కొత్త సర్కారు దిశగా సిరియా
ABN , Publish Date - Dec 10 , 2024 | 03:46 AM
కల్లోలిత సిరియా సుస్థిర ప్రభుత్వ ఏర్పాటు దిశగా ముందుకు సాగుతోంది. తిరుగుబాటు దళాలకు నేతృత్వం వహిస్తున్న హయాత్ తహ్రీర్ అల్ షమ్(హెచ్‌టీఎస్) ఈ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది.
అల్-బషీర్‌కు సమన్వయ బాధ్యతలు.. ప్రకటించిన తిరుగుబాటుదారులు
దేశవ్యాప్తంగా ఖైదీల విడుదల
అసద్‌కు ఆశ్రయం కల్పించిన రష్యా
డమాస్క్‌స/న్యూఢిల్లీ, డిసెంబరు 9: కల్లోలిత సిరియా సుస్థిర ప్రభుత్వ ఏర్పాటు దిశగా ముందుకు సాగుతోంది. తిరుగుబాటు దళాలకు నేతృత్వం వహిస్తున్న హయాత్ తహ్రీర్ అల్ షమ్(హెచ్‌టీఎస్) ఈ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. అంతర్గత విభేదాల్లేకుండా.. గందరగోళానికి తావివ్వకుండా, సామరస్యపూర్వకంగా సర్కారు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో సమన్వయానికి సిరియా సాల్వేషన్ ప్రభుత్వ(తిరుగుబాటు దారుల పాలనలో ఉన్న ప్రాంతాలు) అధినేత మహమ్మద్ అల్-బషీర్‌కు బాధ్యతలను అప్పగించారు. వివిధ వర్గాలతో ఆయన చర్చించి, సమన్వయంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటు చేస్తారు. ఈ క్రమంలో అల్-బషీర్ సోమవారం వరుస భేటీలు ఏర్పాటు చేశారు. హెచ్‌టీఎ్‌సతోపాటు..
అహ్మద్ అల్-షరా సంస్థ, సిరియా ప్రధాని మహమ్మద్ అల్-జలాలీ, ఇతర తిరుగుబాటు వర్గాలతో సమావేశమవుతున్నారు. మరోవైపు, సిరియా అధ్యక్షుడు అసద్ రష్యాకు పయనమవ్వగానే.. రెబెల్స్ నాయకుడు అల్-జోలానీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ‘‘అసద్ పారిపోవడంతో దేశం పవిత్రమైంది. సిరియన్లు ఇక భయపడాల్సిన అవసరం లేదు. వివిధ దేశాల్లో శరణార్థులుగా ఉన్న సిరియన్లు వెనక్కి తిరిగి రావాలి. వారికి స్వాగతం పలికేందుకు సిరియాలోని విమానాశ్రయాలను సిద్ధం చేస్తున్నాం. ఆదివారం (ఈ నెల 8) కంటే ముందు జరిగిన నేరాలకు సంబంధించిన అన్ని శిక్షలను రద్దు చేస్తాం. నిందితులకు క్షమాభిక్ష ప్రసాదిస్తాం’’ అని ప్రకటించారు. దౌత్యవేత్తల ఆఫీసులు, ఇళ్లకు భద్రత కల్పిస్తామన్నారు. ఆయన ప్రసంగించిన వెంటనే.. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జైళ్లలోని ఖైదీలు విడుదలయ్యారు.
మాస్కోకు చేరుకున్న అసద్
ఆదివారం ఉదయం డమాస్కస్ నుంచి పారిపోయిన సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అసద్, అతని కుటుంబ సభ్యులు మాస్కోకు చేరుకున్నట్లు రష్యా ప్రభుత్వం ప్రకటించింది. ఆయనకు రాజకీయ ఆశ్రయం కల్పిస్తున్నట్లు తెలిపింది. అయితే.. డమాస్కస్ నుంచి పారిపోవడానికి ముందు అసద్ తన కార్యాలయ అధికారులు, సైన్యాధికారులకు కీలకమైన ఆదేశాలు జారీ చేశారు. ‘‘వివాదాల్లేకుండా.. శాంతియుతంగా అధికారాన్ని బదిలీ చేయండి. నా భవిష్యత్ గురించి ఆందోళన వద్దు’’ అని సూచించినట్లు రష్యా మీడియా సంస్థలు పేర్కొన్నాయి.
రష్యా వైఖరిలో మార్పు!
అసద్ విషయంలో రష్యా వైఖరిలో మార్పు కనిపిస్తోందని పాశ్చాత్య మీడియా కథనాలను ప్రచురించింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైన నేపథ్యంలో.. అసద్‌కు దూరంగా ఉండాలని రష్యా నిర్ణయించినట్లు పేర్కొంది. సోమవారం ఉదయం మాస్కోలోని సిరియా రాయబార కార్యాలయం వద్ద రెబెల్స్ పతాకాన్ని ఎగురవేయడానికి కూడా రష్యా అనుమతించడాన్ని ఈ అనుమానాలు బలపరుస్తున్నట్లు తెలిపింది. ఇదిలా ఉండగా, డమాస్కస్, హోమ్‌లోని హిజ్బుల్లా స్థావరాలపై అడపాదడపా దాడులు చేస్తున్న ఇజ్రాయెల్.. ఆదివారం సాయంత్రం నుంచి సిరియాపై దూకుడు పెంచింది. సోమవారం డమాస్కస్‌లో ఉన్న రసాయన ఆయుధాల డిపోలపై బాంబుల వర్షం కురిపించింది.
సిరియాలో స్థిరత్వం రావాలి: భారత్
సిరియాలో పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. సిరియా సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతను కాపాడేందుకు ఆ దేశంలోని అన్ని పార్టీలు సమష్టిగా కృషి చేయల్సిన అవసరం ఉందని పేర్కొంది. సిరియాలో శాంతిస్థాపన జరగాలని ఆకాంక్షించింది. అక్కడ ఉన్న భారతీయులంతా క్షేమంగా ఉన్నారని తెలిపింది.