుగులు పడినట్లు రోడ్లు, ఇళ్లపై బీభత్సం సృష్టిస్తున్నాయని కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ ఉన్నామని రోధిస్తున్నారు. అయితే.. ఇజ్రాయెల్ మాత్రం హమాస్ ఉగ్రవాదుల సదుపాయాల్ని నాశనం చేసేందుకు ఈ మిషన్ చేపట్టినట్లు పేర్కొంది.

Read Latest International News and Telugu News

Updated Date - Jul 08 , 2024 | 06:36 PM