రష్యాలో ఏం జరుగుతోంది?
ABN , Publish Date - Nov 21 , 2024 | 05:21 AM
యుద్ధం ప్రారంభమైన 1000వ రోజున ఉక్రెయిన్ దీర్ఘశ్రేణి క్షిపణులతో దాడులు జరిపిన నేపథ్యంలో.. రష్యా అప్రమత్తమైంది.
అణు కేంద్రాలను సందర్శిస్తున్న సెర్గీ షోయిగు
కీవ్‌లో అమెరికా, ఇటలీ, ఎంబసీలు ఖాళీ
మాస్కో, నవంబరు 20: యుద్ధం ప్రారంభమైన 1000వ రోజున ఉక్రెయిన్ దీర్ఘశ్రేణి క్షిపణులతో దాడులు జరిపిన నేపథ్యంలో.. రష్యా అప్రమత్తమైంది. రష్యా భద్రత మండలి కార్యదర్శి సెర్గీ షోయిగు ఆ దేశంలోని అణు కేంద్రాలను సందర్శిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం సరోవ్ అణు కేంద్రానికి చేరుకున్నారు. అక్కడి లేజర్, సూపర్ కంప్యూటర్లు, ఇతర సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిశీలించారు. అయితే, ఉక్రెయిన్ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు అర్థవంతమైన ఎంపికలను మాస్కో స్వాగతిస్తుందని ఐక్యరాజ్య సమితి(ఐరాస)లో రష్యా మొదటి డిప్యూటీ శాశ్వత ప్రతినిధి పాలియాన్‌స్కీ వెల్లడించారు. మరోవైపు.. ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్‌లో ఉన్న తమ రాయబార కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది.
అమెరికా ప్రకటన తర్వాత ఇటలీ, స్పెయిన్, గ్రీస్ కూడా ఇదే తరహా ప్రకటనలు చేశాయి. రష్యాపై దీర్ఘశ్రేణి క్షిపణులతో దాడులకు ఉక్రెయిన్‌కు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో.. తమ రాయబార కార్యాలయం లక్ష్యంగా దాడులు జరిగే ముప్పు ఉందన్న నిఘావర్గాల సమాచారంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా వివరించింది. తమ ఉద్యోగులను సురక్షిత షెల్టర్లలో తలదాచుకోవాలని సూచించినట్లు తెలిపింది. కాగా.. అమెరికా-రష్యా మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో ఇరుదేశాల మధ్య హాట్‌లైన్‌కు స్వస్తి పలికినట్లు క్రెమ్లిన్ ప్రతినిధి పెస్కోవ్ వెల్లడించారు.