Share News

Rainfall Prediction: మన ఊర్లో వర్షం 5రోజుల ముందే తెలుసుకోవచ్చు!

ABN , Publish Date - Oct 24 , 2024 | 04:57 AM

మనం ఉంటున్న ఊర్లోనే వర్షం ఎప్పుడు పడుతుందనే విషయాన్ని ఐదు రోజుల ముందే కచ్చితంగా తెలుసుకోగలిగితే? అది రైతులకు ఎంతో ప్రయోజనం కదూ.

Rainfall Prediction: మన ఊర్లో వర్షం 5రోజుల ముందే తెలుసుకోవచ్చు!

  • నేడు ప్రారంభించనున్న కేంద్రం.. రైతులకు ఎంతో మేలు

న్యూఢిల్లీ, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): మనం ఉంటున్న ఊర్లోనే వర్షం ఎప్పుడు పడుతుందనే విషయాన్ని ఐదు రోజుల ముందే కచ్చితంగా తెలుసుకోగలిగితే? అది రైతులకు ఎంతో ప్రయోజనం కదూ. వరి కోతలు, ధాన్యం ఆరబోత పనులను రైతన్నలు వాయిదా వేసుకునే అవకాశం ఉంటుంది. వర్షమే కాదు.. ఉష్ణోగ్రతలు గాలుల వేగం, మేఘాల కదలిక వంటి సమగ్ర సమాచారాన్ని ఐదు రోజుల ముందే గ్రామ ప్రజలకు తెలియనుంది. ఈమేరకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విధానాన్ని ప్రవేశపెట్టనుంది. కేంద్ర పంచాయితీరాజ్‌ శాఖ ప్రారంభించబోయే ఆ వినూత్న పథకానికి భారత వాతావరణ సంస్థ (ఐఎండీ), భూవిజ్ఞాన మంత్రిత్వశాఖలు సంయుక్తంగా సహకరించనున్నాయి.


‘గ్రామ స్థాయిలో వాతావరణ సమాచారం’ అనే శీర్షికన ఈ కార్యక్రమాన్ని గురువారం ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి రాజీవ్‌ రంజన్‌ సింగ్‌ (లాలన్‌ సింగ్‌) ప్రారంభించనున్నారు. ప్రకృతు విపత్తుల సమయంలో ముందస్తు వాతావరణ సమాచారాన్ని అందించడంవల్ల గ్రామస్థులు సురక్షిత ప్రాంతాలకు తరలేవీలుంది. కేంద్ర ప్రభుత్వ 100 రోజుల కార్యక్రమంలో భాగమైన ఈ పథకం, గ్రామస్థాయి పాలనను బలోపేతం చేయడం, సాగు విధానాలను మరింత సులభతరం చేయడం, పరోక్షంగా రైతులకు తగిన ప్రోత్సాహాన్ని అందించడం వంటి లక్ష్యాలను నెరవేరుస్తుందని కేంద్ర పంచాయతీ రాజ్‌ శాఖ తెలిపింది.


దీనివల్ల నాట్లు, పొలాలకు సాగునీరు అందించడం, నూర్పిళ్లు వంటి వ్యవసాయ కార్యకలాపాలకు సంబంధించిన నిర్ణయాలను తీసుకోవడం రైతులకు సులభతరం అవుతుంది. కాగా తొలిసారిగా స్థానిక వాతావరణ పరిస్థితుల గురించిన తాజా సమాచారాన్ని మూడు డిజిటల్‌ వేదికల ద్వారా మంత్రిత్వశాఖ గ్రామ పంచాయతీలకు అందిస్తుంది. ‘ఇ-గ్రామస్వరాజ్‌’, ‘మేరి పంచాయత్‌ యాప్‌, ‘గ్రామ్‌ మన్‌ చిత్ర’ వేదికల ద్వారా ఈ సమాచారాన్ని గ్రామస్థాయికి చేరవేస్తారు. మేరి పంచాయత్‌ యాప్‌’ స్థానికులు నేరుగా సమస్యల గురించి చెప్పుకోవడానికి, ‘గ్రామ్‌ మన్‌ చిత్ర’ యాప్‌ను అభివృద్ధి ప్రణాళికా రచనల కోసం ఉద్దేశించారు.


అధికారులు, ప్రజాప్రతినిధులకు ముందస్తు శిక్షణ

‘గ్రామస్థాయిలో వాతావరణ సమాచారం’ కార్యక్రమ ప్రారంభం సందర్భంగా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించాలని కేంద్ర భావిస్తోంది. పంచాయితీరాజ్‌ అధికారులు, ప్రజా ప్రతినిధులు సహా 200 మంది శిక్షణ ఇవ్వాలని కేంద్ర యోచిస్తోంది. ముందస్తుగా వాతావరణ సమాచారాన్ని అందుకుని, క్షేత్రస్థాయిలో పరిస్థితులకు అనుగుణంగా అవసరమైన నిర్ణయాలు తీసుకోవడం వీరి బాధ్యత. ఉష్ణోగ్రత ఎలా ఉండబోతుంది? వర్షం వచ్చే అవకాశమెంత? గాలుల వేగం ఎలా ఉండే అవకాశం ఉంది? మేఘా ల కదలిక వంటి సమాచారాన్ని గ్రామ పంచాయతీలకు వీరు అందిస్తారు.

Updated Date - Oct 24 , 2024 | 09:39 AM