Share News

Mohammad Yunus : బంగ్లాదేశ్‌ అస్థిరపడితే భారత్‌కు ముప్పు!

ABN , Publish Date - Aug 10 , 2024 | 05:18 AM

షేక్‌ హసీనా రాజీనామా దరిమిలా విచ్చలవిడి హింసాకాండతో బంగ్లాదేశ్‌లో అస్థిరత నెలకొంటే ఈశాన్య భారతం, పశ్చిమ బెంగాల్‌ తీవ్రంగా ప్రభావితమవుతాయని తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్‌ యూనస్‌ హెచ్చరించారు.

Mohammad Yunus : బంగ్లాదేశ్‌ అస్థిరపడితే భారత్‌కు ముప్పు!

  • తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్‌ హెచ్చరిక

  • మా శత్రువుకు ఆశ్రయమిస్తే భారత్‌తో కలిసి పనిచేయలేం: బీఎన్‌పీ

ఢాకా/న్యూ, ఆగస్టు 9: షేక్‌ హసీనా రాజీనామా దరిమిలా విచ్చలవిడి హింసాకాండతో బంగ్లాదేశ్‌లో అస్థిరత నెలకొంటే ఈశాన్య భారతం, పశ్చిమ బెంగాల్‌ తీవ్రంగా ప్రభావితమవుతాయని తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్‌ యూనస్‌ హెచ్చరించారు. మయన్మార్‌ కూడా ఇందుకు మినహాయింపు కాదన్నారు.

అటు హసీనాకు ఆశ్రయమిచ్చినందుకు బంగ్లా ప్రతిపక్ష పార్టీ బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ (బీఎన్‌పీ) కూడా భారత్‌కు వార్నింగ్‌ ఇచ్చింది. తమ శత్రువుకు ఆశ్రయమిస్తే భారత్‌-బంగ్లా మధ్య పరస్పర సహకారం కష్టమవుతుందని స్పష్టం చేసింది. గురువారం ప్రభుత్వ ప్రధాన సలహాదారు(ప్రధానికి ఉండే అధికారాలతో)గా బాధ్యతలు చేపట్టేముందు యూనస్‌ ఎన్‌డీటీవీ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు.

దేశంలో శాంతిభద్రతల స్థాపనే తన ప్రథమ కర్తవ్యమని స్పష్టం చేశారు. హసీనా పాలనలో చాలా ఏళ్లుగా శాంతిభద్రతలు లోపించాయని ఆరోపించారు. ఆ కారణంగానే ఆమె రాజీనామా చేయాలన్న డిమాండ్‌ పెద్దదైందని.. చివరకు వైదొలగక తప్పలేదని అన్నారు. దీంతో బంగ్లా ప్రజలు పండుగ చేసుకుంటున్నారని.. ఈ ఆనందోత్సాహాలే దేశంలో అస్థిరతను సృష్టించాయని.. త్వరలోనే సుస్థిరత నెలకొంటుందని ఆశాభావం వ్యక్తంచేశారు.

అస్థిరతకు ప్రజాస్వామ్యమే ఔషధమని గుర్తెరగాలన్నారు. బంగ్లాలో ఉగ్రవాదం, ఇస్లామక్‌ ఛాందసవాద కార్యకలాపాలు, హసీనా తండ్రి, బంగ్లా జాతిపిత షేక్‌ ముజిబుర్‌ రహమాన్‌ విగ్రహాన్ని కూల్చడం గురించి ప్రశ్నించగా.. ఈ ఘటనలకు హసీనాయే బాధ్యురాలని ఆయన ఆరోపించారు. ముజిబుర్‌ రహమాన్‌ ప్రతిష్ఠను ఆమె మసకబార్చారని ఆరోపించారు.

దేశంలో అసలైన ప్రజాస్వామ్యం నెలకొంటే మైనారిటీలు సురక్షితంగా ఉంటారని చెప్పారు. ఇంకోవైపు.. హసీనాకు భారత్‌ మద్దతివ్వడంపై బీఎన్‌పీ సీనియర్‌ నేత గయేశ్వర్‌ రాయ్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు.

బంగ్లాలోని ఒక పార్టీకి మద్దతివ్వడం కాకుండా యావద్దేశానికి ఇండియా మద్దతివ్వాలని కోరారు. ‘రెండు దేశాల ప్రజల నడుమ ఎలాంటి సమస్యలూ లేవు. కానీ భారత్‌ మొత్తం బంగ్లాదేశ్‌ను కాకుండా ఒక్క పార్టీనే ప్రోత్సహించడం సబబా’ అని ప్రశ్నించారు. తమ పార్టీ హిందువుల వ్యతిరేకి కాదన్నారు. తాము స్వాతంత్య్రం సంపాదించేందుకు ఇండియా తోడ్పడిందని.. ఆ దేశానికి వ్యతిరేకంగా వ్యవహరించే అవకాశమే లేదని స్పష్టంచేశారు. కాగా.. బంగ్లాలో జాతివ్యతిరేక, మతపరమైన దాడులకు, హింసాకాండకు తాము వ్యతిరేకమని ఐరాస తెలిపింది.


  • బంగ్లాతో సరిహద్దు పర్యవేక్షణకు కమిటీ

బంగ్లాదేశ్‌లో హిందువులపై ప్రాణాంతక దాడులు, ఆస్తుల లూటీ, ధ్వంసం నేపథ్యంలో ఆ దేశ ప్రజలు భారీ సంఖ్యలో భారత్‌లోకి ప్రవేశించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

వారు రాకుండా సరిహద్దు భద్రతా దళం (బీఎ్‌సఎఫ్‌) అడ్డుకుంటోంది. ఈ నేపథ్యంలో సరిహద్దు భద్రతను, బంగ్లాలోని భారతీయులు, హిందువులు, ఇతర వర్గాల భద్రతను పర్యవేక్షించేందుకు ప్రధాని మోదీ ఓ కమిటీని నియమించారని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా వెల్లడించారు.

ఈ కమిటీ బంగ్లా అధికారులతో నిరంతరం సంప్రదిస్తుంటుందని తెలిపారు. ఇదిలా ఉండగా, బంగ్లాదేశ్‌లో హిందువులపై హింసాత్మక దాడులు జరగడంపై ఆర్‌ఎ్‌సఎస్‌ తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. అక్కడ హిందువులు, ఇతర మైనారిటీల భద్రతకు సాధ్యమైనంత కృషిచేయాలని సంఘ్‌ ప్రధాన కార్యదర్శి హోసబోలే శుక్రవారం మోదీ ప్రభుత్వాన్ని కోరారు.

Updated Date - Aug 10 , 2024 | 05:18 AM