Donald Trump: కెనడా, మెక్సికోలకు అన్ని రాయితీలా.. అవి అమెరికాలో విలీనమైతేనే మేలు
ABN , Publish Date - Dec 10 , 2024 | 03:19 AM
పొరుగు దేశాలకు అమెరికా ఇస్తున్న రాయితీలపై కాబోయే ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో స్పందించారు.
న్యూయార్క్, డిసెంబరు 9: పొరుగు దేశాలకు అమెరికా ఇస్తున్న రాయితీలపై కాబోయే ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో స్పందించారు. కెనడా, మెక్సికోకు భారీగా రాయితీలివ్వడం కంటే ఆ రెండు దేశాలు అమెరికాలో విలీనమైతేనే బాగుంటుందని వ్యాఖ్యానించారు. అమెరికాలోకి ఆయా దేశాల నుంచి అక్రమ వలసదారులను నియంత్రించకపోతే దిగుమతులపై భారీ సుంకాలు విధిస్తానని మరోసారి హెచ్చరించారు. ఆదివారం ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ పలు అంశాలపై మాట్లాడారు. ‘మెక్సికోకు ఏటా 300 బిలియన్ డాలర్లు (రూ.24 లక్షల కోట్లు), కెనడాకు 100 బిలియన్ డాలర్ల (రూ.8 లక్షల కోట్లకు పైగా) రాయితీలు ఇస్తున్నాం.. అసలు ఎందుకు ఆ దేశాలకు మనం రాయితీలు ఇవ్వాలి. దానికంటే ఆ దేశాలు అమెరికాలో విలీనమై రాష్ట్రాలుగా మారితే మేలు’ అని అన్నారు. ఇక అక్రమ వలసదారులపై స్పందిస్తూ.. అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచే పుట్టుకతో సంక్రమించే పౌరసత్వంపై దృష్టి పెడతానని చెప్పారు. వచ్చే నాలుగేళ్లలో అక్రమ వలసదారులను అమెరికా దాటిస్తానని ప్రకటించారు.