Share News

Union Government : టైమంటే.. టైమే..9 కల్లా రావాల్సిందే

ABN , Publish Date - Jun 23 , 2024 | 03:25 AM

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆఫీసుకు హాజరయ్యే విషయంలో సమయపాలనను ఖచ్చితంగా పాటించాల్సిందే. టైమంటే టైముకు రావాల్సిందే.

Union Government : టైమంటే.. టైమే..9 కల్లా రావాల్సిందే

  • 15 నిమిషాలే గ్రేస్‌ పీరియడ్‌.. సీఎల్‌లో కోత తప్పదు

  • కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీవోపీటీ విభాగం హెచ్చరికలు

న్యూఢిల్లీ, జూన్‌ 22: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆఫీసుకు హాజరయ్యే విషయంలో సమయపాలనను ఖచ్చితంగా పాటించాల్సిందే. టైమంటే టైముకు రావాల్సిందే. ట్రాఫిక్‌ జామ్‌ అయింది.. బండి రిపోర్‌ వచ్చింది.. మా ర్నింగ్‌ మెళకువ రాలేదు. వంటి కుంటి సాకులు చెప్పేందుకు వీల్లేదు. ఖచ్చితంగా ఉదయం 9 గంటలకల్లా ఆఫీసుకు వచ్చి పంచ్‌ వేయాల్సిందే. మహా అయితే.. మరో 15 నిమిషాలు గ్రేస్‌ పిరియడ్‌ కింద ఆలస్యం కావొచ్చు. అది కూడా రోజూ కాదు. ఎప్పుడైనా అత్యవసరమైతే. తరచుగా వినియోగించుకుంటే కూడా ఇబ్బందే.

ఇక, 9.15 గంటల తర్వాత ఆఫీసుకువచ్చేవారికి క్యాజ్‌వల్‌ లీవ్‌(సీఎల్‌)లో ఆఫ్‌డేని సెలవుగా పరిగణించి కోతపెడతారు. ఈ మేరకు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌, ట్రైనింగ్‌ విభాగం ఆదేశాలు జారీ చేసింది. ఆఫీసుకు ఆలస్యంగా వచ్చే వారిని కట్టడి చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఈ ఆదేశాలు సీనియర్‌ ఉద్యోగుల నుంచి జూనియర్‌ ఉద్యోగుల వరకు అందరికీ వర్తిస్తాయని ఆదేశాల్లో పేర్కొంది. అందరూ బయోమెట్రిక్‌ అటెండెన్స్‌ను వినియోగించుకోవాలని కోరింది.


కరోనా తర్వాత నాలుగేళ్లుగా ఉద్యోగులు సమయ పాలన పాటించడంలేదన్న ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలోనే ఈ చర్యలు తీసుకున్నట్టు తెలిపింది. అంతేకాదు.. ఎవరైనా ఉద్యోగి ఏ కారణంతో అయినా.. ఆఫీసుకు రాలేక పోతే.. ముందుగానే సంబంధిత శాఖాధిపతికి సమాచారం అందించాలని స్పష్టం చేసింది. ముందుగా తెలిపిన వారికే సీఎల్‌ వర్తిస్తుందని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ఉదయం 9గంటల నుంచి పనివేళలు ప్రారంభమవుతాయి. సాయంత్రం 5.30 గంటల వరకు కొనసాగుతాయి. అయితే.. జూనియర్‌ అధికారులు ఈ సమయపాలనను పాటించకుండా ఆఫీసులకు ఆలస్యంగా వస్తున్నారని, దీంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌, ట్రైనింగ్‌ విభాగం తాజా ఆదేశాలు జారీ చేసింది.

Updated Date - Jun 23 , 2024 | 06:58 AM