High Court: వారికి 1 శాతం రిజర్వేషన్ కల్పించాల్సిందే.. స్పష్టం చేసిన హైకోర్టు
ABN , Publish Date - Jun 16 , 2024 | 08:40 PM
పశ్చిమబెంగాల్‌లోని(West Bengal) అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్‌జెండర్లకు(Transgenders) ఒక శాతం రిజర్వేషన్ కల్పించాలని కలకత్తా హైకోర్టు.. దీదీ సర్కార్‌ను ఆదేశించింది.
కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లోని(West Bengal) అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్‌జెండర్లకు(Transgenders) ఒక శాతం రిజర్వేషన్ కల్పించాలని కలకత్తా హైకోర్టు.. దీదీ సర్కార్‌ను ఆదేశించింది. ట్రాన్స్‌జెండర్లను కేవలం సమానంగా చూస్తే సరిపోదని అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ వారికి ఒక శాతం రిజర్వేషన్‌ను అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. తమ ఆదేశాలను అమలు చేయాలని జస్టిస్ రాజశేఖర్ మంథా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.
టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) 2014, TET 2022లో ఉత్తీర్ణత సాధించిన ఓ ట్రాన్స్‌జెండర్‌ని అధికారులు కౌన్సిలింగ్, ఇంటర్వ్యూకి పిలవలేదు. దీంతో బాధితుడు హైకోర్టును ఆశ్రయించాడు. విచారించిన కోర్టు థర్డ్ జెండర్‌గా పరిగణిస్తూ వారి హక్కుల్ని కాపాడాలని 2014లో సుప్రీం కోర్టు చెప్పినట్లు హైకోర్టు గుర్తు చేసింది. ట్రాన్స్‌జెండర్లను వెనకబడినవర్గంగా గుర్తించి అన్ని రంగాల్లోనూ చేయూతనివ్వాలని సూచించింది.
వారిని సామాజికంగా, విద్యపరంగా వెనుకబడిన తరగతుల పౌరులుగా పరిగణించేందుకు చర్యలు తీసుకోవాలని, విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ నియామకాల్లో అన్ని రకాల రిజర్వేషన్లను పొడిగించాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించిందని జస్టిస్ రాజశేఖర్ మంథా పేర్కొన్నారు.
ట్రాన్స్‌జెండర్లు సమాన ఉపాధి అవకాశాలకు అర్హులని గతంలోనే నోటిఫికేషన్ జారీ చేసినట్లు పశ్చిమ బెంగాల్ చీఫ్ సెక్రటరీ హైకోర్టుకు తెలియజేశారు.కాగా, సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్రంలో ట్రాన్స్‌జెండర్లకు రిజర్వేషన్లు ఇంకా కల్పించలేదని జస్టిస్ మంథా అన్నారు. పిటిషనర్‌ను ప్రత్యేక కేసుగా పరిగణించి ఇంటర్వ్యూ, కౌన్సెలింగ్‌కు ఏర్పాట్లు చేయాలని పశ్చిమ బెంగాల్ బోర్డ్ ఆఫ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ కార్యదర్శిని ఆయన ఆదేశించారు.