Share News

Italy : పంజాబ్‌ వలస కూలీ దుర్మరణం.. ఇటలీలో నిరసనలు

ABN , Publish Date - Jun 27 , 2024 | 04:08 AM

పంజాబ్‌కు చెందిన ఓ కూలీ మరణం ఇటలీ వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలకు కారణమైంది. ఈ ఘటనపై ఇటలీ ప్రధాని మెలోనీ కూడా స్పందించారు.

Italy : పంజాబ్‌ వలస కూలీ దుర్మరణం.. ఇటలీలో నిరసనలు

రోమ్‌, జూన్‌ 26: పంజాబ్‌కు చెందిన ఓ కూలీ మరణం ఇటలీ వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలకు కారణమైంది. ఈ ఘటనపై ఇటలీ ప్రధాని మెలోనీ కూడా స్పందించారు. బాధ్యులను కఠినంగా శిక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. పంజాబ్‌లోని చాంద్‌ నవాన్‌ గ్రామానికి చెందిన సత్నామ్‌ సింగ్‌(31) దంపతులు ఇటలీ వెళ్లి అక్కడ ఓ యజమాని దగ్గర వ్యవసాయ క్షేత్రంలో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇటీవల వ్యవసాయ పనులు చేస్తుండగానే ప్రమాదం జరిగి సత్నామ్‌ కుడి చేయి పూర్తిగా దెబ్బతిన్నది.

ఇది గమనించిన యజమాని రెంజో లెవాటో సత్నామ్‌కు తీవ్ర రక్తస్రావం అవుతున్నా కూడా ఆస్పత్రికి తీసుకుపోకుండా తన ఇంటి బయట వదిలేశాడు. సత్నామ్‌ భార్య చుట్టుపక్కల వాళ్ల సాయంతో అంబులెన్స్‌కు ఫోన్‌ చేసి ఆస్పత్రికి తరలించింది. సత్నామ్‌ చికిత్స పొందుతూ బుధవారం చనిపోయాడు. ఈ నేపథ్యంలో ఇటలీలో కార్మికుల హక్కులు, వలస కార్మికుల భద్రతపై ప్రశ్నలు తలెత్తాయి. హక్కుల ఉద్యమకారులు నిరసనలకు పిలుపునిచ్చారు. దీంతో, మెలోనీ ఆ దేశ పార్లమెంటు వేదికగా స్పందించారు. ఘటనపై దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

Updated Date - Jun 27 , 2024 | 04:08 AM