Share News

Washington : అధ్యక్ష రేసు నుంచి బైడెన్‌ ఔట్‌?

ABN , Publish Date - Jul 20 , 2024 | 03:19 AM

వృద్ధాప్యంతో, అనారోగ్యంతో సతమతమవుతున్నా.. ప్రసంగాలు, డిబేట్ల సమయంలో తడబడుతూ సమర్థంగా వాదనలు వినిపించలేకపోతున్నా..

Washington : అధ్యక్ష రేసు నుంచి బైడెన్‌ ఔట్‌?

  • నేడో రేపో స్వీయ ప్రకటన?

  • కమలా హ్యారిస్‌కు మాత్రం

  • మద్దతివ్వనంటున్న ప్రెసిడెంట్‌

  • రిపబ్లికన్‌ వర్గాల వెల్లడి

  • రేపటిలోగా ప్రకటనకు అవకాశం!.. అయితే కమలా హ్యారి్‌సకు మద్దతివ్వనని స్పష్టీకరణ

వాషింగ్టన్‌, జూలై 19: వృద్ధాప్యంతో, అనారోగ్యంతో సతమతమవుతున్నా.. ప్రసంగాలు, డిబేట్ల సమయంలో తడబడుతూ సమర్థంగా వాదనలు వినిపించలేకపోతున్నా.. రెండోసారి అధ్యక్ష పదవిలో కొనసాగి తీరతానని భీష్మించుకున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ (81).. ఇప్పుడు వెనక్కి తగ్గుతున్నట్లు తెలిసింది. డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థిగా తప్పుకొనేందుకు అంగీకరించిన ఆయన..

ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ అభ్యర్థిత్వానికి మద్దతివ్వడానికి మాత్రం నిరాకరించారని ఆ పార్టీ వర్గాలను ఉటంకిస్తూ జర్నలిస్టు, న్యూస్‌మ్యాక్స్‌ చానల్‌ వ్యాఖ్యాత మార్క్‌ హాల్పెరిన్‌ వెల్లడించారు. ఆదివారంలోపు ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముందని గురువారం తెలిపారు. అయితే దీనిపై బైడెన్‌ గానీ, ఆయన ప్రచార బృందం గానీ ఇంతవరకు స్పందించలేదు.

అభ్యర్థిని అధికారికంగా ఖరారుచేసేందుకు డెమోక్రాటిక్‌ పార్టీ జాతీయ సదస్సు వచ్చే నెలలో జరుగనుంది. బైడెన్‌కు నిన్నమొన్నటిదాకా అండగా నిలబడిన మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, ప్రతినిధుల సభ మాజీ స్పీకర్‌ నాన్సీ పెలోసీ.. ఇటీవలి కాలంలో ఆయన అనారోగ్యంపై ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. తాజాగా ఆయనకు కొవిడ్‌ సోకింది.

ఆయన విజయావకాశాలు బాగా తగ్గిపోయాయని ఒబామా పార్టీ సన్నిహితులతో అన్నారు. బైడైన్‌ అనారోగ్యం ఆందోళన కలిగిస్తోందని.. ఈ నేపథ్యంలో రెండోసారి బరిలో దిగే అంశంపై ఆయన తీవ్రంగా ఆలోచించాలని సూచించినట్లు ‘వాషింగ్టన్‌ పోస్ట్‌’ పత్రిక తెలియజేసింది.

మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌తో కొన్నాళ్ల కింద జరిగిన డిబేట్‌లో బైడెన్‌ తేలిపోయాక.. చాలా మంది డెమోక్రాటిక్‌ సెనేటర్లు, ప్రతినిధుల సభ సభ్యులు, సీనియర్‌ నేతలు ఆయన తప్పుకోవాలని డిమాండ్‌ చేయడం మొదలుపెట్టారు. రేసు నుంచి వైదొలగకపోతే పరాజయం తప్పదని నాన్సీ పెలోసీ కూడా బైడెన్‌కు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. మరోవైపు.. కొవిడ్‌ కారణంగా బైడెన్‌ ప్రస్తుతం డెలవర్‌లో ఐసొలేషన్‌లో ఉన్నారు. తన అభ్యర్థిత్వంపై లేనిపోని ఊహాగానాలు వద్దని అన్నారు.

Updated Date - Jul 20 , 2024 | 03:20 AM