Share News

MP: ఛత్తీస్‍గఢ్‍లో 9మందిని మింగేసిన రెండు బావులు

ABN , Publish Date - Jul 06 , 2024 | 03:45 AM

ఛత్తీస్‍గఢ్‍లో జాంజ్‌గీర్‌-చంపా జిల్లా కికిర్దా గ్రామానికి చెందిన రామచంద్ర జైశ్వాల్‌(60) ఇంటికి ఆనుకొని 30 అడుగుల లోతైన బావి ఉంది. ఇంటి అవసరాల కోసం బోర్‌ వేయించడంతో కొన్ని నెలల క్రితం కర్ర చెక్కలతో ఆ బావిని మూసేశారు.

MP: ఛత్తీస్‍గఢ్‍లో 9మందిని మింగేసిన రెండు బావులు

  • మృత్యుబావులు

  • జాంజ్‌గీర్‌ జిల్లాలో ఐదుగురు.. కోర్బాలో నలుగురి దుర్మరణం

చర్ల/కోర్బా, జూలై 5: ఛత్తీస్‍గఢ్‍లో జాంజ్‌గీర్‌-చంపా జిల్లా కికిర్దా గ్రామానికి చెందిన రామచంద్ర జైశ్వాల్‌(60) ఇంటికి ఆనుకొని 30 అడుగుల లోతైన బావి ఉంది. ఇంటి అవసరాల కోసం బోర్‌ వేయించడంతో కొన్ని నెలల క్రితం కర్ర చెక్కలతో ఆ బావిని మూసేశారు. ఇటీవల ఆ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలు, బలమైన గాలుల కారణంగా బావిపై ఉన్న కర్రచెక్కల్లో ఒకటి అందులో పడిపోయింది. దాన్ని తీయడానికి శుక్రవారం ఉదయం రామచంద్ర ఆ బావిలోకి దిగాడు. మధ్యలోకి వెళ్లగానే స్పృహ తప్పి బావిలో పడిపోయాడు. అది చూసి అతని భార్య అరవడంతో.. పక్కనే ఉంటున్న రమేశ్‌ పటేల్‌(50) అతని ఇద్దరు కుమారులు జితేంద్ర(25), రాజేంద్ర(20) పరుగెత్తుకుంటూ వచ్చి బావిలోకి దిగారు.

వారు కూడా బావిలోని నీళ్లలో పడిపోయారు. నలుగురూ బయటకు రాకపోవడంతో టీకేశ్వర్‌ చంద్ర(25) అనే మరో వ్యక్తి వారిని కాపాడటానికి బావి లోపలికి వెళ్లాడు. అతను కూడా ఎంతసేపటికీ బయటకు రాలేదు. దీంతో భయపడిపోయిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఎస్‌డీఆర్‌ఎఫ్‌ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు ఐదుగురి మృతదేహాలను వెలికితీశారు. పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. బావిని మూసివేయడం వల్ల అందులో విషవాయువు తయారై ఉంటుందని, దాన్ని పీల్చడం వల్లే ఐదుగురూ చనిపోయి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. మరణాలకు గల కచ్చితమైన కారణం పోస్టుమార్టం తర్వాత తెలుస్తుందన్నారు. బావిలో ఐదడుగుల మేర నీళ్లు ఉన్నాయని తెలిపారు.

ఛత్తీ్‌సగఢ్‌లో కోర్బా జిల్లాలోని జూరాలి గ్రామంలో కూడా ఇదే తరహా ఘటన జరిగింది. గ్రామానికి చెందిన జహ్రూ పటేల్‌(60) శుక్రవారం మధ్యాహ్నం వ్యవసాయ పనుల్లో ఉండగా ప్రమాదవశాత్తూ బావిలో పడిపోయాడు. అతన్ని కాపడానికి కూతురు సపినా(16) బావిలోకి దిగింది. ఆ తర్వాత వారిద్దరి కోసం అదే కుటుంబానికి చెందిన శివ్‌చరణ్‌(45), మన్‌బోధ్‌(57) బావిలోకి వెళ్లారు. నలుగురూ బావిలోనే చనిపోయారు. ఈ ఘటనలో కూడా మరణాలకు విషవాయువే కారణం కావొచ్చని అనుమానిస్తున్నారు. రెండు ఘటనలపై ఛత్తీ్‌సగఢ్‌ సీఎం విష్ణుదేవ్‌ సాయ్‌ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. జాంజ్‌గీర్‌ మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున, జూరాలి గ్రామ మృతుల కుటుంబాలకు రూ.4లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.

Updated Date - Jul 06 , 2024 | 03:45 AM