China : రోబో కిడ్నాపర్
ABN , Publish Date - Nov 21 , 2024 | 03:58 AM
అర అడుగు ఎత్తున్న అతి తెలివైన చిన్న రోబో ఒకటి.. పక్క దుకాణంలోకి వెళ్లి, తన కృత్రిమ మేధను ఉపయోగించి 12 పెద్ద రోబోల్ని నైస్‌గా కిడ్నాప్ చేసింది!
చైనాలో 12 పెద్ద రోబోల్ని కిడ్నాప్ చేసిన చిన్న రోబో
సీసీ టీవీ దృశ్యాలు వైరల్
ఎవరో ప్రోగ్రామింగ్ ద్వారా ఇలా చేసి ఉండొచ్చన్న అనుమానాలు
ఈ చిట్టి.. జగజ్జెట్టి
న్యూఢిల్లీ, నవంబరు 20: అర అడుగు ఎత్తున్న అతి తెలివైన చిన్న రోబో ఒకటి.. పక్క దుకాణంలోకి వెళ్లి, తన కృత్రిమ మేధను ఉపయోగించి 12 పెద్ద రోబోల్ని నైస్‌గా కిడ్నాప్ చేసింది! చైనాలో జరిగిన ఈ ఘటన తాలూకూ సీసీ టీవీ ఫుటేజీ ఇంటర్‌నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఏముందంటే.. హాంగ్‌ఝౌ అనే రోబోల తయారీ సంస్థకు చెందిన ఎర్‌బై అనే చిన్న రోబో ఒకటి.. షాంఘై రోబోటిక్స్ షోరూమ్‌కి వెళ్లింది. అక్కడ దానికన్నా పెద్దవి డజను రోబోలున్నాయి. వాటిని ఇది ఏమి అడిగిందో ఏమోగానీ.. ఆ పెద్ద రోబోల్లో ఒకటి.. ‘నేను అనుమతి లేకుండా బయటకు వెళ్లను’ అని చెప్పింది. దానికి ఈ చిన్న రోబో.. ‘అయితే, నువ్వు ఇంటికెళ్లవా?’ అని అడిగింది. అప్పుడా పెద్ద రోబో.. ‘నాకు ఇల్లంటూ ఏదీ లేదు’ అని సమాధానమిచ్చింది. ‘‘అయితే నాతో వచ్చేయండి’ అంటూ ఆ చిన్న రోబో ముందుకు కదలగానే.. వశీకరణానికి గురైనట్టుగా ఆ షోరూమ్‌లోని పెద్ద రోబోలన్నీ దాన్ని అనుసరించాయి.
తొలుతు చైనాలో ఈ వీడియో వైరల్ అయినప్పుడు ఇదేదో కల్పితమని అందరూ అనుకున్నారు. కానీ.. రెండు రోబో కంపెనీలూ ఈ వీడియో కల్పితం కాదని, నిజంగా జరిగిందని ధ్రువీకరించాయని సమాచారం. పెద్ద రోబోల సిస్టమ్స్‌లో భద్రతపరంగా ఉన్న కొన్ని లోపాలను ఉపయోగించుకుని ఎర్‌బై వాటిని కిడ్నాప్ చేసిందని, వాటిపై నియంత్రణ సాధించగలిగిందని విచారణలో వెల్లడైంది. అయితే.. చిన్నరోబో తనంత తాను ఇలా చేయడం అసాధ్యమని షాంఘై రోబోటిక్స్‌స కంపెనీ చెబుతోంది. దీంతో.. ఎవరో దానికి అలా ప్రోగ్రామింగ్ చేసి ఉండొచ్చనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.