Share News

America: అధ్యక్ష ఎన్నికల్లో గెలుపు కమలదే.. ది సింప్సన్స్ జోస్యం

ABN , Publish Date - Jul 28 , 2024 | 07:24 AM

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్‌ గెలవడం ఖాయమని ‘ది సింప్సన్స్‌’ జోస్యం చెప్పింది. ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ షో డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి గెలుపును నేరుగా పేర్కొనలేదు.

America: అధ్యక్ష ఎన్నికల్లో గెలుపు కమలదే.. ది సింప్సన్స్ జోస్యం

వాషింగ్టన్‌ డీసీ: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్‌ గెలవడం ఖాయమని ‘ది సింప్సన్స్‌’ జోస్యం చెప్పింది. ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ షో డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి గెలుపును నేరుగా పేర్కొనలేదు. కానీ కమలా హారిస్ లాగా దుస్తులు ధరించిన 'లిసా సింప్సన్' పాత్ర అమెరికాకు మొదటి మహిళా అధ్యక్షురాలు కాబోతున్నట్లు తెలిపింది.


kamala.jpgరెండు దశాబ్దాల క్రితం 2000 ఏడాదిలో ప్రసారమైన ది సింప్సన్స్ ఎపిసోడ్, US అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ఆసక్తికర అంచనాలు వెల్లడించింది. 'బార్ట్ టు ది ఫ్యూచర్' పేరుతో నిర్వహించిన ఫ్లాష్-ఫార్వర్డ్ ఎపిసోడ్‌లో 'లిసా సింప్సన్' అనే పాత్ర అమెరికా తదుపరి అధ్యక్షురాలిని అంచనా వేసింది. మాట్ గ్రోనింగ్ అనే కార్టూనిస్ట్ ఫాక్స్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ కోసం ది సింప్సన్స్ అనే అమెరికన్ యానిమేటెడ్ కార్యక్రమాన్ని రూపొందించారు. దీన్ని గ్రోనింగ్, జేమ్స్ ఎల్ బ్రూక్స్, సామ్ సైమన్‌లు అభివృద్ధి చేశారు. ఈ కార్టూన్లలో రాజకీయాలు సహా సామాజిక అంశాలపై వ్యంగ్యంగా స్పందిస్తూ ధారావాహికలు ప్రసారం చేస్తుంటారు.


గెలుపు నాదే..

కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తనదే విజయమని ఆ దేశ ఉపాధ్యక్షురాలు, డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థిని కమలాదేవి హ్యారిస్‌ ధీమా వ్యక్తం చేశారు. ఆఫ్రికన్‌-భారత సంతతికి చెందిన ఈమె.. తాను ఎన్నికల బరిలో నిలుస్తున్నట్లు శనివారం అధికారికంగా ప్రకటించారు. డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థినిగా లాంఛనంగా డిక్లరేషన్‌ ఫాంపై సంతకాలు చేశారు.

ఇరువురి మధ్య ఒక్క శాతమే తేడా..

బైడెన్‌ డెమోక్రాటిక్‌ అభ్యర్థిగా పోటీలో ఉన్నప్పుడు ట్రంప్‌ విజయం నల్లేరుపై బండి నడకేనని అన్ని సర్వేలూ పేర్కొన్నాయి. ఇప్పుడు ఆయన స్థానంలో కమలా హ్యారిస్‌ పోటీకి దిగడంతో ట్రంప్‌కు, ఆమెకు మధ్య ఉన్న అంతరం బాగా తగ్గిపోయిందని.. తేడా ఒక్క శాతమేనని ఓ సర్వే సంస్థ ప్రకటించింది. తాజా అభిప్రాయ సేకరణలో ట్రంప్‌కు 48 శాతం మంది మద్దతివ్వగా.. హ్యారి్‌సకు 47 శాతం మంది దన్నుగా నిలిచారని ‘న్యూయార్క్‌ టైమ్స్‌-సియెనా కాలేజ్‌ పోల్‌’ శనివారం వెల్లడించింది. ముఖ్యంగా డెమోక్రాటిక్‌ మద్దతుదారులైన ఓటర్లలో 70 శాతం మంది ఆమెకు మద్దతిచ్చినట్లు తెలిపింది.


కాల్పులు జరిపినే చోటే ర్యాలీ..

పెన్సిల్వేనియా ర్యాలీలో తనపై కాల్పులు జరిపిన చోటే మళ్లీ ర్యాలీ నిర్వహిస్తానని డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. ‘మా ప్రియమైన ఫైర్‌ఫైటర్‌ కోరే గౌరవార్థం నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహించబోతున్నా. ర్యాలీ కోసం పెన్సిల్వేనియాలోని బట్లర్‌కు తిరిగి వెళ్తున్నా’ అని సోషల్ మీడియాలో ట్రంప్‌ పేర్కొన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్‌ గెలిస్తే అతివాద అధ్యక్షురాలిగా చరిత్రలో మిగిలిపోతారని రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ విమర్శించారు. ‘హారిస్‌ ప్రజాదరణ కోల్పోయారు. ఒకవేళ గెలిస్తే అత్యంత తీవ్రమైన అతివాద అధ్యక్షురాలిగా మిగిలిపోతారు. దేశ ఉపాధ్యక్షురాలిగా ఆమె బాధ్యతలను సక్రమంగా నిర్వహించలేదు. ఎంతోమంది అక్రమంగా అమెరికాలోకి వలస వస్తున్నా అడ్డుకోలేదు. ఉపాధ్యక్షురాలిగా హారిస్‌ విఫలమయ్యారు’ అని తీవ్ర విమర్శలు గుప్పించారు.

Updated Date - Jul 28 , 2024 | 07:25 AM