UP: యూపీలో ఘోరం.. పొలంలోకి మేక వెళ్లిందని దళిత మహిళపై దాష్టీకం
ABN , Publish Date - Mar 30 , 2024 | 06:39 PM
మేక పొలంలోకి వచ్చిందనే కారణంతో ఓ దుర్మార్గుడు దళిత మహిళను విచక్షణారహితంగా కొట్టిన ఘటన ఉత్తర ప్రదేశ్‌లో సంచలనం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూపీలోని బులంద్‌షహర్‌లో 60 ఏళ్ల దళిత మహిళ మేకలు మేపడానికి వెళ్లింది.
ఢిల్లీ: మేక పొలంలోకి వచ్చిందనే కారణంతో ఓ దుర్మార్గుడు దళిత మహిళను విచక్షణారహితంగా కొట్టిన ఘటన ఉత్తర ప్రదేశ్‌లో సంచలనం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూపీలోని బులంద్‌షహర్‌లో 60 ఏళ్ల దళిత మహిళ మేకలు మేపడానికి వెళ్లింది. ఈ క్రమంలో ఓ మేక పక్కనే ఉన్న పొలంలో పడింది. దీన్ని గమనించిన సదరు పొలం యజమాని ఆగ్రహంతో ఊగిపోయాడు. మేక ఉన్న ప్రాంతానికి చేరుకుని మహిళపై తీవ్ర దుర్భాషలాడాడు.
పక్కనే ఉన్న కర్ర అందుకుని ఆమెను విచక్షణారహితంగా కొట్టాడు. దీనికితోడు కులం పేరుతో అవమానిస్తూ మరింతగా బాదసాగాడు. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ మహిళ దెబ్బలకు తాళలేక స్పృహ కోల్పోయింది. ఘటనను మరో వ్యక్తి వీడియో తీశాడు. వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో వైరల్‌గా మారింది.
X: ఎక్స్ కమ్యూనిటీలో ఇకపై అడల్ట్ కంటెంట్.. త్వరలో అందుబాటులోకి
కనికరం లేకుండా మహిళను విచక్షణారహితంగా కొడుతున్న దృశ్యాలు ఇందులో రికార్డయ్యాయి. ఇది కాస్తా పోలీసుల కంట పడింది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
దేశంలో ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో దళితులు ఎదుర్కొంటున్న వివక్ష, హింసను ఈ సంఘటన మరోసారి వెలుగులోకి తెచ్చింది. ఫిబ్రవరిలో గుజరాత్ రాష్ట్రం గాంధీనగర్‌లో వివాహ ఊరేగింపులో భాగంగా గుర్రంపై స్వారీ చేసినందుకు దళిత వరుడిపై దాడి చేశారు. వరుడు దాదాపు 100 మంది పాల్గొనే ఊరేగింపులో గుర్రపు స్వారీ చేస్తూ వధువు ఇంటికి వెళుతుండగా మోటారు సైకిల్‌పై వచ్చిన వ్యక్తి అడ్డగించి గుర్రం నుంచి కిందకి లాగి చెంపదెబ్బ కొట్టాడు.
తమ వర్గానికి చెందినవారు మాత్రమే గుర్రపు స్వారీ చేయగలరని నిందితుడు అరిచాడు. దళితుడు గుర్రపు స్వారీ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వరుడిపై కులపరమైన దూషణలు చేయడం స్థానికంగా కలకలం సృష్టించింది.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి